పొద్దున పూసిన వెలుగుల తడిని
కాసింత పులుముకుని వెచ్చగా నవ్వుతోంది ఈ సాయంత్రం…
నాలుగు అక్షరాల గువ్వలు ఒక కూడలిగా కూర్చొని
నాలుగు ముక్కలు మాట్లాడుకునేందుకు
కమ్మని వేదిక అయ్యింది ఈ సాయంత్రం..
చిక్కని ఆవుపాలంతటి స్వచ్ఛంగా ఉంది ఈ సాయంత్రం..
కొట్టానికి వెళ్ళేందుకు దౌడు తీస్తూ గిత్తెలు చేసే
శబ్దంలా ఉంది సాయంత్రం..
చుక్కగా చుక్కగా జాలువారుతూ, పుడమి మట్టిని మెత్తగా కదిపే
వర్షపు చినుకులా ఉంది ఈ సాయంత్రం..
కన్నతల్లిలాంటి ఊరిని విడిచిపెట్టి, వలసెళ్ళిపోతూ
తిరిగి తిరిగి వెనక్కి చూసుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న
ఓ యువకుడి మనసులా ఉంది ఈ సాయంత్రం..
వాదాల కత్తెరగాట్లకు బలియైన వాకిలిలాగా,
గుసగుసల గునపాలకు గుచ్చుకున్న రచ్చబండలాగా
ఉంది మరి సాయంత్రం…
తల్లి కొంగును పట్టుకుని తిరుగుతూ పసిబిడ్డ చేసే మారాములాగా,
ఆకాశపు అంచుల్ని పట్టుకుని, దిక్కుల దర్వాజల్ని చుట్టుకుని
ససేమిరా పోనంటుంది ఈ సాయంత్రం..
నన్నప్పుడప్పుడు కలవరపరిచే సాయంత్రంతో నేనన్నాను..
నీ గురించి ఉదయానికి వాకబు చేస్తానని..
అప్పుడది నేనే ఉదయమై పరిమళిస్తానని చెప్పి వెళ్ళిపోయింది.
– డా. తిరునగరి శరత్ చంద్ర, 6309873682