‘ట్రంపె’ట్ ఎప్పుడో ఊదాడు. ఈ రోజుతో గడువు ముగిసింది. కేంద్ర బడ్జెట్ నుండే మెల్లిగా వంగడం ప్రారంభించిన మోడీ సర్కార్ పూర్తిగా పాదాభివందనం చేస్తుందో లేదో చూడాలి. కోట్లాది భారతీయ రైతులకు, పాల ఉత్పత్తిదారులకు నష్టం చేసే విధానం అవలంభిస్తుందో లేదో చూడాలి. ఈ బడ్జెట్‌లోనే కొన్నిరకాల అమెరికన్ ఉత్పత్తులపై పన్నులు తగ్గించిన మోడీ ప్రభుత్వం ఎంతకైనా తెగించవచ్చు. చివరికి కొలంబియా వంటి చిన్న లాటిన్ అమెరికా దేశం తన విద్యార్థులకు సంకెళ్ళు వేయకుండా, అమెరికా యుద్ధ విమానం తన దేశంలోకి రాకుండా, తానే యుద్ధ విమానం పంపి తమ దేశ పౌరులను గౌరవప్రదంగా వెనక్కి తెచ్చుకున్న ఘటన చూస్తే మన సర్కార్ ఎంతకైనా దిగజారుతుందేమో అనిపిస్తుంది.
మల్లయుద్ధంలాగా, కత్తి యుద్ధంలాగా ఇదీ టారిఫ్‌ల యుద్ధం. మరో ప్రపంచ యుద్ధానికి దారితియ్యొచ్చని కొందరం టున్నారు. ఇప్పుడే జోస్యం చెప్పలేము. కానీ ఒక నిజాన్ని బయటపెట్టింది. ప్రపంచీకరణ నిత్యమనీ, సత్యమనీ నయా ఉదారవాద విధానాలు అన్ని దేశాల్ని కష్టాల వైతరణిని దాటిస్తాయన్న ప్రచారం పరమ బూతుమాట అని తేలిపోయింది. ప్రపంచీకరణంటే పేద, ధనిక దేశాలకు ఉభయ తారకంగా ఉంటుందని ఊదరగొట్టిన మాటలు వట్టివేనని తేల్చేసింది.
నేటి ట్రంపు కంపు మాటలు చూస్తే గత 30 ఏండ్లలో అమెరికానే మునిగిపోయిందట. ఆ పేరు మీద ట్రంప్ ప్రారంభించిన టారిఫ్‌ల యుద్ధంగాని, సరైన డాక్యుమెంట్లు లేవని మన దేశంతో సహా అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల పిల్లలను, కార్మికులను గొలుసులతో బంధించి వెనక్కి పంపండంగాని, కెనడా, గ్రీన్‌ల్యాండ్, పనామా, గాజాలను ఆక్రమించుకుంటాననే వలసవాద కోరికను బహిర్గతం చేయటం అమెరికా ఇంతకాలం చెప్పిన సుద్దులన్నీ పోసుకోలు మాటలేనని తేల్చిచెప్తోంది.
గ్లోబలైజేషన్ భజన రాయిళ్లు అంతా ఏదో మోటు సామెత చెప్పినట్టు గమ్మున కూచున్నారు. అమెరికాను చూసి ‘ఆహా’, ‘ఓహో’ అన్న వారి నోళ్లు పడిపోయినాయి. గ్లోబలైజేషన్‌పై భారతదేశంలో మొదట్నించి పోరాటం చేస్తున్న వర్గ సంఘాలకు నేడు పైచేయి సాధించే అవకాశం వచ్చింది.
ఏప్రిల్ 2 నుండి టారిఫ్‌లు వేస్తామన్న దేశాల్లో మనదీ ఒకటి. ముందే చెప్పినట్టు బడ్జెట్ నుండే 55 రకాల అమెరికన్ సరుకులపై టారిఫ్‌లు తగ్గిస్తూ వస్తున్నారు మోడీ సర్కారు వారు. బోర్బన్ విస్కీ, హార్లేడే విడ్‌సన్ మోటారు బైక్‌లపై తగ్గించారు. మొన్న మార్చి 25న ప్రవేశపెట్టిన ఫైనాన్స్ బిల్ సవరణలో గూగుల్ కోసం డిజిటల్ టాక్స్ తగ్గించారు. అనేకరకాల సరుకులపై ఈ పన్ను తగ్గింపును నిర్మలా సీతారామన్ సమర్థించుకున్నారు. అమెరికా నుండి భారత్‌లోకి వచ్చే పెట్రోలియం క్రూడ్‌పై టన్నుకు కేవలం ఒక రూపాయి పన్ను. మొత్తం దిగుమతయ్యే క్రూడ్ పెద్ద మొత్తంలో ఉన్నా దానిపై పన్ను ముష్టి టన్నుకు రూపాయి. అలానే అమెరికా నుండి దిగుమతయ్యే బొగ్గు, ఎల్‌ఎన్‌జీ, విమానాలు మొదలైన వాటిపై కేవలం 2.5 శాతమే పన్ను. నేడు అమెరికా కోరేదేమంటే తన వ్యవసాయ ఉత్పత్తులపైనా, డెయిరీ ఉత్పత్తులపైనా, కొన్ని ముఖ్యమైన మాన్యుఫాక్చర్డ్ సరుకులపైనా పన్నులు తగ్గించాలని పెద్దఎత్తున వత్తిడి చేస్తున్నది.
అంటే దేశ జనాభాలో 45శాతం మంది ఇప్పటికీ వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారన్న వాస్తవాన్ని గమనంలో పెట్టుకుంటే దీని ప్రభావం ఏమేరకుంటుందో గమనించవచ్చు. తలదించుకుని ఉండే మోడీ సర్కార్‌ని చూసి ట్రంప్ మరిన్ని రాయితీలు డిమాండ్ చేస్తున్నాడు.
ఇటీవల అమెరికా కామర్స్ మంత్రి మోడీతో ఏమన్నారంటే నూటనలభై కోట్ల జనం ఉన్నారంటారు, గొప్ప ఆర్థిక వ్యవస్థ ఉందంటారు, మా దగ్గర్నించి నాలుగు జొన్న కంకులు కొనలేరా? అమెరికా రైతులు మీ దగ్గరికి రాలేరు. మీ రైతులు మా దగ్గరికి వస్తారు. అదెలా? అని దబాయిస్తే మొహం కిందికేసుకున్నది మన ప్రతినిధి బృందం. ఇప్పటికే మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, బియ్యం, పప్పులపై టారిఫ్‌లు తగ్గించడానికి భారత ప్రభుత్వం అంగీకరించింది. అమెరికా కోరినవన్నీ ఇస్తే మన ఫార్మారంగం, ఆటోమొబైల్ రంగం బాగా దెబ్బతింటుంది.
పైగా వెనిజులా నుండి ఆయిల్ కొనేవారి నెత్తిన ఇంకో 25 శాతం అదనంగా పన్ను వేస్తామంటున్నాడు ట్రంప్. మన దేశానికి ఇది అదనపు పన్ను పోటు. తోటి జి7 దేశాల్లో ఒకటైన కెనడా అమెరికాకు ఎదురునిలిచింది. మెక్సికో, ఈయూ దేశాలు, చైనా అమెరికాను ఎదిరించి నిలిచాయి. చిన్న, పెద్ద దేశాలు అమెరికా దాష్టీకాన్ని ఏదో ఒక రూపంలో ఎదిరించి నిలుస్తుంటే మన దేశం మన ప్రజల కోసం, ముఖ్యంగా రైతుల కోసం అమెరికా ముందు సాష్టాంగపడరాదు. ఈ యుద్ధంలో గెలవాలి. అమెరికా దాష్టీకాన్ని ఎదిరించి నిలవాలి.