చేప పిల్లల పంపిణీ ప్రారంభించాలి: తోట రమేష్

నవతెలంగాణ – నెల్లికుదురు
ముదిరాజుల అభివృద్ధి కోసం చేప పిల్లలకు టెండర్ పిలిచి చెరువులలో కుంటలో చేప పిల్లలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని తక్షణమే ప్రభుత్వం చేపట్టాలని రాష్ట్ర కార్యదర్శి తోట రమేష్ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని తెలంగాణ మెపా రాష్ట్ర కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి బొట్లపల్లి సంజీవన్ కుమార్ ముదిరాజ్ ల ఆదేశాల మేరకు శుక్రవారం మెపా రాష్ట్ర కార్యదర్శి తోట రమేష్ ముదిరాజ్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం జూన్ మొదటి వారంలో చేప పిల్లలకు టెండర్స్ ప్రక్రియ చేపట్టి, చేప పిల్లల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కానీ ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం చేప పిల్లల టెండర్స్ గాని చేప పిల్లల పంపిణీ ప్రక్రియకు గాని ఎలాంటి ఆదేశాలు ఇప్పటివరకు లేకపోవడం బాధాకరమని అన్నారు. ముదిరాజుల అభివృద్ధి చెందాలంటే చేప పిల్లల ప్రక్రియ కు టెండర్ పిలిచి ఆయా గ్రామాల్లోని చెరువులలో, కుంటలలో చేప పిల్లలను పోసినట్లయితే వాటిని పెంచుకొని పట్టుకొని ఆర్థికంగా ముదిరాజులు అభివృద్ధి చెందే వాళ్లని అన్నారు. కానీ ఇప్పటివరకు చేప పిల్లలను పోసే కార్యక్రమాన్ని చేకపోవడంతో ముదిరాజులు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకారుల జీవన వృత్తి జీవనాధారం చెరువులు, కుంటలు కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని, తెలంగాణ రాష్ట్ర మెపా కమిటీ డిమాండ్ చేస్తుంది అని తెలిపారు.

Spread the love