– నేటినుంచి ఎస్‌ఏ పదోన్నతులకు వెబ్‌ఆప్షన్లు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మల్టీజోన్-2 పరిధిలో 6,013 మంది స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. ఈ ప్రక్రియ నుంచి రంగారెడ్డి జిల్లాకు మినహాయింపు ఉన్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో గతేడాది అక్టోబర్‌లోనే సుమారు 750 మంది స్కూల్ అసిస్టెంట్లు బదిలీ అయ్యారు. దీంతో మల్టీజోన్-2లో 6,763 మంది స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు స్థానచలనం కలిగింది. తాజాగా బదిలీ చేసిన వాటిలో నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 876 మంది ఎస్‌ఏ టీచర్లు బదిలీ అయ్యారు. సంగారెడ్డి జిల్లాలో 834 మంది, వికారాబాద్ జిల్లాలో 641 మంది, సూర్యాపేట జిల్లాలో 575 మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో 562 మంది, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 456 మంది, నాగర్ కర్నూల్ జిల్లాలో 451 మంది, మహబూబ్‌నగర్ జిల్లాలో 397 మంది, జనగామ జిల్లాలో 335 మంది, వనపర్తి జిల్లాలో 310 మంది, జోగులాంబ గద్వాల జిల్లాలో 305 మంది, నారాయణపేట జిల్లాలో 271 మంది చొప్పున మొత్తం 6,013 మంది స్కూల్ అసిస్టెంట్లు బదిలీ అయ్యారు. మల్టీజోన్-1 పరిధిలో 10,083 మంది, మల్టీజోన్-2 పరిధిలో 768 మంది కలిపి ఇప్పటి వరకు 10,851 మంది ఉపాధ్యాయులు పదోన్నతులు పొందిన విషయం తెలిసిందే. మల్టీజోన్-2లో మంగళవారం నుంచి స్కూల్ అసిస్టెంట్ పదోన్నతుల ప్రక్రియకు వెబ్‌ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశమున్నది.
హైదరాబాద్ జిల్లాలో ఇప్పటికే 750 మంది ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు లభించాయి. మల్టీజోన్-2లో రంగారెడ్డి జిల్లా మినహా మిగిలిన 12 జిల్లాల్లో మరో ఆరు వేల మందికి మూడు, నాలుగు రోజుల్లో పదోన్నతులు వస్తాయని విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. ఆ తర్వాత మల్టీజోన్-1, మల్టీజోన్-2లో ఒకేసారి సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ)కు బదిలీల ప్రక్రియను నిర్వహిస్తారు. దీంతో రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తవుతుంది.