ఏజెన్సీలో యథేచ్చగా ఇసుక రవాణా 

– అభివృద్ధి పనుల పేరుతో ఇసుక దోపిడి
– కిన్నెరసాన్ని వాగులో అర్ధరాత్రి ఇసుక తవ్వకాలు 
– కన్నెత్తి చూడని అధికారులు
– జెసిబి యజమాని, కాంట్రాక్టర్ లపై అట్రాసిటీ కేసులు పెట్టాలి
నవతెలంగాణ – ఆళ్ళపల్లి 
ఏజెన్సీలో చట్టాలకు కొంతమంది తూట్లు పొడుస్తూ ఇటీవల కాలంలో అర్ధరాత్రి సమయంలో యథేచ్చగా ఇసుక రవాణా చేస్తున్నారని ఆళ్ళపల్లి బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, అక్షర సమిధ వ్యవస్థాపకులు ఊకె కిషోర్ బాబు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో అభివృద్ధి పేరుతో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా అర్ధరాత్రి రవాణా చేస్తున్నా అధికారులు మాత్రం అటూ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని ఆరోపించారు. కొందరు వ్యక్తులు మండల పరిధిలోని రాయిపాడు గ్రామపంచాయతీ శివారులో కిన్నెరసాని వాగు బ్రిడ్జిపై నుండి జెసిబితో అర్ధరాత్రి సమయంలో ఇసుకను తవ్వి ట్రాక్టర్ లలో తరలిస్తున్నారని చెప్పారు. కిన్నెరసాని బ్రిడ్జికి 500 మీటర్ల లోపల ఇసుక తవ్వకాలు జరుపొద్దనే నిబంధనలు ఉన్నా వాటిని  బేఖాతరు చేస్తూ ఇసుక తవ్వకాలు చేయడంతో ఆళ్ళపల్లి మండలంలో గత సంవత్సరం కనీవినీ ఎరుగని రీతిలో కురిసిన భారీ వర్షాలకు ఆర్ అండ్ బి రోడ్ పూర్తిగా కోతకు గురై నేటికీ ఇంకా మరమ్మతులకు నోచుకోలేదని, రాయిపాడు ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ కూలిపోయిందని, రామచంద్రయ్య గుంపు, ముత్తపురం గ్రామ పరిసరాలలో ఇసుక దిబ్బలను తవ్వడం వలన వర్షాకాలం వరదలకు సుమారు 15 ఇండ్లు నీట మునిగి శిధిలావస్థకు చేరుకున్నాయని, మూడు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఇంత జరిగినా స్థానిక నాయకులు కొంతమంది కాంట్రాక్టర్లతో కుమ్మకై వంతెన పైనుండి అర్ధరాత్రి జెసిబితో యథేచ్చగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని మండిపడ్డారు. ఒకసారి ఇటువంటి వాటిని గమనించిన గ్రామ యువకులు జెసిబి యజమానిపై రెవెన్యూ కార్యాలయంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన స్పందించలేదని వాపోతున్నారు. ఇదే అదునుగా చేసుకొని మరల గురువారం అర్ధరాత్రి ఇసుక తవ్వకాలు ప్రారంభించారని, ప్రశ్నించిన గ్రామస్తులకు అభివృద్ధి పనుల కోసం ఇసుక తవ్వకాలు జరుపుతున్నామని, అన్ని అనుమతులు వున్నాయని దబాయించారని పేర్కొన్నారు . అన్ని పర్మిషన్లు వుంటే అర్ధరాత్రి తవ్వకాలు ఎందుకు జరుపుతున్నారని గ్రామస్థులు ప్రశ్నించగా ఎటువంటి సమాధానం వారినుంచి లేదన్నారు. శుక్రవారం సైతం అర్ధరాత్రి తోలకాలు వుంటాయనే సమాచారం వుందని తెలిపారు. అభివృద్ధి పనుల కోసం ఏజెన్సీ గ్రామాలను పనంగా పెట్టి చట్టానికి విరుద్ధంగా ఇసుక తవ్వకాలు చేస్తున్న జెసిబి యజమాని, కాంట్రాక్టర్ లపై అట్రాసిటీ కేసులు పెట్టేలా, డంప్ చేసిన ఇసుకను సీజ్ చేయాలని, ఇటువంటి సంఘటనలు మరల పునరావృతం కాకుండా జిల్లా ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Spread the love