– నిధులకు కత్తెర..
శ్వేతసౌధం: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకొన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)కు అమెరికా నుంచి వెళ్లే నిధులకు ఆయన బ్రేక్ వేశారు. ఈ విషయాన్ని ఓ ఆంగ్ల వార్తా సంస్థ వెల్లడించింది. ట్రంప్ కార్యవర్గం అనుసరిస్తున్న వ్యాపార రక్షణాత్మక వైఖరిని మరింత బలోపేతం చేసుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకొన్నారు.ట్రంప్ అధికారంలోకి వచ్చింది మొదలు ప్రపంచస్థాయి వేదికల నుంచి అమెరికాను పక్కకు తప్పిస్తున్నారు. ఈక్రమంలో ఆయన ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నుంచి అమెరికా వైదొలిగినట్టు ప్రకటించారు. తాజాగా డబ్ల్యూటీవోకు నిధులను నిలిపివేశారు. దీంతోపాటు అనేక దేశాలకు అందించే విదేశీ సాయాన్ని కూడా ఆయన నిలిపివేశారు. వాస్తవానికి 2019లోనే ట్రంప్ డబ్ల్యూటీవోను బలహీన పర్చారు. అప్పుడే ఆ సంస్థలో న్యాయమూర్తుల నియామకాలను ఆయన నిలిపివేశారు. దీంతో ఆ సంస్థ వివాద పరిష్కార వేదిక విభాగం బలహీన పడిపోయింది. ఇది తరచూ తన పరిధిని దాటి మరీ తీర్పులు ఇస్తోందని ఎప్పటినుంచో వాషింగ్టన్ ఆరోపిస్తోంది. 2024లో డబ్ల్యూటీవో నిర్వహణకు 232 మిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి. ప్రపంచ వాణిజ్యం ప్రతిదేశం వాటా ఆధారంగా ఈ సంస్థకు నిధులు సమకూరుస్తారు. ఇక అమెరికా నుంచి దీనికి దాదాపు 11శాతం అందుతాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన అదనపు సుంకాలు ఏప్రిల్ 2వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. మరోవైపు ఈ వారమే అమెరికా దిగుమతి చేసుకొనే కార్లపై 25శాతం సుంకాలను ప్రకటించారు. ఈనేపథ్యంలో ఆయన అమెరికాను డబ్ల్యూటీవో నుంచి పక్కకు తెస్తారనే ప్రచారం జోరందుకొంది. అక్టోబర్ 2 నుంచి ట్రంప్ లిబరేషన్ డే అని అభివర్ణిస్తున్నారు. కొత్త పన్నుల నుంచి అమెరికా ప్రభుత్వానికి 100 బిలియన్ డాలర్ల ఆదాయం రానుందని శ్వేతసౌధం వర్గాలు అంచనా వేశాయి. కాకపోతే ఈ నిర్ణయాలు ప్రపంచ పంపిణీ వ్యవస్థలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే అమెరికా నిర్ణయాలను డబ్ల్యూటీవోలో సవాలు చేస్తామని చైనా వెల్లడించింది.