ఎన్డీఏలో యూసీసీ మంట

UCC flame in NDA– మా ఎజెండాలోనే ఉంది : బీజేపీ
– ఏకపక్షం కాదు…ఏకాభిప్రాయం అవసరం : జేడీయూ
నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి వారం రోజులైనా కాలేదు. అప్పుడే బీజేపీ వైఖరిపై మిత్రపక్షాలు కస్సుబుస్సు లాడుతున్నాయి. ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) తమ ఎజెండాలోనే ఉన్నదని బీజేపీ నేత, కేంద్ర మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘావాల్‌ స్పష్టం చేయగా అలాంటి ఏ చర్య చేపట్టినా ఏకాభిప్రాయంతోనే జరగాలని ఎన్డీఏలో మూడో అతిపెద్ద భాగస్వామ్య పక్షమైన ఐక్య జనతాదళ్‌ (జేడీయూ) తెగేసి చెప్పింది. తమ పార్టీ యూసీసీకి వ్యతిరేకం కాదని, అయితే అది ఏకాభిప్రాయంతోనే అమలు జరగాలని జేడీయూ జాతీయ కార్యదర్శి జేసీ త్యాగి చెప్పారు.
న్యూఢిల్లీ: యూసీసీ వంటి ముఖ్యమైన విధాన నిర్ణయాలను బీజేపీ ఏకపక్షంగా తీసుకోకూడదని, ఎన్డీఏ సంకీర్ణ భాగస్వాములను విధిగా సంప్రదించాలని కమల దళానికి జేడీయూ స్పష్టమైన సంకేతం పంపిందని త్యాగి ప్రకటన చెబుతోంది. న్యాయ శాఖ సహాయ మంత్రిగా (స్వతంత్ర హోదా) ఇటీవలే నియమితులైన మేఘావాల్‌ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ యూసీసీ ఇప్పటికీ తమ పార్టీ ఎజెండాలోనే ఉన్నదని తెలిపారు. ‘అది మా ఎజెండాలోనే ఉంది. మున్ముందు ఏమి జరుగుతుందో చూడండి’ అని ఆయన చెప్పారు. యూసీసీ అమలును బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టో పార్టీ ఎజెండాగా చేర్చిన విషయం తెలిసిందే. యూసీసీపై 2017 నుండి తమ పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని బీజేపీకి జేడీయూ గుర్తు చేస్తోంది. ఆ సంవత్సరం యూసీసీపై బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ లా కమిషన్‌కు తమ అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేశారు. ‘యూసీసీని తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే అలాంటి అంశాలపై విస్తృత ఏకాభిప్రాయం ద్వారానే నిర్ణయాలు తీసుకోవాలి తప్పించి ఏకపక్షంగా రుద్దకూడదు’ అని లా కమిషన్‌కు సమర్పించిన లేఖలో నితీష్‌ తెలిపారు. వేర్వేరు మతాలు, విభిన్న జాతుల కోసం చట్టాలతో, పాలనాపరమైన సూత్రాలతో సున్నితమైన సమతూకం పాటిస్తున్న దేశం మనదని నితీష్‌ వివరించారు. యూసీసీని రుద్దేందుకు చేసే ఏ ప్రయత్నమైనా సామాజిక ఘర్షణకు దారితీస్తుందని, మత స్వేచ్ఛకు సంబంధించి రాజ్యాంగం కల్పించిన గ్యారంటీపై నమ్మకాన్ని వమ్ము చేస్తుందని ఆయన తెలిపారు. లా కమిషన్‌ పంపిన ప్రశ్నావళిపై నితీష్‌ కుమార్‌ ఆ సమయంలో అభ్యంతరం వ్యక్తం చేశారు. నిర్దిష్ట పద్ధతిలో స్పందించేలా సమాధానాలు ఇచ్చే వారిపై ఒత్తిడి చేసే విధంగా ఆ ప్రశ్నావళిని రూపొందించారని ఆయన విమర్శించారు.

Spread the love