నవతెలంగాణ-హైదరాబాద్: శివసేన (UBT) అధినేత ఉద్ధవ్ థాకరే కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ బలోపేతానికి మహారాష్ట్రవ్యాప్తంగా శివసేన (UBT) కార్యకర్తలను కలిసేందుకు ఒక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇటీవల తిరుగుబాటు చేసిన పార్టీ ఎంపీల నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు UBT సేన ఎంపీ సంజయ్ రౌత్ మీడియాకు షెడ్యూల్ చెప్పారు. ఉద్ధవ్ థాకరే జూన్ 27న యవత్మాల్ పర్యటనతో ఈ ప్రచారాన్ని ప్రారంభిస్తారని, ఆ తర్వాత విదర్భలోని వాషిమ్, మరాఠ్వాడా ప్రాంతంలోని హింగోలిని సందర్శిస్తారు. జూన్ 28న ఆయన పర్భనీ, ధారాశివ్‌లను, ఆపై జూన్ 29న షిర్డీని సందర్శిస్తారు.
తిరుగుబాటు ఎంపీల్లో ఎంపీ సంజయ్ దేశ్‌ముఖ్(శివసేన (UBT) ), ఎంపీ నాగేశ్ పాటిల్ అష్టికర్(హింగోలి ), ఎంపీ సంజయ్ జాదవ్(పర్భనీ ), ఎంపీ భాసాహెబ్ వాక్‌చౌరే(షిర్డీ), ఎంపీ సంజయ్ దినా పాటిల్(ముంబై నార్త్ ఈస్ట్), ఎంపీ ఓంప్రకాష్ రాజే నింబాల్కర్(ఉస్మానాబాద్) ఇటీవల (UBT) పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరుకాలేదు. వీరంతా ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరనున్నట్లు సమాచారం.



