వేణు గీతికకు ప్రేమతో…
ఎలా ఉన్నావ్ బంగారు తల్లి? ఉగాది పండుగ వస్తోంది, మొన్న ఒక రోజు ఆడిగావు ‘అమ్మా! ఉగాది పచ్చడిలో ఏమేమి వేసి చేస్తారు’ అని. ఇన్నేండ్లుగా నా దగ్గర ఉన్నావు, నేను చేసిన పచ్చడి తినటం, ఆడు కోవడానికి వెళ్ళటం, లేదా చదువుకోవడానికి కూర్చోవడం. నేను ఎప్పుడూ నేర్చుకోమని బలవంత పెట్టలేదు, కాకపోతే ఒక్క విషయం చెప్పేదాన్ని జీవితంలో ఎదురయ్యే కష్ట, సుఖాల కలయికే ఈ పచ్చడి పరమార్ధం.
పురాణాల ప్రకారం ఎన్నో కథలు ఉన్నాయి కానీ, ప్రస్తుతం అవి అనవసరం. ఉగాది మన తెలుగు వాళ్ళకే కాదు, కన్నడ వాళ్ళకి కూడా. గుడిప డవాగా మరాఠీలు జరుపుకుంటారు. కొంచెం టూకీగా ఉగాది గురించి చెప్తాను నాన్న. ఉగా అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది. అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. చైత్ర శుద్ధ పాడ్యమినాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
ఉగాదినాడు పొద్దున్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని, స్నానం చేసి, దేవుడి దగ్గర దీపం పెట్టి ఉగాది పచ్చడి నైవేద్యంగా పెడతారు. ఈ ఉగాది పచ్చడి ఆరు రుచుల కలయిక. దీనినే షడ్రుచులు అంటారు. బెల్లం, ఉప్పు, వేప పువ్వు, చింతపండు, పచ్చి మామిడి ముక్కలు, కారం.
వీటికి ఒక్కొక్క దానికి నిర్వచనం కూడా ఉంది
బెల్లం: ఆనందానికి ప్రతీక.
ఉప్పు: జీవితంలో ఉత్సాహానికి సంకేతం.
వేప పువ్వు: బాధ కలిగించే అనుభవాలు.
చింతపండు: నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు.
పచ్చిమామిడి ముక్కలు: దీని వగరు కొత్త సవాళ్లకు గుర్తు
కారం: సహనానికి సంకేతం.
ఉన్నంతలో ప్రతి పండగను ఆనందంగా జరుపుకోవాలి. అప్పుడే దీని ద్వారా మీకు, భవిష్య తరాల వారికి వాటి ప్రాముఖ్యత గురించి తెలుస్తుంది. అంతేకాకుండా ఏ పండగ చూసినా అది ప్రకృతితో ముడిపడి ఉంటుంది. అందులోనూ ఉగాది అయితే ఏ కోణంలో చూసిన ప్రకృతి ఆధారంగానే కనిపిస్తుంది. నాన్న కిందటి ఉగాది పండగకి నీ దగ్గరకు వచ్చాము. ఈ సారి నువ్వే అన్ని తెచ్చుకుని చేసుకోవాలి. నువ్వు పండగ వస్తోంది, పచ్చడి ఎలా చేసుకోవాలి అని అడగటం, అది కూడా ఈ సారి ఆదివారం రావడం, నేను అమ్మలేఖ ద్వారా నీకు తెలియ చెప్పడం చాలా సంతోషంగా ఉంది.
కొత్త బట్టలు వేసుకుని, ఉగాది పచ్చడి చేసుకుని తినే సెరు. కొంతమంది పిల్లలు షడ్రుచులతో తినలేరని వారి కోసం చెరుకు ముక్కలు, అరటి పండు లాంటివి వేస్తారు. పండుగ నాడు మేము దగ్గర లేమని బాధపడకు చిట్టితల్లి. సంతోషంగా ఉండు. ఏడాదంతా సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటావు.. ఉంటాను…
ప్రేమతో అమ్మ
హొ- పాలపర్తి సంధ్యారాణి