‘ఉగాది’… ఆ పదంలోనే ప్రత్యేకత వుంది. ‘ఉ’ అంటే నక్షత్రం, ‘గ’ అంటే గమనం. ఉగాది అంటే నక్షత్ర గమన ప్రారంభం. సూర్యుడూ నక్షత్రమే కదా! సూర్యమానాన్ని అనుసరించి మనకు ‘రుతువులు’ ఏర్పడుతున్నాయని జనులందరికీ తెలిసిన నగసత్యం కదా!
రుతువులలో మొదటిది ‘వసంత రుతువు’. (చైత్రవైశాఖ మాసములు). ఈ రుతుధర్మం చెట్లు చిగిర్చి వూవులు పూయటం, మంచు విస్తారంగా కురియటం, చంద్రుడు చల్లని కాంతులను విరజిమ్ముటం. భౌతికంగా మనకు ఇన్ని ప్రత్యేకతలు మరే రుతువులోనూ లేవు. పైగా చైత్ర శుద్ధ పాడ్యమి నుండే ప్రారంభమవుతాయి. అంటే ఓ ప్రత్యేక మార్పు ఈనాటి నుండే ప్రారంభించబడుతుంది. ఇలా ఎవరూ అడగకుండానే వరం కదా ఆ మార్పు! కనుకనే మానవులకు ఆహ్లాదకరం ఆనందదాయకం. ఈ మార్పును భౌగోళికంగా మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలలో చూస్తాం.
భౌగోళికంగానే కాక మరో రహస్యం ప్రకృతి రమణీయతను ప్రత్యేకాకర్షణను ఈ రుతువునందే చూస్తాం. మల్లె, జాజి, మందార, గులాబి, చేమంతి, లిల్లీ వంటి ఎన్నో సుగంధ సౌరభాల, మకరందాల పూలెన్నో ఈ వసంతం సొంతం. వాటిని గ్రోలగ కోటి ఆశలతో సీతాకోక చిలుకలు, తూనీగలు, తుమ్మెదలు మొదలగు పలు రకాల కీటక భ్రమరాలు ఆ పూపొదలలో వాలి మకరందాన్ని సేవిస్తాయి. సేవించిన ఆ మకరందాన్ని పలు చోట్ల పెట్టెలలో దాస్తాయి. అవి దాచిన ఆ పెట్టెలనే మనం ‘తేనెతుట్టెలు’ అంటున్నాం. ఈ తేనె ఎంత మధురమో ఎన్ని రకాల వ్యాధులకు నివారణా ఔషధమో మనందరికీ తెలిసిన అంశమే కదా! ఈ మధురమైన తేనె, అందుకోసం పరిభ్రమించే ఈ సీతాకోక చిలుకలు, తుమ్మెదలు, అవి తారాడే ప్రదేశాలు, మన మనస్సును రంజింపజేసే రమణీయ, కమనీయ దృశ్యాలు ముగ్ద మనోహరం! పువ్వులు వికసించక మునుపే లేత చిగురులను తిన్న కోయిల కంఠానికి స్వర మకరందాలద్దబడి లలిత సుధాగానం చేస్తాయి. కోయిల పాటలు, నెమలుల నృత్యాలు ప్రత్యేకంగా ఈ వసంతంలో మనకు కన్నుల విందు చేసే రంగుల హరివిల్లు ముమ్మాటికీ ఈ వసంతానిదే! అలా వాటన్నింటి నడుమ సాగే సుందర స్వప్నాన్ని గాక మరే ఇతర కీడును ఆలోచించలేదు గదా మానవ మనోగం. అందుకే ‘ఉగాది’ అంటే ఉషస్సులతో నిండిన యశస్సులు ఊహల ఊయలలు. మానవ జీవితం సింహావలోనం చేసుకుంటే సాక్షాత్కరించేదే ‘ఆశావహం’. ఇందుకే ఆశల పల్లకి – ఊహల ఉయ్యాల ఉగాది.
భౌగోళిక వనరులు, వసతులు, ప్రకృతి ప్రసాదిత పంచ భూతముల ఫల లబ్దితో ఈ వసంతం నాటికి గున్న మావిళ్లు కాపు కాస్తాయి. వేప పూస్తుంది, బెల్లపు చెరుకు విస్తారంగా వస్తుంది. కొత్త చింతపండు రేకు విప్పుతుంది. కొత్త కారం కొసమెరుపుతో ఉసిళ్లు కొట్టిస్తుంది. ఉప్పు రుచి ఊరిస్తుంది. ఇలా షడ్రుచులతో చేసిన ఉగాది పచ్చడి శ్లేష్మ వాతాలను హరిస్తుందని నమ్ముతాం. నమ్మకం కాదు, గుణాత్మక పరిశీలన ఉగాది పచ్చడికి కలదు. ఇలా తెలుగింటి ప్రతిష్టాత్మక ప్రగతిశీలన ఉగాదికే వుంది. అందుకే ఆనందోత్సాహాల సమ్మేళనం ‘ఉగాది’.
ఆ క్రమానుసారమే ఈనాడు కొత్తగా దేనిని ప్రారంభించినా ‘జయం మనదే’ అనే ఆశతో వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు కొత్త దస్త్రాలను ప్రారంభిస్తారు. రైతులు పొలం, పుట్ర కొనుక్కుంటారు. కాడి, కవ్వం, కుదురు కదలికల వేగం పెంచుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఉగాది కోటిరికాల పేరిట కొత్త కాపురాలు కోకొల్లలుగా పెడతారు.
మరి ప్రతిరంగంలోనూ నూతనత్వం నిండిన ఈ ఉషస్సులు మనుషుల జీవితాలనే మార్చేసే పండుగ ఉగాది. కనుకనే ప్రతి ఒక్కరిలోనూ అదే స్పందన. అందుకే పాలి భాగస్థులవుతారు. ఎన్ని చెప్పుకున్నా నగసత్యం ఏమిటంటే పట్టణాలు, నగరాలు, మహా నగరాలలో కంటే గ్రామీణంలోనే పల్లె పల్లెలో నేటికీ ప్రకృతి రమణీయత విరాజిల్లుతూనే వుంది.
ఏటా పట్టణాలు, నగరాలు, మహా నగరాలు నిర్మానుష్యం అవుతూ జనం పల్లెబాట పడుతున్నారు కదా ఈ ఉగాదికి. అంతే కాదు చివరికి ప్రజలను పాలిస్తున్న ప్రభుత్వాలు సైతం ‘పంచాంగ శ్రవణం’ చేస్తున్నాయంటే ‘ఉగాది’ ఆశల పల్లకి ఊహల ఊయల కదా! ఆశల పల్లకిలో ఊహల ఊయలలూగుటకు అందరికీ హక్కు ఉంది. ఆ హక్కుల కొరకు ఉద్యమిస్తే తీర్చాల్సిన సమగ్ర ప్రణాళికలు ప్రభుత్వాలకు ఉండాలి. కనుకనే ఉగాది ప్రజలది, ప్రభుత్వాలది, అందరిదీ. అందుకే రచయిత ఉగాది ఉషస్సులు, ఊహల ఊయలలు అంటూ వైవిధ్యభరితంగా కవితా గీతికను మన ముందుంచారు. ఆశ్వాదిద్దాం రండి.
– బోడపాటి అప్పారావు, 9381509814