దుబాయ్: పాకిస్తాన్-యుఎఇ వేదికలుగా ఈనెల 19నుంచి జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి అంపైర్ల జాబితాను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) బుధవారం వెల్లడించింది. ఇందులో 12మంది ఫీల్డ్ అంపైర్లు ఉండగా.. ఆరుగురు రిఫరీలు ఉన్నారు. పాకిస్తాన్‌లోని కరాచీ, లాహోర్, రావల్పిండి వేదికలుగా.. యుఎఇలోని దుబారు వేదికగా ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్-భారత్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌కు రిచర్డ్ కెటెల్‌బ్రో రిఫరీగా.. క్రిస్ గఫనే, కుమార ధర్మసేన ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. వీరితోపాటు రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, పాల్ రీఫిల్, రాడ్ టక్కర్ రిఫరీలుగా వ్యవహరించనున్నట్లు ఐసిసి ఆ ప్రకటనలో తెలిపింది. ఇక ఫీల్డ్ అంపైర్లుగా మిఛెల్ గాఫ్, ఆడ్రియన్ హోల్డ్‌స్టోక్, అహసాన్ రాజా, షర్ఫుడొల్లా ఇబ్నే సాహెబ్, అలెక్స్ వార్ఫ్, జో విల్సన్ ఎంపికయ్యారు. వీరంతా భారత్ వేదికగా 2023లో జరిగిన ఐసిసి వన్డే ప్రపంచకప్‌కు బాధ్యతలు నిర్వర్తించినవారే.