బీఆర్‌ఎస్‌ పాలనలో నెరవేరని తెలంగాణ ఆకాంక్షలు

– ధనిక రాష్ట్రమంటూ అప్పులకుప్పను చేసింది
– సింగరేణిలో కుంభకోణంపై విచారణ జరిపించాలి : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ- గోదావరిఖని
బీఆర్‌ఎస్‌ దశాబ్ద పాలనలో తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. గోదావరిఖనిలో శనివారం సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ కేంద్ర కమిటీ సమావేశాల సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాలరాసిందని, నియంతృత్వ పాలన సాగించిందని అన్నారు. ధనిక రాష్ట్రమంటూ అప్పులకుప్ప చేసిందని, అందుకే ప్రజలు ఎన్నికల్లో ఓడించారని చెప్పారు. ఇప్పటికైనా ఆ పార్టీ నిర్మాణాత్మకంగా ప్రజలకు దగ్గరై పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్‌ గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు చేయొద్దని, తెలంగాణ అభివృద్ధి.. ఆకాంక్షలు నెరవేర్చాలని అన్నారు. గత పాలనలో అన్ని సంస్థలనూ ఆర్థికంగా దెబ్బతీశారని, విద్యుత్‌ ఇరిగేషన్‌తోపాటు సింగరేణిని కూడా నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం దగ్గర డబ్బు లేదని, అయినా సర్దుబాటు చేస్తోందని చెప్పారు. సింగరేణిలో గత సీఎండీ శ్రీధర్‌ వేలకోట్లు దోపిడీ చేశారని, ఈ కుంభకోణంపై న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. మేడిగడ్డ బ్యారేజీ వల్ల మేలు కంటే కీడు ఎక్కువ జరిగిందన్నారు. తెలంగాణ అధికార గీతం, చిహ్నంపై బీఆర్‌ఎస్‌ రాజకీయం చేస్తూ ధర్నాలు చేయడం మంచిది కాదని, వారి అభిప్రాయాలు చెబితే మంచిదని సూచించారు. అధికారిక చిహ్నంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, అందరితో చర్చించాకనే నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారని తెలిపారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రెండూ బూర్జువా పార్టీలేనని, కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తూనే ప్రజాసమస్యలపై పోరాడుతూనే ఉంటామని చెప్పారు. దేశంలో బీజేపీ అత్యంత ప్రమాదకారి అని, అందువల్లనే కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తున్నామని, రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ కూడా ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. మోడీ ఎన్నికల్లో ముస్ల్లిం వ్యతిరేకత విద్వేషం రెచ్చగొట్టి హిందూ పేరు మీద గెలవాలని ప్రచారం చేశారని విమర్శించారు. కాంగ్రెస్‌ గెలిచిన చోట సీపీఐకి బలముందని, పార్టీ బలోపేతంపై దృష్టి పెడుతున్నామని అన్నారు. ఈ సమావేశంలో యూనియన్‌ అధ్యక్షుడు వి.సీతారామయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, నాయకులు ఎల్‌.ప్రకాశ్‌, వైవి.రావు, మడ్డి ఎల్లయ్య, కె.స్వామి, ఆరెల్లి పోషం, కన్నం లక్ష్మి నారాయణ, కె.కనకరాజు తదితరులు పాల్గొన్నారు.

Spread the love