నవతెలంగాణ-ఆర్మూర్
కేంద్ర ప్రభుత్వం రైతులను నట్టేట ముంచడానికి యూరియా యాప్ తీసుకొచ్చిందని, దాన్ని వెంటనే ఎత్తివేయాలని సీపీఐ(ఎ) డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ బుధవారం డిమాండ్ చేశారు. పట్టణంలోని శాస్త్రి నగర్ లో సీపీఐ(ఎ) కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే మోయలేని భారాలను ప్రజలపై మోపి, వారి నడ్డి విరగ్గొడుతోందని అన్నారు. రైతుల ప్రభుత్వం అని చెప్పుకుంటూనే యూరియా యాప్ తీసుకొచ్చి నేడు రైతులను తీవ్ర ఇబ్బందుల గురిచేస్తోందని దుయ్యబట్టారు. ఈ యాప్ వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు. యాప్ ఉన్నా.. యూరియా అందుబాటులో ఉండడం లేదని ధ్వజమెత్తారు.
చాలా మంది రైతులకు యాప్ ను వాడే విధానం తెలియడం లేదని అన్నారు. రైతులకు సరిపడా యూరియా ఉంటే యాప్ తో పనేముందని ప్రశ్నించారు. ఇప్పటికీ చాలా మంది రైతులు యూరాయా కోసం రాత్రింబవళ్లూ రోడ్లపై క్యూ లైన్ లో వేచిచూడాల్సిన దుర్మార్గపు పరిస్థితిని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. రైతులందరికీ స్మార్ట్ ఫోన్లు లేక, చిన్న ఫోన్లతో యాప్ డౌన్లోడ్ కాక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. తక్షణమే యూరాయా యాప్ ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.
అదేవిధంగా ఎరువులు, విత్తనాలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచిందని మండిపడ్డారు. ఇది ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాదని, పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందని విమర్శించారు. స్వామినాథన్ కమిటీ సిఫారసు ప్రకారం రైతులు పెట్టిన పెట్టుబడికి సగం కలిపి ఇవ్వాలని, సి ప్లస్ టు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదే మాదిరిగా రబీ పంటకు కావలసిన ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. లేనియెడల రైతులతో కలుపుకొని భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. సమావేశంలో డివిజన్ కమిటీ సభ్యులు కొండగంగాధర్ ,కుతాడి ఎల్లయ్య, నవీద్ తదితరులు పాల్గొన్నారు.



