‘ఊరిపేగు’ తెంచుకు వెళ్లిపోయాడు

'ఊరిపేగు' తెంచుకు వెళ్లిపోయాడు”ఎన్ని వెలుగులు విరజిమ్మినా ఎప్పుడోఒకప్పుడు తోక చుక్కలా రాలిపోవాల్సిందే… ఎంత అందంగా విరబూసినా ఎంత ఆనందాలను ఒలకబోసినా, విరజాజులు, మరుమల్లెల్లా మరునాటికి రాలిపోవాల్సిందే. లేరనుకున్నవాళ్లు ఎప్పుడో ఒకప్పుడు ఆటోలోంచో, ఫొటోలోంచో దిగిరావచ్చు, తిథిరోజైనా అతిథిగానైనా…” అంటూ రాసిన అక్షరాల జ్ఞాపకం నా మందిలో కదలాడుతూనే ఉంది. ఆయన రాసుకున్నట్టుగానే ఫొటోలో నవ్వుతూ పలకరిస్తూనే వున్నాడు. రెబ్బారం రాంబాబుగా పిలుచుకునే కొలిపాక రామారావు. ఒక్క రెండు నెలల క్రితమే తను ముప్పయ్యేండ్లుగా రాసుకుంటున్నయన్నీ మా అమ్మాయి కోరిక మేరకు వేస్తున్నానని చెప్పి ‘ఊరి పేగు’ అనే కవితా సంపుటిని వెలువరించి నాకు పంపాడు. ఇందులో డెబ్బయి ఐదు కవితల్లో అనేక కవితలు నాకు వాట్పప్‌లో పట్టి అభిప్రాయం కోరేవాడు. నేను కొన్ని సోపతి, దర్వాజాలో ప్రచురించాను కూడా. కనీసం నెలకోసారి ఫోన్‌ చేసి మాట్లాడేవాడు. ఈ నెల ఆయన పేరుతోనే వున్న వాట్సప్‌లో ఫొటో కనపడింది. నాన్న పోయారన్న రాంబాబుగారి అబ్బాయి మెసేజ్‌. మాట్లాడుతూనే వెళ్లిపోయినట్టుగా అనిపించింది. ఒక్క గంట మౌనంగా వుండిపోయాను.
ఖమ్మం వైరా రోడ్డులో మెడినోవా డయాగస్టిక్‌ సెంటర్‌ మాకొకప్పుడు సాహిత్య కేంద్రంగా వుండింది. ఎందుకంటే దాని అధినేత డా||హరీష్‌ రచయిత, సాహితీకారుడు. దానిపైనే సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగిగా రాంబాబుగారు పనిచేశారు. సాహితీస్రవంతి నిర్వహించే కవి సమ్మేళనాల్లో పాల్గొనేవారు. ప్రముఖ రచయిత నాటకకర్త బాణాల కృష్ణమాచారి శిష్యుడుగా వీరిని పరిచయం చేయడంతో మరింత దగ్గరయ్యాం. అతను మామిళ్లగూడెంలో నిర్వహించిన మాంటిసోరి స్కూల్‌లో కొన్ని సాహిత్య కార్యక్రమాలు నిర్వహించాం. చాలా నిరాడంబరంగా తాను ఎదిగొచ్చిన నేలను, పరిస్థితులను నిత్యం స్మరణలో, జ్ఞాపకాలతో జీవించిన మంచి మనిషి రాంబాబు.
”అగపడకుండా పోవడానికి, అంతర్థానమై పోనక్కరలేదు, అంతరించి పోనూ అక్కరలేదు, అవసరం లేకుండా పోతే చాలు.. చావడి ప్రపంచీకరణ చెంది, ఏడంతస్తుల మేడయినప్పుడు, అరుగు కనుమరుగయి పోయింది. విశాలం ఉండచుట్టిన కాగితంలా ఇరుకై ఊపిరాడకుండా పోతోంది” అంటూ తన ఊరి పూర్వపు జ్ఞాపకాలను, ప్రపంచీకరణ ఫలితాలను కవిత్వంలోకి తెచ్చి బాధపడతాడు రాంబాబు. ”మనిషి ఊపిరిపోయినంత తేలిక కాదు/ మనుగడ ఇచ్చిన ఊరుపోవడం… మట్టి పెకలించుకుని పుట్టిన ఊరు/ పుట్టెడు దు:ఖంతో తల్లివేరు తెంచుకుని/ నేల వదిలి నీటిలోకి వలసపోతోంది… కళేబరాలు మిగిల్చినా, కరువే బాగుంది/ కనీసం మా ఊరు మాకుంది/ కాటకాలతో నెర్రెలు బాసినా మా నేలకూ, ఊరికీ ఓ పేరుంది…” అంటూ పోలవరం ముంపు ప్రాంతాలపై అక్కడి జనహృదయాన్ని అక్షరబద్దం చేశాడు కవి. దేశంలో మతోన్మాదం, నిరంకుశత్వం ముంచుకొస్తూ, ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యంగా మారుస్తున్న పరిస్థితులపై తీవ్రంగా స్పందించేవారు రాంబాబు. తన ‘కుట్ర’ కవితలో ”వాడు ముసుగుతీసేస్తున్నాడు/ వాడు రాజ్యాన్ని శాసిస్తున్నాడు బహుపరాక్‌, మేధావులందరినీ కొనేయండి, వాళ్ల బలహీనత చిట్టా పట్రండి, నిఘా విభాగంలో భద్రపరచండి, ఎన్నికల్లో ఎవడు గెలిస్తే ఏముంది? గెలిచినోడికి గూలాల్‌ చల్లేసి మన మందలోకి తోసేయండి” అంటూ కుట్రను బహిర్గతం చేస్తాడు.
‘ధాన్యం కంకులు ధర్మం కోసం ధర్నాకు దిగాయి ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ అంటూ పండించే చేతులన్నీ దండయాత్ర ప్రకటించాయి.
మొండితనపు తొండిరాజు, మెడలు వంచి రమ్మంటూ పంచనదుల సాక్షిగా ప్రతినబూని చెబుతున్నాయి.
గోధుమ గింజల గమ్యం గొప్పోళ్ల గోదాములు కాదంటూ అంబాని, ఆదానీలు కాదూ దేశమంటే మేమంటూ అన్నం మెతుకు యుద్ధానికి సిద్ధం అయింది!’ అంటూ ఆనాటి ఢిల్లీలో రైతులు చేసిన ఉద్యమాన్ని ఎంతో ఉద్రేకంగా, ఉద్వేగంగా అక్షరీకరించాడు. జ్ఞాపకాలను ఊరి జ్ఞాపకాలను, మానవ సంబంధాలను ఎంతో హృద్యంగా అక్షరబద్ధం చేసిన రాంబాబు గారు ‘ఊరి పేగు’ స్మృతి గీతాలను మనకందించి వెళ్లిపోయారు. సాహితీ చర్చలన్నా, కవిత్వమన్నా ఎంతో ప్రేమతో ప్రతిస్పందించే రాంబాబు మానవీయ విలువలున్న మంచి స్నేహితుడు. తన మొదటి సంపుటినే చివరి సంపుటిగా చేసి మననుండి వెళ్లిపోయిన కొలిపాక రామారావు గారికి నివాళులు.
– కె.ఆనందాచారి, 9948787660

Spread the love