నవతెలంగాణ-హైదరాబాద్: కేరళ సిఎం అభ్యర్థిపై ప్రతిష్టంభన వీడింది. పది రోజుల పాటు కొనసాగిన ఉత్కంఠకు తెరదించుతూ, కాంగ్రెస్ హై కమాండ్ గురువారం కేరళ తదుపరి ముఖ్యమంత్రిగా వి. డి. సతీశన్ పేరును అధికారికంగా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్, దీపా దాస్ మున్షీలు తిరువనంతపురంలోని ఎఐసిసి కార్యాలయంలో అధికారికంగా ప్రకటించారు. కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరిస్తానని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి వి.సి. వేణుగోపాల్ పేర్కొన్నారు.
2026 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ (యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్) మొత్తం 140 సీట్లలో 102 సీట్లు గెలుచుకుంది. ముఖ్యమంత్రి పదవి కోసం కె. సి. వేణుగోపాల్, రమేష్ చెన్నితల పేర్లు బలంగా వినిపించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పార్టీని విజయపథంలో నడిపిన సతీసన్ వైపే అధిష్టానం మొగ్గు చూపినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వి. డి. సతీశన్ గత అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా చురుకైన పాత్ర పోషించినట్లు తెలిపాయి. ఎన్నికల్లో యుడిఎఫ్ ను ఏకం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పార్టీ భావించినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి.



