నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్ 2026 మ్యాచ్ సందర్భంగా బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో భారీ భద్రతా వైఫల్యం వెలుగుచూసింది. ఈ నెల 24న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌కు ముందు స్టేడియంలోని నిఘా వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసిన ఇద్దరు వ్యక్తులను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో దాదాపు 240 సీసీ కెమెరాలు పనిచేయకుండా పోయాయి. పోలీసుల ఎఫ్ఐఆర్ ప్రకారం చిత్రదుర్గ జిల్లా హిరియూర్‌కు చెందిన మంజునాథ్ (37), ఉత్తరప్రదేశ్‌కు చెందిన అబ్దుల్ కలాం (19) ఈ విధ్వంసానికి పాల్పడినట్లు గుర్తించారు. వీరు స్టేడియం డిజిటల్ సర్వైలెన్స్ బాధ్యతలు చూస్తున్న ఐవీఎస్ డిజిటల్ సొల్యూషన్స్ అనే సంస్థ కింద సబ్ కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు.
డీయాక్టివేట్ చేసిన యాక్సెస్ కార్డును ఉపయోగించి, నిందితులు ఉదయం 11:30 గంటలకు స్టేడియంలోని సీసీటీవీ కంట్రోల్ రూమ్, సర్వర్ రూమ్ వంటి నిషేధిత ప్రాంతాల్లోకి ప్రవేశించారు. అక్కడ నెట్‌వర్క్ వీడియో రికార్డర్లు, ఫైబర్ ఆప్టిక్ కనెక్షన్లను ధ్వంసం చేశారు. దీంతో ఎంట్రీ గేట్లు, కాన్కోర్సులు, డీ కార్పొరేట్ స్టాండ్ వంటి కీలక ప్రాంతాల్లోని కెమెరాలు పనిచేయడం మానేశాయి. సుమారు రూ.10 లక్షల బకాయిలు చెల్లించకపోవడంతోనే ఆగ్రహంతో ఈ విధ్వంసానికి పాల్పడినట్లు నిందితులు విచారణలో అంగీకరించినట్లు సమాచారం. అయితే, ఈ వాదనపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. కాంట్రాక్టర్ల పర్యవేక్షణ, యాక్సెస్ కంట్రోల్ విధానాల్లోని లోపాలను కూడా పరిశీలిస్తున్నారు.



