– కుటుంబం అనే భావన దెబ్బతింటోంది : సుప్రీం కోర్టు ఆందోళన
న్యూఢిల్లీ: కుటుంబ వ్యవస్థ విషయంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భారతీయులు ‘వసుధైక కుటుంబం’ అనే సూత్రాన్ని విశ్వసిస్తారని, కానీ.. సొంతవారితోనే కలిసి ఉండలేకపోతున్నారని పేర్కొంది. కుటుంబం అనే భావన దెబ్బతింటోందని, ఇది కాస్త ‘ఒక వ్యక్తి- ఒక కుటుంబం’ అనే వ్యవస్థకు దారితీస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. తన పెద్ద కుమారుడిని ఇంటి నుంచి బయటకు పంపించాలని కోరుతూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని సుల్తాన్‌పుర్ జిల్లాకు చెందిన కల్లూ మాల్, సంతోలా దేవీ దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కుమారులకు, తల్లిదండ్రులకు మధ్య సత్సంబంధాల్లేవు. తమ కుమారుల నుంచి జీవనభృతి ఇప్పించాలంటూ 2017లో స్థానిక ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించగా.. తల్లిదండ్రులకు నెలకు రూ.8వేలు చెల్లించాలంటూ ఆదేశించింది. ఈ క్రమంలోనే పెద్ద కుమారుడికి, తల్లిదండ్రులకు మధ్య ఆస్తి వివాదం చెలరేగింది. ఇది కొనసాగుతుండగానే.. కల్లూ మాల్ మ ృతి చెందారు. తదనంతర పరిణామాల నేపథ్యంలో తన పెద్ద కుమారుడిని ఇంటి నుంచి బయటకు పంపించాలని తల్లి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం దీన్ని విచారించింది. కుమారుడు తన తల్లిదండ్రులను, ముఖ్యంగా తల్లిని అవమానించాడని, ఆమె జీవితంలో జోక్యం చేసుకున్నాడని చెప్పేందుకు ఎటువంటి ఫిర్యాదులు, ఆధారాల్లేవని తెలిపింది. ఆస్తికి తండ్రే యజమాని అని చెప్పలేమని, కుమారుడికీ అందులో వాటా ఉంటుందని పేర్కొంది. కొడుకును ఇంటి నుంచి పంపించేంత తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ క్రమంలోనే కుటుంబ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేసింది.
”మనమంతా ‘వసుధైక కుటుంబం’ అనే భావనను విశ్వసిస్తాం. అయితే, నేడు కుటుంబ ఐక్యతనే కాపాడుకోలేకపోతున్నాం. అలాంటిది.. ‘ప్రపంచమంతా ఒకే కుటుంబం (వసుదైవ కుటుంబం)’ గురించి ఇంకేం మాట్లాడగలం? ‘కుటుంబం’ అనే భావనే తుడిచిపెట్టుకుపోతోంది. ‘వన్ పర్సన్, వన్ ఫ్యామిలీ’ (ఒక వ్యక్తి.. ఒకే కుటుంబం) అనే వ్యవస్థకు చేరువలో ఉన్నాం” అని సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది.