ఎమ్మెల్సీ ఎన్నికలపై వీడియో కాన్ఫరెన్స్..

Video conference on MLC election..– కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎస్పీలు..
నవతెలంగాణ –  కామారెడ్డి
మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజక వర్గాల ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేపట్టామని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలపై జిల్లాల కలెక్టర్ లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి కలెక్టర్, ఎస్పీ సింధు శర్మ, అదనపు కలెక్టర్లు, నోడల్ అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, పోలింగ్ సిబ్బంది, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాల ముద్రణ, పోస్టల్ బ్యాలెట్ జారీ, పోలింగ్ కేంద్రాలలో అవసరమైన వసతులు, వెబ్ కాస్టింగ్, డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాల వద్ద ఏర్పాటు, పోలీస్ బందోబస్తు, తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదీర్ఘంగా చర్చించి జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు జారీ చేశారు. ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు అందుబాటులో ఉన్నాయని, పోలింగ్ కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు చేపట్టామని అన్నారు.  పోలింగ్ రోజున ప్రతి రెండు గంటలకు ఒకసారి రిపోర్ట్ అందించేలా వ్యవస్థ సిద్ధం చేసుకున్నామని కలెక్టర్  తెలిపారు. జిల్లాలో 54 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సి.ఈ. ఒ. ఆదేశించిన మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న  ఎస్పీ సింధు శర్మ  మాట్లాడుతూ ఉపాధ్యాయ, పట్టభద్రుల  ఎమ్మెల్సీ ఎన్నికల బందోబస్తుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఈ వీడియో సమావేశంలో అదనపు కలెక్టర్లు వి.విక్టర్, శ్రీనివాస్ రెడ్డి, నోడల్ అధికారులు పాల్గొన్నారు.
Spread the love