– అలరించిన విమాన విన్యాసాలు
నవ తెలంగాణ – బిజినెస్ బ్యూరో
హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన వింగ్స్ ఇండియా -2024 ప్రదర్శనకు సందర్శకులు పోటెత్తారు. చివరి రెండు రోజులు సందర్శకులను అనుమతించడంతో శనివారం సందడి నెలకొంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ఇక్కడి విమానాలు చూసి మురిసిపోయారు. ఆదివారం (నేడు) కూడా సందర్శకులను అనుమతిస్తున్నారు. ప్రదర్శనలో ప్రతి విమానం పక్కన 30 అడుగుల మేర బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉంచిన విమానాలను చూడటానికి ఆసక్తిని కనబర్చడంతో పాటుగా.. హెలిక్యాప్టర్ విన్యాసాలు అబ్బురపర్చాయి. విమానాలకు సంబంధించిన వివరాలను, ప్రత్యేకతలను ఆయా సంస్థల ప్రతినిధులు వివరిస్తున్నారు.
శివమణితో సంగీతోత్సవం
విమానాల ప్రదర్శన మాత్రమే కాకుండా వినోదం కోసం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు శివమణి బృందంతో సంగీతోత్సవం ఏర్పాటు చేశారు. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ‘కలంకారి’ విమానం నేపథ్యంగా వీక్షకులను తన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ బ్రాండ్‌కు చెందిన సరికొత్త బోయింగ్ 737-8 ఎయిర్‌క్రాప్ట్, విటి-బిఎక్స్‌హెచ్, కలంకారితో కూడిన టార్మిక్ వేదికగా శివమణి తన ప్రదర్శన ఇచ్చారు. భారతదేశ కళాత్మక ప్రతిభ, వైవిధ్యాన్ని వేడుక చేయడం పట్ల సంతోషిస్తున్నామని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సిద్దార్థ బుటాలియా పేర్కొన్నారు. జనవరి 21తో ముగియనున్న ఈ షోకు బుక్‌మై షోలో ముందుగా టికెట్లు కొనుగోలు చేసుకోవడానికి వీలుంది. ప్రవేశ రుసుం ఒక్కొక్కరికి రూ.750గా నిర్ణయించారు. మూడేళ్లలోపు పిల్లలకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నారు.