
– బ్యాలెట్ పేపర్ పై సంతకాలు.. అక్షరాలు రాయరాదు
– అభ్యర్థికి కేటాయించిన స్థలంలో 1,2,3, అంకెలనే వేయాలి
– ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరిచందన దాసరి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
వరంగల్,ఖమ్మం,నల్గొండ శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నిక సందర్భంగా ఓటర్లు ఓటు వేసే విధానాన్ని, పాటించాల్సిన నియమాలను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, వరంగల్ ఖమ్మం, నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన ఒక ప్రకటనలో తెలిపారు. ఓటర్లు వారు ఓటు వేసే అభ్యర్థికి ఎదురుగా బ్యాలెట్ పేపర్ తో పాటు ఎన్నికల సంఘం ద్వారా సరఫరా చేయబడిన వాయిలెట్ స్కెచ్ పెన్ ను మాత్రమే ఉపయోగించాలని తెలిపారు. ఓటరు ఓటు వేసేందుకు ఎంచుకున్న అభ్యర్థికి ఎదురుగా 1, లేదా 2,లేదా 3, 4 ప్రాధాన్యత క్రమంలో మాత్రమే అంకెల రూపంలో పేర్కొనాల్సి ఉంటుందని తెలిపారు. మొదటి ప్రాధాన్యత ఓటు కింద 1 వ అంకెను, ఒక అభ్యర్థి కి ఎదురుగా ఉన్న స్థలంలో మాత్రమే మార్కు చేయవలసి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ, బ్యాలెట్ పేపర్ లో పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లకు ఎదురుగా1,2,3, వంటి అంకెల రూపంలో మాత్రమే ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాలని వెల్లడించారు. ఓటర్లు ఓటు వేసేటప్పుడు పోటీలో ఉన్న అభ్యర్థులకు ఎదురుగా భారతీయ సంఖ్యలైన 1,2,3,లేదా రోమన్ తరహాలో మార్క్ చేయవచ్చని పేర్కొన్నారు.
ఒకవేళ ఓటరు నోటాకు ఓటు వేయవలసినట్లయితే బ్యాలెట్ పేపర్ పై 1,2,ప్రాధాన్యతల తర్వాత 3 వ ప్రాధాన్యతా ఓటును నోటాకి ఎదురుగా మార్క్ చేయవచ్చని తెలిపారు. ఓటర్లు ఓటు వేసేటప్పుడు చేయకూడని అంశాలను కలెక్టర్ వివరిస్తూ బ్యాలెట్ పేపర్ పై ఇద్దరు అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు 1 వ సంఖ్య ఇవ్వకూడదని, అలాగే బ్యాలెట్ పేపర్ పై సంతకం చేయడం, లేదా ఇనిషియల్ వేయటం, పేరు, అక్షరాలు వంటివి రాయకూడదని వెల్లడించారు. ఓటరు బ్యాలెట్ పేపర్ పై 1,2,3,4,5 సంఖ్యల రూపంలో మాత్రమే ప్రాధాన్యతను ఇవ్వాలని, పదాల రూపంలో, వన్, టూ, త్రీ అని రాయకూడదని స్పష్టం చేశారు. అలాగే బ్యాలెట్ పేపర్ పై రైట్ మార్క్ టిక్ చేయడం లేదా ఇంటు మార్కు పెట్టడం వంటివి సైతం చేయకూడదని పేర్కొన్నారు. ఒకే అభ్యర్థికి రెండు ప్రాధాన్యతలు ఇవ్వకూడదని, ఉదాహరణకు ఒకే అభ్యర్థికి 1,2 సంఖ్యలు వేయకూడదని వెల్లడించారు. అంతేకాక బ్యాలెట్ పేపర్ పై అభ్యర్థికి కేటాయించిన స్థలంలో మాత్రమే 1,2,3, అంకెలు వేయాలని, అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులకు వచ్చేలా నంబర్ మార్కు చేయకూడదని వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటర్లు వారి ఓటు ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.