విస్తారా ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌

న్యూఢిల్లీ : టాటా గ్రూప్‌, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ సంయుక్త భాగస్వామ్యంలోని విస్తారా విమానయాన సంస్థ ఉద్యోగులకు స్వచ్ఛంద విరమణ పథకం (వీఆర్‌ఎస్‌) ప్రకటించింది. దీంతో పాటు వాలెంటరీ సెపరేషన్‌ స్కీమ్‌నూ తీసుకొచ్చింది. నాన్‌ ఫ్లయింగ్‌ సిబ్బందికి దీన్ని వర్తింపజేయనుంది. వీటికి దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 23 వరకు ఉద్యోగులకు అవకాశం కల్పించింది. ఎయిరిండియాతో విలీనం వేళ వీటిని ప్రవేశపెట్టడం గమనార్హం. విస్తారాలో శాశ్వత, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు మొత్తంగా 6,500 మంది వరకు ఉంటారు. వీరిలో ఐదేండ్లు సర్వీసు పూర్తి చేసుకున్న నాన్‌ ఫ్లయింగ్‌ పర్మినెంట్‌ స్టాఫ్‌కు వీఆర్‌ఎస్‌ను ప్రకటించారు. పైలట్లు, క్యాబిన్‌ సిబ్బందిని మినహాయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై విస్తారా అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఎయిరిండియా, విస్తారాల్లో 23వేల ఉద్యోగులు ఉన్నారు. వీటి విలీనం తర్వాత 600 మంది నాన్‌ ఫ్లయింగ్‌ సిబ్బందిని తొలగించే అవకాశాలున్నాయని సమాచారం.

Spread the love