Friday, May 8, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంయుద్ధం త్వరలోనే ముగుస్తుంది : ట్రంప్‌

యుద్ధం త్వరలోనే ముగుస్తుంది : ట్రంప్‌

- Advertisement -

నవతెలంగాణ – జనరల్‌ డెస్క్‌
ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం త్వరలోనే ముగిసిపోతుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు అమెరికా పంపిన శాంతి ప్రతిపాదనను ఇరాన్‌ పరిశీలిస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ ప్రతిపాదన కారణంగా ఇరాన్‌-అమెరికా మధ్య ఘర్షణ ముగిసినప్పటికీ టెహ్రాన్‌ తన అణు కార్యక్రమాన్ని నిలిపివేయాలని, హార్ముజ్‌ జలసంధిని తిరిగి తెరవాలని వాషింగ్టన్‌ చేస్తున్న డిమాండ్లు అపరిష్కృతంగానే ఉండిపోయే అవకాశం ఉంది. అమెరికా శాంతి ప్రతిపాదనపై స్పందనను తెలియజేస్తామని ఇరాన్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు ఐఎస్‌ఎన్‌ఏ వార్తా సంస్థకు తెలిపారు. అయితే ఈ ప్రతిపాదన వాస్తవికతలను దృష్టిలో ఉంచుకోలేదని, అది అమెరికా కోరికల చిట్టా మాదిరిగా ఉన్నదని ఇరాన్‌ పార్లమెంటుకు చెందిన విదేశాంగ-జాతీయ భద్రతా కమిటీ ప్రతినిధి ఇబ్రహీం రెజాయి వ్యాఖ్యానించారు.

‘వారు ఓ ఒప్పందం చేసుకోవాలని అనుకుంటున్నారు. గత 24 గంటల కాలంలో మా మధ్య చాలా మంచి చర్చలు జరిగాయి. మేము ఓ ఒప్పందానికి వచ్చే అవకాశం చాలా ఉంది’ అని ట్రంప్‌ తన ఓవల్‌ కార్యాలయంలో విలేకరులకు చెప్పారు. కాగా యుద్ధానికి ముగింపు పలికేందుకు ఉద్దేశించిన మెమొరాండంపై ఇరు పక్షాలు ఒప్పందానికి చేరువగా ఉన్నాయని కొన్ని వర్గాలు చెప్పాయి. హార్ముజ్‌ జలసంధి మీదుగా నౌకాయానానికి అడ్డంకులు తొలగించడం, ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు ఎత్తివేయడం, ఇరాన్‌ అణు కార్యక్రమంపై నియంత్రణ విధించడం వంటి అంశాలపై చర్చలు ప్రారంభమవుతాయని ఆ వర్గాలు తెలిపాయి. ఒప్పందం కుదురుతుందని మధ్యవర్తులు ఆశాభావంతో ఉన్నారని, అయితే ఇరు పక్షాల మధ్య కొన్ని అంశాలపై అభిప్రాయబేధాలు ఉన్నాయని చర్చలలో భాగస్వామిగా ఉన్న పాకిస్తాన్‌ సీనియర్‌ అధికారి ఒకరు అన్నారు. ‘మా తొలి ప్రాధాన్యత యుద్ధానికి ముగింపు పలకడమే. వారు ప్రత్యక్ష చర్చలకు వచ్చిన తర్వాత మిగిలిన సమస్యలను పరిష్కరించుకోవచ్చు’ అని చెప్పారు.

ఇరాన్‌ సామర్ధ్యంపై తప్పుడు అంచనాలు
బాంబు దాడుల ద్వారా సాధించలేని పనిని దీర్ఘకాల దిగ్బంధనం ద్వారా సాధించవచ్చునని ట్రంప్‌ భావిస్తున్నారు. ఓడరేవుల దిగ్బంధనంతో కలిగే నష్టమేమిటో ఇరాన్‌కు తెలుసు. అయితే దిగ్బంధనాన్ని మరో యుద్ధంగా అది చూడడం లేదు. ఓడరేవుల దిగ్బంధనంతో దీర్ఘకాలం పాటు ఉక్కిరిబిక్కిరి కావడం కంటే యుద్ధాన్ని తిరిగి ప్రారంభించడమే మేలని ఇరాన్‌ పాలకులు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే ఇరాన్‌ సామర్ధ్యాన్ని, యుద్ధ సన్నద్ధతను అమెరికా, ఇజ్రాయిల్‌ దేశాలు తక్కువగా అంచనా వేస్తున్నాయి. ఇరాన్‌ పాలకులు, ప్రజలు సమైక్యంగానే ఉన్నారని అమెరికా తెలుసుకోలేకపోతోంది. పాలకులపై తిరగబడాలంటూ ట్రంప్‌ గతంలో ఇచ్చిన పిలుపును ఇరాన్‌ ప్రజలు పట్టించుకోలేదు. ఇరాన్‌ నిర్ణయాల వెనుక ఉన్న వ్యూహాత్మక పరిస్థితులను అమెరికా అర్థం చేసుకోవడం లేదు. ఇరాన్‌లో నిర్ణయాలు ఎలా తీసుకుంటారనే విషయం పైనే అది దృష్టి పెడుతోంది. తన వైఖరిని మార్చుకోవడం ఇష్టం లేకనే ఇరాన్‌ చర్చలకు రావడం లేదు. హార్ముజ్‌ను మూసివేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపగలనన్న ధీమా ఇరాన్‌లో కన్పిస్తోంది.

అసమానమైన ఇరాన్‌ వ్యూహాలు
ఇరాన్‌తో పోలిస్తే అమెరికా, ఇజ్రాయిల్‌ దేశాలకు అపార సైనిక బలగం ఉంది. ఈ విషయంలో ఎవరికీ సందేహం లేదు. అయితే ఇరాన్‌ వ్యూహాలు అసామాన్యమైనవి. ముఖ్యంగా బాలిస్టిక్‌ క్షిపణులు, డ్రోన్ల వాడకం దానికి వెన్నతో పెట్టిన విద్య. హెజ్బొలా, హౌతీ వంటి మిత్ర గ్రూపుల మద్దతు టెహ్రాన్‌కు ఉండనే ఉంది. అసలు అమెరికా ఏం కోరుకుంటోందో ఇప్పటికీ స్పష్టంగా తెలియడం లేదు. అయతొల్లా అలీ ఖమేనీని యుద్ధం మొదటి రోజునే హతమార్చినప్పటికీ అమెరికా కోరుకున్న అధికార మార్పిడి సాధ్యం కాదని తేలిపోయింది. ఇరాక్‌, ఆప్ఘనిస్తాన్‌ కంటే అనేక రెట్లు పెద్దదైన ఇరాన్‌పై భూతల దాడులు జరపకుండా దానిని స్వాధీనం చేసుకోవడం అసంభవం. బహుళ అంచెల రాజకీయ వ్యవస్థను కలిగిన ఇరాన్‌ను అమెరికా ఎదుర్కొంటోంది. ఇరాన్‌కు రెండు సమాంతర సైనిక నిర్మాణాలు (అర్టెష్‌ అనే సాధారణ సైనిక బలగం, ఐఆర్‌జీసీ) ఉన్నయన్న విషయం చాలా మందికి తెలియదు. యుద్ధంలో ఇరాన్‌కు భారీ నష్టమే కలిగినప్పటికీ అమెరికా-ఇజ్రాయిల్‌ దేశాలు తాము అనుకున్న లక్ష్యాలను సాధించాయా లేదా అనేదే కీలక ప్రశ్న. ప్రస్తుతానికి ఈ ప్రశ్నకు సమాధానం ‘లేదు’.

అపార ఆయుధ నిల్వలు…శుద్ధి చేసిన యురేనియం
ఇరాన్‌ వద్ద ఇప్పటికీ శుద్ధి చేసిన 440 కిలోల యురేనియం నిల్వ ఉంది. దీనితో పాటు అపార ఆయుధ నిల్వలు ఉన్నాయి. వాస్తవానికి ఇరాన్‌ వద్ద వివిధ స్థాయిల్లో శుద్ధి చేసిన 11 టన్నుల యురేనియ ఉంది. ఇరాన్‌కు చెందిన ఓ ప్రధాన స్థావరం నతంజ్‌ సమీపంలోని గ్రానైట్‌ పర్వతం కింద ఉంది. దీనిని అత్యంత శక్తివంతమైన అమెరికా బాంబులు కూడా ఏమీ చేయలేవు. అమెరికా, ఇజ్రాయిల్‌ సేనలు భవనాలు, ఇతర పౌర సౌకర్యాలను నష్టపరిచాయే కానీ ఇరాన్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏమీ చేయలేకపోయాయి. ఒకవేళ అణ్వాయుధాలను తయారు చేయాలని ఇరాన్‌ అనుకుంటే దానిని ఎవరూ ఆపలేరు. అయితే అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేసిన దేశంగా తాను అణ్వాయుధాలను తయారు చేయబోనని, ఇప్పటికీ దానికే కట్టుబడి ఉన్నానని ఇరాన్‌ చెబుతోంది.

యుద్ధాన్ని ఎలా ముగించాలి? అయోమయంలో ట్రంప్‌
మాటకే కనుక యుద్ధాలను గెలిపిస్తే ఇరాన్‌పై జరుపుతున్న పోరులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఏనాడో విజయ సాధించి ఉండేవారు. రెండు వారాల లోపే యుద్ధాన్ని ముగించాలని అనుకున్న ట్రంప్‌నకు ఇప్పుడు పదో వారం ప్రవేశించినా దారీతెన్నూ కన్పించడం లేదు. దాని నుంచి ఎలా బయటపడాలో తెలియని పరిస్థితిలో కూరుకుపోయారు. ట్రంప్‌ తనకుతానుగా రెండు ఉచ్చులు సృష్టించుకున్నారు. ఒకటి భౌగోళిక రాజకీయపరమైనది. మరొకటి దేశీయమైనది. హార్ముజ్‌పై ఇరాన్‌కు ఉన్న పట్టు కారణంగా, లొంగిపోవడానికి ఆ దేశం నిరాకరించడం వల్ల యుద్ధాన్ని ట్రంప్‌ ముగించలేకపోతున్నారు. వివాదం కొనసాగుతున్న కొద్దీ దాని ప్రభావం కారణంగా దేశీయంగా ఆయనకు మద్దతు పడిపోతోంది. యుద్ధంపై రోజుకో మాట మారుస్తూ ఆయన ప్రజలలో చులకన అవుతు న్నారు. యుద్ధాన్ని అమెరికా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తుం డడంతో దానిని కొనసాగించడం ఆయనకు అసాధ్యంగా కన్పిస్తోంది. ఇప్పుడు ఆయనకు మిగిలిన ఏకైక ఆశ…పాకిస్తాన్‌ జరుపుతున్న మధ్యవర్తిత్వం మాత్రమే.

ఒకవేళ పాక్‌ మధ్యవర్తిత్వంతో యుద్ధం ముగిసినప్పటికీ ఇరు దేశాల మధ్య అణు కార్యక్రమంపై నెలకొన్న వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. సుమారు అర్థ శతాబ్దంగా కొనసా గుతున్న వివాదాలను పరిష్కరించడానికి ఈ ఒప్పందం సరిపో దని చెప్పవచ్చు. తన ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించుకోవడానికి భారీగా రాయితీలు ఇవ్వాలని ఇరాన్‌ డిమాండ్‌ చేస్తోంది. ఆంక్షలను సడలించాలని కోరుతోంది. అమెరికా తాజాగా చేసిన శాంతి ప్రతిపాదనపై తన స్పందనను ఇరాన్‌ పాకిస్తాన్‌ మధ్యవర్తులకు అందజేస్తోంది. దీనిపై ట్రంప్‌ సుముఖత వ్యక్తం చేస్తే యుద్ధానికి ముగింపు లభిస్తుంది. ‘ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ’, ‘ప్రాజెక్ట్‌ ఫ్రీడమ్‌’ల కథ ముగిసిందని అమెరికా చెబుతోంది. ఇరాన్‌ను లొంగదీసుకోవడానికి ట్రంప్‌ చేపట్టిన ‘ప్రాజెక్ట్‌ ఫ్రీడమ్‌’ అర్థంతరంగా ముగిసిపోయింది. అమెరికా చేపట్టిన చర్యలేవీ ఇరాన్‌ ప్రభుత్వాన్ని కూల్చలేకపోయాయి. వెనిజులా నేత మదురోను పట్టుకోవడానికి జరిపిన మెరుపు దాడితో ఇరాన్‌పై జరుపుతున్న పోరును ట్రంప్‌ పోల్చడం హాస్యాస్పదంగా ఉంది.

గందరగోళంగా ప్రతిపాదనలు
ఇరాన్‌-అమెరికా మధ్య నడుస్తున్న శాంతి ప్రతిపాదనలు, ప్రత్యామ్నాయ ప్రతిపాదనల విషయంలో తీవ్రమైన గందరగోళం నెలకొని ఉంది. ఓడరేవుల దిగ్బంధనానికి స్వస్తి చెప్పాలని, యుద్ధాన్ని ముగించాలని, ఆ తర్వాతి దశలో మాత్రమే అణు కార్యక్రమంపై చర్చించాలని ఇరాన్‌ చేసిన ప్రతిపాదనను అమెరికా ఇప్పటికే తోసిపుచ్చింది. అణు సమస్యను ముందుగానే పరిష్కరించాలని పట్టుపట్టింది. ఇరాన్‌ తన శాంతి ప్రతిపాదనలో.. పదిహేను సంవత్సరాల పాటు యురేనియం శుద్ధిని నిలిపి వేస్తామని, అణ్వాయుధాలను నిల్వ చేయబోమని హామీ ఇచ్చేందుకు సిద్ధమేనని తెలిపింది. అయితే అణు మౌలిక సదుపాయాలను, అణు స్థావరాలను ధ్వంసం చేసేందుకు మాత్రం ససేమిరా అంది.

ఎత్తుగడల ఫలితాలు…
వ్యూహాత్మక వైఫల్యాలు

ఇరాన్‌పై మూడో దశ పోరుకు సిద్ధమవుతున్న అమెరికా-ఇజ్రాయిల్‌
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్‌ దేశాలు మూడో దశ పోరుకు సిద్ధమవుతున్నట్లు కన్పిస్తోంది. మొదటి దశ యుద్ధాన్ని తట్టుకొని నిలబడడంలో ఇరాన్‌ విజయ సాధించింది. రెండో దశ ‘డ్రా’గా ముగిసింది. హార్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ దిగ్బంధించగా ఇరాన్‌ ఓడరేవులను అమెరికా దిగ్బంధించింది. మూడో దశ పోరు ఎలా ముగుస్తుందో ఇప్పుడే చెప్పడం కష్టం. హార్ముజ్‌ మీదుగా ప్రయాణించే విదేశీ నౌకలకు రక్షణ కల్పిస్తామని, ఒకవేళ ఇరాన్‌ ఈ ప్రక్రియను అడ్డుకుంటే అది యుద్ధానికి దారితీస్తుందని ట్రంప్‌ గత ఆదివారం హెచ్చరించారు. అయితే ఆయన ప్రణాళిక ఏమిటో మాత్రం బయటపెట్టలేదు.

అమెరికా శాంతి ప్రతిపాదనను పరిశీలిస్తున్నాం : ఇరాన్‌ కిం కర్తవ్యం?
ఇరాన్‌ విషయంలో ఏం చేయాలనే దానిపై ట్రంప్‌ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఇరాన్‌తో దౌత్య యత్నాలకే ప్రాధాన్యత ఇస్తానని, బాంబు దాడులు జరపడం తన అభిమతం కాదని ఆయన చెబుతున్నారు. ఇరాన్‌పై సైనిక చర్యకు పాల్పడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. అంతేకాక అణు రంగంలో ఇరాన్‌పై ఒత్తిడి పెంచడానికి అది ఉపకరించదు. పోనీ చర్చల ద్వారా ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తే ఇరాన్‌కు ట్రంప్‌ భారీగానే రాయితీలు ఇవ్వాల్సి ఉంటుంది. తమదే పైచేయి అని ఇరు పక్షాలు భావిస్తున్నందున లేదా ప్రత్యర్థులపై పైచేయి సాధించాలని చూస్తున్నందున ఈ దశలో రాజీ కుదరడం కొంత కష్టమేనని అనిపిస్తోంది.

అమెరికా-చైనా మధ్య స్థిరత్వం, సహకారం అవసరం అమెరికా సెనెటర్లు
ప్రపంచంలోని రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య స్థిరత్వం, శాంతియుత సహకారం అవసరమని బీజింగ్‌లో పర్యటిస్తున్న అమెరికా సెనెటర్ల ప్రతినిధి బృందం అభిప్రాయపడింది. ఉద్రిక్తతలను తొలగించుకొని, పరస్పర విశ్వాసం నెలకొల్పుకోవాలని తాము కోరుకుంటున్నామని అమెరికా ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తున్న సెనెటర్‌ స్టీవ్‌ డెయిన్స్‌ చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ ఈతో జరిపిన సమావేశంలో తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఈ నెల 14, 15 తేదీల్లో చైనాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆయన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశమవుతారు. ట్రంప్‌, జిన్‌పింగ్‌ మధ్య జరిగే సమావేశంలో కొన్ని ఒప్పందాలు కుదిరే అవకాశం ఉన్నదని స్టీవ్‌ డెయిన్స్‌ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -