మన ఊరు మన బడుల్లో అసౌకర్యాలు పై ఆగ్రహం..

– పది రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశం
– నివేదిక ఇవ్వాల్సిందిగా ప్రధానోపాద్యాయుడికి సూచన
– పోలింగ్ కేంద్రాలు, అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ తనిఖీ
– ఎన్నికల నిర్వహణ పై సిబ్బంది తో సమీక్ష
– కలెక్టర్ ప్రియాంక అల
నవతెలంగాణ – అశ్వారావుపేట :
పోలింగ్ కేంద్రాలను పరిశీలించడానికి ఆకస్మికంగా మంగళవారం నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట వచ్చిన కలెక్టర్ ప్రియాంక అల స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల( మన ఊరు –  మన బడి)ల్లో అసౌకర్యాలు పై సంబంధిత ప్రధానోపాధ్యాయుడు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.కనీసం లైట్ లు, ఫ్యాన్ లు కూ ఏర్పాటు చేయకుండా బిల్లులు ఎలా తీసుకున్నారు అంటూ ఎం.ఇ.ఒ క్రిష్ణయ్య పై మండి పడ్డారు.10 రోజుల్లో మన ఊరు – మన బడుల్లో అసంపూర్ణంగా ఉన్న పనులను పూర్తి చేసి నివేదిక పంపాలని ఆదేశించారు.
జిల్లా పరిషత్  బాల, బాలికలు, మైనార్టీ బాలికల ఉన్నత పాఠశాలల్లో గల పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. అక్కడ నుండి అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ ను వారు తనిఖీ చేసారు. అనంతరం ఆమె తహశీల్ధార్ కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి చాంబర్లో ఎన్నికల నిర్వహణ పై సిబ్బందితో సుదీర్ఘ సమీక్ష చేసారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల అధికారులు సమన్వయంగా పని చేసి ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో మౌళిక సదుపాయాలపై సెక్టోరల్ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారని తెలిపారు. శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలుగకుండా ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు. ఇప్పటికే ఎటువంటి ఆధారాలు లేని రూ.34 లక్షలు ను సీజ్ చేశామని, వ్యయ నిర్వహణ జిల్లా కమిటీని ఏర్పాటు చేశామని, పట్టుబడిన నగదు కు సంబంధించిన ఏమైనా ఆధారాలు ఉంటే కమిటీ రిలీజ్ చేస్తుందని చెప్పారు. ప్రతి రోజూ సాయంత్రం 4 – 5 గంటల సమయంలో కమిటీ ప్రజలకు అందుబాటులో ఉంటుందని వివరించారు.జిల్లా వ్యాప్తంగా ఐదు నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్లు 9,15,034 మంది ఉన్నారని, వీరి కోసం 129 ప్రాంతాల్లో 1,095 పోలింగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈసారి 80 ఏళ్ళు నిండిన ఓటర్లు ఇంటి వద్దే ఓటు వినియోగించుకునేలా అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికలు సమర్ధవంతంగా నిర్వహించటానికి అధికారులతో కలిసి పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రజలు రాజకీయ పార్టీల నాయకులు కూడా అధికారులకు సహకరించాలని కోరారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందుకు నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. కొండ రెడ్ల గ్రామాల్లో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించామని, సమస్యాత్మక గ్రామాలపై ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక దృష్టి ఉంటుందని చెప్పారు.
కలెక్టర్ సుడిగాలి పర్యటన..
పట్టణంలో జిల్లా కలెక్టర్ ప్రియాంక అల సుడిగాలి  పర్యటన చేశారు. ముందుగా స్థానిక ప్రభుత్వ బాలురు, బాలికల ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాలను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు. అక్కడ ఎర్పాటుడు. చేసిన సమయాలను పరిశీలించాడు. వూరి స్థాయిలో వసతులు లేకపోవటంతో ఆమె అసహనం వ్యక్తం చేశారు. వెంటనే ఎన్నికలు నిబంధనల మేరకు ఓటర్లకు అవసరమైన అన్ని వసతులు కల్పించాల్సిందే నని, మరో 10 రోజుల్లో అన్ని పనులు పూర్తి చేయాలని స్థానిక అధికారులను అదేశించారు. బాలికల ఉన్నత పాఠశాలలో మౌళిక వసతులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల హెచ్.ఎం అందుబాటులో లేకపోవటం, పాఠశాల ప్రాంగణం శుభ్రంగా లేకపోవడం పట్ల మండిపడ్డారు.వారి వేతనం నిలిపివేస్తున్నట్లు ప్రకటించాడు. మన ఊరు – మన బడి పనులు అన్ని పూర్తి అయ్యే వరకు నిలిపి వేస్తామని, పనులు పూర్తి చేసిన తర్వాత ఫొటోలతో సహా వ్యక్తిగతంగా వచ్చి కలెక్టరేట్ లో తనను కలవాలని, అప్పటి వరకు నిధులు మంజూరి చేయనని స్పష్టం చేశారు. అనంతరం అశ్వారావుపేట శివారు నందమూరి నగర్ వద్ద ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టు కు చేరుకుని పరిసరాలను పరిశీలించారు. రోజు వారీ నమోదు చేస్తున్న రికార్డులను తనిఖీ చేశారు. ఏ ప్రాంతాల నుండి ప్రయాణికులు వస్తున్నారు. ఏ విధంగా తనిఖీలు చేస్తున్నారో పాల్వంచ డీఎస్సీ వెంకటేష్ ను అడిగి తెలుసుకున్నారు. అక్రమ నగదు, మద్యం రవాణాపై నిఘాను పటిష్టం చేయాలని ఆదేశించారు. ఏ ఏ శాఖల అధికారులు విధులు నిర్వహిస్తున్నారు అనే విషయం పై ఆరా తీశారు.
విధులు పట్ల అలసత్వం వద్దు..
త్వరలో జరగబోవు అసెంబ్లీ ఎన్నికల పట్ల అధికారులు విధులు పట్ల ఎటువంటి అలసత్వం వహించ వద్దని హితవు పలికారు.ఎవరికి కేటాయించిన విధులను ఆయా శాఖల అధికారులు సక్రమంగా నిర్వహించాలని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో ఆమె ఎన్నికల నిర్వహణపై నియోజకవర్గ మండలాల అధికారులతో సమీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటర్ల తో పాటు ప్రజలకు సైతం ఎటువంటి అసౌకర్యం కల్పించ వద్దని చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో మిగిలిపోయిన అన్ని పనులు సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్నికలు పూర్తి అయ్యే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్, నియోజక వర్గం ఎన్నికల అధికారి రాంబాబు, డీ.హెచ్.ఎస్.ఒ, ఎన్నికల సి.పి.ఒ జినుగు మరియన్న, ఎక్సైజ్ సూపరింటెండెంట్ జానయ్య, ఎన్నికల లా అండ్ ఆర్డర్ నోడల్ ఆఫీసర్, డిఎస్.పి వెంకటేష్, నియోజకవర్గ ఎన్నికల నోడల్ ఆఫీసర్ రామం, నియోజకవర్గ మండలాల తహశీల్దార్లు, ఎం.పి.డి‌ వో లు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love