పూర్తి స్థాయిలో నిఘా పెంచాం

– ఏసీపీ జగన్‌
నవతెలంగాణ-ఓయూ
నగరంలో నేరాల నియంత్రణకు సీపీ ఆదేశాల మేరకు పగలు రాత్రి అనే తేడా లేకుండా పూర్తి స్థాయిలో నిఘా పెంచామని ఓయూ ఏసీపీ జగన్‌ తెలిపారు. లాలాగూడ పోలీస్టేషన్‌ పరిధిలో ఉన్నటువంటి రౌడీ షీటర్లు అనుమానితులకు బుధవారం కౌన్సిలింగ్‌ నిర్వహించారు. అనంతరం, లాలా గూడ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇన్‌స్పెక్టర్‌ కరుణాకర్‌ రెడ్డితో కలిసి ఏసీపీ జగన్‌ మాట్లాడుతూ సమాజానికి హాని కలిగించే విధమైన చర్యలకు పాల్పడితే సహించేది లేదన్నారు. అర్థరాత్రుల్లో అనవసరంగా రోడ్లపై సంచరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 11 గంటల తరువాత దుకాణాలు మూసివేయాలని, లేదంటే కేసులు నమోదు చేయాల్సి వస్తుందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఎట్టిపరిస్థితుల్లో వెనుకడుగు వేసే ప్రస్తకే లేదన్నారు.
పీఎస్‌ పరిధిలో 22 రౌడీషీటర్లు, 34 అనుమానితులు
లాలాగూడ పీఎస్‌ పరిధిలో 32 మంది రౌడీషీటర్లు, 34 మంది అనుమానితులు ఉన్నారన్నారు. రౌడీ షీటర్లలో 17 మంది మర్డర్‌ కేసుల్లో ఉన్నవారని తెలిపారు. ఈస్ట్‌ జోన్‌ పరిధిలోని పోలీస్‌ స్టేషన్లలో అత్యధిక రౌడీ షీటర్లు ఉన్న పోలీస్‌ స్టేషన్లలో లాలాగూడ ఒకటని వెల్లడించారు. రౌడీషీటర్లు ఇక ముందు ఏ కేసులో తలదూర్చినా వారిపై పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామని హెచ్చరించారు. సత్ప్రవర్తన కలిగి ఉండి ఎటువంటి కేసుల్లో తలదూర్చకుండా ఉంటే వారిపై ఉన్న సస్పెక్ట్‌, రౌడీ షీట్లు తొలగించే విధంగా ఉన్నతాధికారుల దష్టికి తీసుకెళ్తామన్నారు. రానున్న పండుగలు ప్రశాంతంగా జరగాలంటే శాంతి భద్రతలు విఘాతం కలిగించే వాళ్లపై ఉక్కుపాదం మోపక తప్పదన్నారు. అందువల్ల రౌడీ షీటర్లు, సస్పెక్ట్‌లు మంచి ప్రవర్తనతో ఉండాలన్నారు. ఈ సమావేశంలో ఇన్‌స్పెక్టర్‌ కరుణాకర్‌ రెడ్డి, లాలాగూడ, ఏ పెండర్‌, కమలాడి, ఎస్‌ఐలు సాహిద్పసా నాగరాజు యాదవ్‌ పాల్గొన్నారు.

Spread the love