Thursday, June 4, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలువిద్యారంగంలో మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి

విద్యారంగంలో మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి

- Advertisement -

ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసి..కార్పొరేట్ శక్తులకు విద్యను తాకట్టు పెడుతున్న బీజేపీ ప్రభుత్వం : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎస్‌ఎ‌ఫ్‌ఐ 
రాష్ట్ర అధ్యక్షులు ఎస్. వీరయ్య
ఘనంగా ప్రారంభమైన ఎస్‌ఎ‌ఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర శిక్షణా తరగతులు
నీట్ లీకేజీ, సీబీఎస్‌ఈ ‌మూల్యాంకన గందరగోళంపై..కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి : ఎస్‌ఎ‌ఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. నాగరాజు


నవతెలంగాణ-గోవిందరావుపేట
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యారంగంలో మతోన్మాద విధానాలను చొప్పిస్తూ చరిత్రను వక్రీకరిస్తున్నదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎస్‌ఎ‌ఫ్‌ఐ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు ఎస్. వీరయ్య అన్నారు. ప్రభుత్వ విద్యను బలహీనపరిచి కార్పొరేట్ సంస్థలకు విద్యను అప్పగించే విధానాలను విద్యార్థి సమాజం ప్రతిఘటించాలని తెలిపారు. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎ‌ఫ్‌ఐ) తెలంగాణ రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులు ములుగు జిల్లా గోవిందరావుపేటలోని పీఎస్‌ఏఆర్ గార్డెన్స్‌లో బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ఎస్‌ఎ‌ఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎస్. రజనీకాంత్ అధ్యక్షత వహించారు. శిక్షణా తరగతులను వీరయ్య ప్రారంభించి మాట్లాడారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంలో మతోన్మాద, విభజనాత్మక విధానాలు పెరిగాయని అన్నారు. జాతీయ విద్యా విధానం (ఎ‌న్‌ఈపీ) పేరుతో విద్యా వ్యవస్థలో కేంద్రీకరణను పెంచుతూ రాష్ట్రాల హక్కులను హరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. శాస్త్రీయ ‌దృక్పథం, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు విద్యార్థులు ముందుండి పోరాడాలని పిలుపునిచ్చారు. ఎస్‌ఎ‌ఫ్‌ఐ పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెడ్డి సాంబశివ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్న విద్యార్థి సంఘం ఎస్‌ఎ‌ఫ్‌ఐ మాత్రమేనని అన్నారు. గోవిందరావుపేటలో నిర్వహిస్తున్న ఈ శిక్షణా తరగతులు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలకు కొత్త స్ఫూర్తిని అందించాలని ఆకాంక్షించారు.

టీఎస్‌‌యూటీఎఫ్ ములుగు జిల్లా కార్యదర్శి రెడ్డి వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాలకు పరిమితం కాకుండా సమాజాన్ని అధ్యయనం చేయాలని, సామాజిక బాధ్యతతో ప్రజలకు నాయకత్వం వహించే వ్యక్తులుగా ఎదగాలని సూచించారు.ఎస్‌ఎ‌ఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. నాగరాజు మాట్లాడుతూ.. విద్యారంగ సమస్యలు, సమకాలీన రాజకీయ-ఆర్థిక పరిణామాలు, విద్యార్థి ఉద్యమాల చరిత్ర, సంస్థాగత నిర్మాణం వంటి అంశాలపై తరగతులు నిర్వహించనున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యారంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని అన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీలు, సీబీఎస్‌ఈ ఆన్-స్క్రీన్ ‌మూల్యాంకన విధానంలో తలెత్తిన గందరగోళం దీనికి నిదర్శనమని తెలిపారు. ఈ పరిణామాలకు కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థను కాపాడేందుకు, పారదర్శకమైన పరీక్షా విధానాలను అమలు చేయాలనే డిమాండ్‌తో ఎస్‌ఎ‌ఫ్‌ఐ దేశవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తుందని తెలిపారు. ఈ శిక్షణా తరగతుల్లో రాష్ట్ర ఉపాధ్యక్షులు దామెర కిరణ్, జి. శ్రీకాంత్, ములుగు జిల్లా అధ్యక్షులు జాగటి రవితేజ, జిల్లా కార్యదర్శి టి.ఎల్.రవి, రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థి ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -