మతతత్వం కాదు.. మానవత్వం కావాలి

మతతత్వం కాదు.. మానవత్వం కావాలి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సాగర్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్‌
నవతెలంగాణ మహబూబ్‌నగర్‌ /పాన్‌గల్‌
”మైనారిటీ.. మతో న్మాదం రెండూ ప్రమాదకరమే.. మతో న్మాదాన్ని పాలకవర్గాలే పెంచి పోషిస్తున్నాయి.. దానికి ప్రత్యామ్నాయంగా భావజాల రంగంలో విస్తృత పోరాటం జరగాలి.. దేశానికి మతతత్వం కాదు.. మానవత్వం కావాలి” అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సాగర్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్‌ అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్‌, వనపర్తి జిల్లాల్లో సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలకు రాజకీయ శిక్షణాతరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సైద్ధాంతిక అంశాలను అధ్యయనం చేయాలన్నారు. స్వయం గా ప్రధాని మోడీనే ప్రజల మధ్య మత విద్వేషాలు రగిల్చేలా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధిపత్య భావజాలమే కొనసాగాలనే విధంగా ఆయన ప్రసంగాలుంటున్నాయని చెప్పారు. మైనార్టీ ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉండాలనడం సరికాదన్నారు. బీజేపీ హయాంలో చేసిన అభివృద్ధిపై చర్చించకుండా నిత్యం అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజల దృష్టి మరల్చుతున్నారని విమర్శించారు. సామ్రాజ్యవాదం, మతోన్మాదం, కార్పొరేట్‌ శక్తులకు వ్యతిరేకంగా, ప్రజా సమస్యల పరిష్కారం కోసం విస్తృత పోరాటాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో సీపీఐ(ఎం) మహబూబ్‌నగర్‌ జిల్లా కార్యదర్శి ఏ.రాములు, నాయకులు కిల్లే గోపాల్‌, ఆర్‌.రామ్‌రెడ్డి, నల్లవెల్లి కురుమూర్తి, వి పద్మ, వనపర్తి జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్‌, నాయకులు జి.వెంకటయ్య, ఎం.బాల్య నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love