సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.డి జబ్బార్
నవతెలంగాణ-వనపర్తి
జూరాల ప్రాజెక్టును సందర్శించడానికి వెళ్తున్న సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి సాగర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకట రాములు తదితర నాయకులను భూత్పూర్ వద్ద పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని సీపీఐ(ఎం) వనపర్తి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని సీపీఐ(ఎం) వనపర్తి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎండి జబ్బర్ అన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర నేతల అరెస్టును ఖండిస్తూ స్థానిక జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
జూరాల ప్రాజెక్టును సందర్శించి, కృష్ణా పరివాహక ప్రాంతంలో ప్రాజెక్టుల పరిస్థితిని, రైతాంగ సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి వెళ్తున్న సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి సాగర్ ను, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటరములును ఇతర సీనియర్ నాయకులను భూత్పూర్ వద్ద పోలీసులు ముందస్తుగా అడ్డుకుని, అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని సీపీఐ(ఎం) వనపర్తి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.
రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, సాగునీటి ప్రాజెక్టులలో నెలకొన్న స్థితిగతులను అధ్యయనం చేయడం ప్రతిపక్షాలకు, ప్రజా సంఘాలకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా పర్యటనకు వెళ్తున్న నాయకులను అడ్డుకోవడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి అద్దం పడుతోందన్నారు. ప్రాజెక్టుల నిర్వహణలో, రైతులకు నీళ్లందించడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణి బయట పడుతుందనే భయంతోనే ఈ అరెస్టులకు పాల్పడ్డారు. అరెస్టులతో ప్రజా ఉద్యమాలను, రైతాంగ పోరాటాలను ఆపలేరని సీపీఐ(ఎం) స్పష్టం చేస్తోందన్నారు.
తక్షణమే అరెస్ట్ చేసిన నాయకులందరినీ ఎటువంటి షరతులు లేకుండా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు తగినంత సాగునీరు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. లేనిపక్షంలో ప్రభుత్వంపై నిరసనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) కౌన్సిలర్ మదన్, టౌన్ కార్యదర్శి పరమేశ్వరచారి, డి.కుర్మయ్య, బాలస్వామి, రాబర్ట్, బీసన్న, సాయిలీల, ఉమా తదితరులు పాల్గొన్నారు.



