కేంద్రానికి సహకరిస్తాం

– కోచ్‌ ఫ్యాక్టరీ ఇవ్వండి
– ప్రధానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఢిల్లీ నుంచి వర్చువల్‌ ద్వారా అమత్‌ భారత్‌ స్టేషన్‌ను ప్రధాన మంత్రి మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని బేగంపేట రైల్వే స్టేషన్‌లో వర్చువల్‌ స్క్రీన్‌ ఏర్పాటు చేసి తిలకించారు. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బహుమతులు అందచేసి, మాట్లాడారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో తెలంగాణకు హక్కుగా రావల్సిన కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన కానుకగా ఇవ్వాలని కోరారు. రైల్వే ఫ్లరుఓవర్‌ బ్రిడ్జి నిర్మాణాల సందర్భంగా అప్రోచ్‌ రోడ్లను కేంద్ర ప్రభుత్వం చేపడుతామని ప్రకటించినందుకు సంతోషం వ్యక్తంచేశారు. అప్రోచ్‌ రోడ్ల నిర్మాణానికి రోడ్లు భవనాల శాఖ నుంచి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ప్రజలకు చౌకైన రవాణాను రైల్వే అందిస్తుందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో 15 రైల్వే స్టేషన్లను విమానాశ్రయాల స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారనీ, వందేభారత్‌ రైళ్లు రాష్ట్రంలో తిరుగాడుతున్నాయని అన్నారు. స్థానిక ఉత్పత్తులు, కళారూపాలు, సంస్కృతీ, సాంప్రదాయాలకు భారతీయ రైల్వే ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కే లక్ష్మణ్‌ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 554 రైల్వే స్టేషన్లలో అత్యాధునిక సౌకర్యాలను కల్పించడం చారిత్రాత్మకమని అన్నారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love