భారత రాజ్యాంగానికి 75 ఏండ్లు. రాజ్యాంగాన్ని దేశానికి శక్తివంతమైన దారి దీపిక అనొచ్చేమో! దేశ కాలమాన పరిస్థితులు బట్టి ఎప్పటికప్పుడు అధునాతనం అవుతున్న రాజ్యాంగ ప్రధాన ఉద్దేశం దేశాన్ని గణతంత్ర, ప్రజాస్వామ్య రాజ్యంగా మార్చడం. రాజ్యాంగం ఉనికిలోకి వచ్చి మార్గం చూపుతున్న విధంగా మహిళల నడక సాగుతున్నదా? ఆమె జీవితం ఆత్మగౌరవంతో సాగుతున్నదా? విద్య, ఆరోగ్య, రాజకీయ రంగాల్లో సమ భాగస్వామ్యం పొందుతున్నదా? సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం అందుకుంటున్నదా? రాజ్యాంగ శిల్పులు ఊహించిన విధంగా ప్రజలలో మహిళను భాగంగా చూస్తున్నారా? అసలు రాజ్యాంగం మహిళలకు ఏమిచ్చింది? క్లుప్తంగా చర్చిద్దాం.
భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దేశ మహిళల స్థితిగతులపై ఆలోచించి మహిళల సాధికారత కోసం కృషి చేశారు. ఆయన దృష్టిలో మహిళలు కేవలం గృహిణులు కాదు. సమాజంలో సమాన భాగస్వాములు. అందువల్లనే భారత రాజ్యాంగంలో మహిళలకు సమానత్వం, గౌరవం కల్పించడానికి అనేక ఏర్పాట్లు చేశారు. తద్వారా మహిళల సాధికారత సాధ్యమవుతుందని భావించారు.
అందులో ముఖ్యమైనవి
రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 సమానత్వం, ఆర్టికల్ 15 వివక్ష లేని హక్కు, ఆర్టికల్ 16 మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు లభించేలా రాజ్యాంగం నిర్దేశించింది. ఆర్టికల్ 39 సి మహిళా ఉద్యోగినులు దోపిడీకి గురికాకుండా కాపాడటం, ఆర్టికల్ 39(స) మహిళలకు సమానంగా వేతనం, ఆర్టికల్ 42 ఉచిత ప్రసూతి సెలవులు ఇవ్వాలని రాజ్యాంగం స్పష్టంగా పేర్కొంది. అంబేద్కర్ మహిళల కోసం చేసిన కృషి వల్లనే మహిళల స్థాయిని పెంచే విడాకులు వంటి హక్కులు కల్పించే హిందుకోడ్ బిల్లు వచ్చింది. అనేక సామాజిక అన్యాయాలకు, అసమానతలను నిర్మూలిస్తూ కొన్ని సంస్కరణలకు కారణమైంది. మహిళల విద్యను ప్రోత్సహించింది. హిందూ వివాహ చట్టం 1955, హిందూ వారసత్వ చట్టం – 1956, వరకట్న నిషేధ చట్టం-1961, కుటుంబ న్యాయస్థానాల చట్టం 1984, మహిళల అసభ్య ప్రదర్శన నిషేధ చట్టం -1986, 2005 మహిళల రక్షణ కోసం గృహహింస చట్టం, లైంగిక వేధింపుల చట్టం 2013 వంటి సదుపాయాలున్నాయి. పంచాయితీ రాజ్ , నగరపాలక సంస్థల్లో మహిళలకు 50 % రిజర్వేషన్లు ఉన్నాయి. మహిళల హక్కుల రక్షణ, భద్రత సంబంధించిన అంశాల పరిరక్షణకు జాతీయ మహిళా కమిషన్ కృషి చేస్తుంది. మనకున్న చట్టాలు కొంత వరకు సహాయపడిన్నాయి. కానీ అనుకున్న ఫలితాలు సాధించగలుగుతున్నామా? లేదు, మహిళలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలు ఉన్నప్పటికీ మహిళలు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారు.
పెరుగుతున్న దాడులు
ఉద్యోగ అవకాశాలు, వేతనాలు, సామాజిక గుర్తింపు వంటి అనేక విషయాల్లో లింగవివక్ష కొనసాగుతూనే ఉంది. మహిళలపై గృహ హింస, లైంగిక వేధింపులు, అత్యాచారాలు వంటి సుడిగుండాల్లో చిక్కి విలవిలలాడుతూనే ఉన్నారు. ఉదాహరణగా బిల్కిస్ బానో కేసు తీసుకుందాం. 2002లో గుజరాత్ అల్లర్లలో గర్భవతిగా ఉన్న బిల్కిస్ బానో, ఆమె కుటుంబ సభ్యులపై జరిగిన సామూహిక అత్యాచారం, హత్యలు సంచలనం కలిగించిన విషయం అందరికి తెలిసిందే. ఆమె ఎన్నో ఏండ్లు న్యాయం కోసం పోరాడింది. నిందితులకు శిక్ష పడింది. కానీ ఏం లాభం? గుట్టుచప్పుడు కాకుండా క్షమాభిక్ష పేరుతో హంతకులైన నేరస్థులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. అంతేకాదు పూలదండలతో ఆహ్వానం పలికింది. దీంతో బిల్కిస్ బానో, మానవ హక్కుల సంస్థలు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. గుజరాత్ ప్రభుత్వ నిర్ణయం రద్దయింది. ఈ కేసు దేశ మహిళల భద్రత, న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు నమ్మకానిచ్చింది. ఈ మధ్య కాలంలో ఎన్ని సవాళ్లు, ఎన్ని అవమానాలు, ఎంత యాతన? దానికి బాధ్యులెవరు? దేశంలో మహిళల మాన ప్రాణాలకు రక్షించాల్సిన ఆ రాష్ట్ర ప్రభుత్వం నేరస్థుల పక్షాన నిలబడటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాదా?
మహిళలు ఇంటికే పరిమితమా..?
చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం నానాటికీ దిగజారిపోతున్నది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కోరుతూ ముప్పై ఏండ్లకు పైగా పోరాటం చేయాల్సి వచ్చింది. గత పార్లమెంట్ ఎన్నికల ముందు సెప్టెంబర్ 28, 2023లో బిల్లు వచ్చినప్పటికీ అమలు కాలేదు. మహిళలు సమాజంలో తమ స్థితి మెరుగుపడటం కోసం, తమ హక్కుల కోసం పోరాడి కొన్ని చట్టాలు సాధించుకున్నారు. కానీ మహిళల స్థితిగతుల్లో రావలసిన మార్పు రాకపోవడానికి కారణం ఏంటి? మహిళలను కేవలం గృహిణులుగానే చూసే సామాజిక దృక్పథం కొనసాగుతూనే ఉంది. అందుకు ఎల్ డ టి చైర్ పర్సన్ ఎస్ ఎన్ సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలు మంచి ఉదాహరణ. వారాంతపు సెలవు ఎందుకు? ఇంట్లో పెళ్ళాం ముఖం ఎంత సేపని చూస్తారు? అని అతని వ్యాఖ్య. ఉద్యోగులంటే పురుషులేనా? మహిళలు కాదా? మహిళలు చేసే ఉద్యోగానికి విలువ లేదా? మహిళ గృహిణిగా మాత్రమే ఉండాలా? ఏమిటీ ధోరణి? ఎందుకిలా మాట్లాడుతున్నారు? మన సమాజం పురుషస్వామ్య సమాజం. మహిళల్ని గృహిణులుగా మాత్రమే చూసే దృక్పథం ఇప్పటికి బలంగా ఉంది.
ఇవే కారణాలు…
సామాజిక సాంస్కృతిక విలువలు అంటే ఆచారాలు, సంప్రదాయాలు మహిళల అభివృద్ధికి అడ్డంగా నిలిస్తున్నాయి. అందువల్లే చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగే బిల్లు చట్టం రావడానికి ముప్పై ఏండ్లకు పైనే పట్టింది. ఇక చేసుకున్న చట్టాల అమలులో ఉన్న లొసుగులు, లోపాలు, పోలీసులు న్యాయస్థానాలు మహిళల ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించక పోవడం, నిందితులకు తగిన శిక్షలు పడకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా లేకపోవడం వల్ల పురుషులపై ఆధారపడి పోరాడే శక్తి కోల్పోతుంది. ముఖ్యంగా మహిళలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు అమలు కాకపోవడానికి, జెండర్ అసమానతలు తొలగక పోవడానికి కులం, మతం పితృస్వామ్యం వంటి సామాజిక సాంస్కృతిక కారణాల పాత్ర ప్రధానమైనది.
స్వేచ్ఛను కట్టడి చేస్తున్నాయి
మన దేశంలో ఉన్న అన్ని మత గ్రంథాల్లో పురుషుల కంటే మహిళలు తక్కువ అన్న భావన కనిపిస్తుంది. పురుషులకు సేవ చేయడమే మహిళ కర్తవ్యం అని నమ్మే మత సాంప్రదాయాలు, కుల కట్టుబాట్లు మహిళా స్వేచ్ఛను కట్టడి చేస్తున్నాయి. మహిళలను సమాజానికి దూరం చేస్తున్నాయి. కులగౌరవం కాపాడాలనే పేరుతో మహిళల చదువు, ఉద్యోగాలకు అనుమతించకుండా బాల్యవివాహాలు చేస్తున్నారు. కులం తప్పి మరో కులం/మతం వారిని పెండ్లి చేసుకుంటే పరువు హత్యలకు పాల్పడటం, మత నాయకులు, కుల పెద్దలు మహిళల హక్కులు వ్యతిరేకిస్తూ తీర్పు చెప్పడం, ప్రచారం చేయడం వంటివన్నీ రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచేవే.
సమాజం సవ్యంగా సాగుతుందా?
పితృస్వామిక భారతీయ సమాజంలో పురుషులదే నిర్ణయాధికారం. మహిళ గృహిణి మాత్రమే. విద్య, ఆరోగ్య, ఆస్తి హక్కులు అంతంత మాత్రమే. ఒకరిద్దరు కంపెనీ సిఇఓలను లేదా నిర్ణయాధికారంలో ఉన్న మహిళలను చూపించి అది మహిళాభివృద్ధి, లింగ సమానత్వం అనుకుంటే పొరపాటే. మహిళలకు తగిన గుర్తింపు, సమాన అవకాశాలు, ఆర్థిక సమానత్వం లేని వ్యవస్థలో, మహిళలకు రక్షణలేని, మానవ విలువలు అడుగం టుతున్న సమాజం సవ్యంగా సాగుతుందా? సాగదు. మరింత వెనుకబడిపోతుంది. స్త్రీని సమాజాభివృద్ధిలో భాగస్వామిగా చేసిన సమాజం ముందుకు పోతుంది.
చైతన్యం కావాలి
ప్రస్తుతం కోట్లాడి పోరాడి సాధించుకున్న మహిళల హక్కులు కోల్పోయే తిరోగమన దిశగా అడుగులు పడుతున్నాయి. జన జీవనంలోకి చొచ్చుకొచ్చి నియంత్రిస్తున్న మతం కోరలు చాచి వికటాట్టహాసం చేస్తున్నది. మహిళల శ్రేయస్సుకు ముప్పు కలిగించే మతం కోరలు పీకి, భారతీయ మహిళ రాజ్యాంగం తనకు కల్పించిన హక్కులు, చట్టాలు అందుకోవాలి. సమాజంలో అన్ని రకాల వివక్షతలు పోయి సమస్థానం, గౌరవమర్యాదలు అందుకొని ఉన్నతంగా ఎదిగే రోజు రావాలి. ఇది జరగాలంటే రాజ్యాంగ పరమైన హక్కులతో పాటు ప్రజల్లో అవగాహన, చైతన్యం రావాలి. అందుకు పౌర సంస్థల, ఉద్యమ సంస్థల కృషి మరింత అవసరం.
– వి. శాంతి ప్రబోధ