అయోధ్య వివాదం దేనికోసం?

అయోధ్య వివాదం దేనికోసం?12వ శతాబ్దపు కవి, తత్వవేత్త బసవ ఇలా అన్నాడు : ధనవంతులు శివుని కోసం ఒక ఆలయాన్ని నిర్మిస్తారు. పేదవాడినైన నేను, ఏమి చేయాలి?  నా కాళ్ళు స్తంభాలు,శరీరం ఓ  ఆరాధనా మందిరం, శిరస్సు ఓ బంగారు గోపుర శిఖరం…
శతాబ్దాల తరువాత నోబెల్‌ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ మరొక దేవాలయం గురించి రాస్తాడు. ఒక రాజు నిర్మించిన ఆ ఆలయం ”ఆకా శాన్ని ఛేదిస్తుంది”, ఇది ”బంగారు సింహాసనం” పై ”ముత్యాలు పొదిగిన విగ్రహాన్ని” కలిగిఉంది. అయితే విస్తత స్థాయిలో గౌరవాన్ని పొందే ముని మాత్రం ఆలయాన్ని తిరస్క రిస్తూ, దానికి బదులుగా రోడ్డు వెంట ఉన్న ఒక చెట్టు కింద దేవునిపై పాటలు పాడతాడు. జనమంతా ఆయన చుట్టూ గుమి గూడారు. ఆలయం ఖాళీగా పడిఉంది. రాజు ఆగ్రహిస్తాడు. అప్పుడు ముని, 20వేల మంది ప్రజల్ని నిరాశ్రయులుగా, దిక్కులేని వారిగా మార్చిన మంటల అలజడి గురించి రాజుకు గుర్తుచేస్తాడు. సహాయం కోరుతూ వారంతా వచ్చి అతని తలుపు వద్ద నిల బడ్డారు. అయితే ఇళ్ళులేని తన ప్రజలకు ఆయన ఇళ్ళు ఇవ్వడానికి బదులుగా, ఒక దేవత కోసం బంగారంతో ఒక ఇంటిని నిర్మిస్తే సరిపోతుందని అనుకున్నాడు.
”ఆ ఆలయంలో దేవుడు లేడు… ప్రపంచ దేవుడ్ని కాక, నిన్ను నీవు ప్రతిష్టించుకున్నావని” ముని, రాజుతో అంటాడు.
దేవుడిలా ప్రకటిస్తాడు : నా శాశ్వత గహం లెక్కలేనన్ని దీపాలతో అనంత ఆకాశంలో నీలిరంగులో వెలిగిపోతున్నాయి దీని శాశ్వత పునాదులు సత్యం, శాంతి,కరుణ, ప్రేమ..
జనవరి 22 వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు అధినేత మోహన్‌ భగవత్‌ సమక్షంలో 51 అంగులాల నల్లరాతితో బాలరాముని విగ్రహాన్ని,అయోధ్యలో ప్రతి ష్టించారు. స్వాతంత్య్రం సిద్ధించిన కొన్ని సంవత్సరాలకే సౌరాష్ట్ర ప్రభుత్వం సోమనాథ దేవాలయ పునర్నిర్మాణానికి 5 లక్షల రూపా యలు కేటాయించినప్పుడు, భారత ప్రథమ ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ మాటలు నాకు గుర్తుకొస్తున్నాయి. ”ఏ ప్రభుత్వమైనా ఇలా చెయ్యడం పూర్తిగా సరైంది కాదని నాకనిపిస్తుంది.ఆ ప్రకారమే, నేను ఆ ప్రభుత్వానికి లేఖ రాస్తానన్న : ”ఏ సమయంలోనైనా ఇది ఆమోదయోగ్యం కాదు, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో, దేశం ఆకలితో అలమటిస్తున్న సమయంలో జాతీయ ఆర్ధిక వ్యవస్థ, ఆర్థిక సంక్షోభం గురించి మనం మాట్లా డుకునే సమయాన ప్రభుత్వం ఈ ఖర్చుకు పూనుకో వడం అందునా ఒక రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక ఆలయ ప్రతిష్టాపన ఉత్సవాల కోసం పెద్ద మొత్తంలో డబ్బును ఎలా ఖర్చుచేయగలుగు తుంది” అన్నారు నెహ్రూ.
సోమనాథ దేవాలయం సౌరాష్ట్ర తీర ప్రాం తంలో ఉన్న ప్రభాస్‌ పఠాన్‌ వద్ద ఉంది. 1026 లో దురాక్రమణదారుడైన మ హ్మద్‌ ఘజనీ దానిని కొల్లగొట్టి, నాశనం చేశాడు.ఆ తరువాత దశాబ్దాల్లో కూడా అలా అనేకసార్లు జరిగింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సర్దార్‌ వల్లభ్‌భారు పటేల్‌ ఈ ఆలయాన్ని పునర్నిర్మిం చాలని ఆదేశించాడు.1950లో ఆయన మరణం తరువాత,నాటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్‌ దీవెనలతో కాంగ్రెస్‌ నాయకుడైన కే.ఎం.మున్షీ ఈ కార్యాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. అయితే, ఒక మతపరమైన కార్యక్రమంలో లౌకికరాజ్యం ప్రమేయాన్ని,ఒక మతపరమైన మందిర పునర్నిర్మాణానికి ప్రభుత్వ నిధుల కేటా యింపును, 1951లో ఆలయ ప్రారంభోత్సవం సమయంలో రాష్ట్ర పతితో సహా సీనియర్‌ అధికారులు హాజరు కావడాన్ని నెహ్రూ వ్యతిరేకించాడు. రాజ్యాంగ నిబంధనలకు భిన్నంగా ఒక్క మతానికే ప్రాధాన్యతనిచ్చే ఎలాంటి చర్యనూ ఆయన సమర్ధించలేదు.
సోమనాథ దేవాలయం పునర్నిర్మాణాన్ని చేపట్టిన మున్షీకి, దీన్నే ”హిందూ పునరుద్ధరణవాద” ప్రయత్న మని నెహ్రూ అభివర్ణించాడు.ఆయన తన అసమ్మతిని కూడా మర్యాదగా రాజేంద్రప్రసాద్‌కు తెలియజేశారు: అయితే ఒక లౌకికరాజ్యం, ఆలయ నిర్మాణం లాంటి కార్యాలకు దూరంగా ఉండాలన్న నెహ్రూ డిమాండ్‌ పట్ల, దశాబ్దాల తర్వాత మోడీ చాలా కఠినంగా ఇలా మాట్లాడాడు. ”సోమనాథ దేవాల యానికి వ్యతిరేకంగా వ్యవహరించిన వారిని సాహసవంతు లైన ప్రజలకు చెందిన ఈ నేల క్షమించదని” ప్రకటించాడు.
భారతదేశంలో ముస్లింలు మెజారిటీగా ఉన్న ఏకైక రాష్ట్రమైన జమ్మూకాశ్మీర్‌లో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370 కింద ఉన్న ప్రత్యేక రక్షణలను రద్దు చేయడం, యూనిఫాం సివిల్‌ కోడ్‌ ఏర్పాటుతో పాటు, 460ఏళ్ళుగా అయోధ్యలో ఒక మసీదు ఉన్న స్థలంలో రామునికి గొప్ప ఆలయాన్ని నిర్మించాలనే ముఖ్యమైన ఎజెండాను ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలు ముందుకు తెచ్చాయి.ఈ కారణంగానే బాబ్రీ మసీదు స్థలంలో రాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కాషాయ దళానికి ఒక విజయోత్సవ సమయమైంది. అయితే నేను ఇంతకు ముందు రాసినట్లు,ఇది ఉత్తరప్రదేశ్‌లో ధూళిమయంగా ఉన్న ఒక చిన్న పట్టణంలో రెండు ఫూట్‌బాల్‌ మైదానాల పరిమాణంలో ఉండే చిన్నపాటి భూమికి సంబంధించిన వివాదం కాదు. ఇది మధ్య యుగాల నాటి మసీదు(ఇప్పుడు నేలమట్టం చేయబడిన)కు, ఆల యానికి మధ్య పోటీ కూడా కాదు. ఇది ఏ రకమైన దేశం, భవి ష్యత్తులో ఎలాంటి దేశంగా ఉంటుంది, ఈ దేశానికి చెందిన వారెవరు, ఎలాంటి షరతులపైన ఆధారపడి భిన్న అస్తిత్వాలు, భిన్న విశ్వాసాలు గల ప్రజలు ఈ విశాలమైన భూమిపై కలిసి జీవించాలనే విషయం గురించే ఈ వివాదం.
భారతదేశం గురించి ఒక భావన ఉంది.ఆ భారతదేశ భావన కోసమే మోహన్‌ దాస్‌ కరంచంద్‌ గాంధీ ఇష్టపూర్వకంగా తన జీవితాన్ని త్యాగం చేశాడు,ఆ భావననే బీ.ఆర్‌.అంబేద్కర్‌ రాజ్యాం గంలో పొందుపరిచాడు. ప్రతీ అస్తిత్వం, ప్రతీ విశ్వాసానికి చెందిన ప్రజలందరినీ అన్ని విషయాల్లో సమానంగా చూసే భారతదేశం ఇది. భారతదేశ హిందువులు,సిక్కులు,జైనులు, బౌద్ధులు, వాస్తవా నికి పార్శీలు, క్రైస్తవుల వలెనే,భారతీయ ముస్లింలు కూడా విశ్వా సంతో, చట్టబద్ధంగా వారి జన్మభూమి, వారి ఎంపిక పట్ల సమాన మైన హక్కును కోరడమే ఆ భావన. శక్తివంతులైన, మెజారిటీ విశ్వాసాలు గల ప్రజల వాదనలకు లోబడి ఇతర మతాల ప్రజలు తమ వాదనలను వదులుకోకుండా,విశ్వాసాలలో ఎలాంటి క్రమా నుగత ఆదేశాలు ఉండవనే హామీ ఉంటుంది.
ఈ భారతదేశ భావనకు వ్యతిరేకంగా, భారతదేశానికి సం బంధించి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూ మహాసభలకు మరొక ఊహ ఉంది. అదేమంటే, ఈ దేశం హిందూ (అగ్రవర్ణాలకు) ప్రజ లకు చెందినది. దీనిలో సిక్కులు,జైనులు,బౌద్ధులు ఉంటారు ఎం దుకంటే, వారి మతాలు కూడా భారతదేశ మట్టిలో నుండే పెరి గాయి. అయితే ఇస్లాం, క్రైస్తవులు విదేశీ విశ్వాసాలను పాటిస్తారు కాబట్టి వారిని ”విదేశీయులు”గా గుర్తిస్తారు.ఈప్రత్యామ్నాయ భార తదేశ ఊహలో వారి అనుచరుల్ని భారతదేశంలో నివసించడానికి మెజార్టీ హిందువులు(అగ్రవర్ణాలు)అనుమతిస్తారు, అయితే మెజా రిటీ మతం, సంస్కతికి చెందిన మనోభావాలు,విశ్వాసాలకు లో బడి ఉండాలనే షరతుపై మాత్రమే అనుమతిస్తారు.బాబ్రీ మసీదు స్థలంలో రామ మందిర నిర్మాణం కోసం జరిగే ప్రచారం మొత్తం కూడా హిందువుల కోసమేనన్నట్టు సాగింది.కానీ విశ్వహిందూ పరిషత్‌ అనే ప్రధాన తగాదాల మారి హిందూత్వ మిలిటెంట్‌ సంస్థ,ఆర్‌ఎస్‌ఎస్‌,హిందూ మహాసభలు అనేకమంది హిందువుల మనోభావాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి కానీ హిందువులంతా ఆ సంస్థల్ని ఏ రకంగానూ సమర్ధించడం లేదు.
16వ శతాబ్దంలో మసీదును నిర్మించడానికి వాస్తవంగా రాముని హిందూ దేవాలయాలయాన్ని కూల్చివేశారనే రుజువు లేదనే విషయాన్ని,హిందూ వ్యాజ్యగాళ్ళకు భూమిని కేటాయిస్తూ ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు ధ్రువీకరిస్తుంది.కానీ సర్వోన్నత న్యాయ స్థానం తీర్పు తర్వాత నేనడిగినట్లు,వాస్తవానికి మసీదు నిర్మించిన స్థలంలో హిందూ ఆలయం ఉందని నిరూపించే రుజువులు ఉన్నా యా? మసీదు ఉన్న స్థలంలో రామమందిరం నిర్మించాలని బీజేపీ నాయకుడు ఎల్‌.కే.అద్వానీ నాయకత్వంలోని మొత్తం ఉద్యమం కోరుకుంది కాబట్టి 21వ శతాబ్దంలో చరిత్రలో జరిగిన తప్పిదాల్ని సరిచేసుకునే ప్రయత్నం చేయడానికి చట్టపరమైన,రాజ్యాంగ ఆధారాలు ఏమైనా ఉన్నాయా?ఇది ఎప్పటికి అంతమవుతుందో ఎవరు నిర్ణయిస్తారు? ఈ ”దిద్దుబాట్లు” ఇతర వివాదాస్పద స్థలా లకు వర్తిస్తుందా? ఇలా చరిత్రలో మనం ఎంతవరకు వెళ్లాలి? 500 సంవత్సరాల చరిత్ర వద్దే ఎందుకు ఆగాలి?1000, లేక 1500, లేక 2000 సంవత్సరాలు, లేక ఇంకా దూరంగా ఎందుకు వెళ్ళకూడదు? 9వ శతాబ్దం వరకు భారతదేశంలో అనేక ప్రాం తాల్లో బౌద్ధం ఉండేది, బ్రాహ్మణవాద హిందూ మతం అత్యంత క్రూరంగా బౌద్ధ మతాన్ని అణచివేసి, భారతదేశంలో దాదాపు తుడిచిపెట్టింది.బౌద్ధ స్తూపాలను కూల్చి వేయడం ద్వారా అనేక దేవాలయాలను నిర్మించారనే రుజువులు చరిత్రలో ఉన్నాయి.
కాబట్టి హిందూ దేవాలయాలున్న ప్రాంతాల్లో బౌద్ధ ప్రార్థనా స్థలాన్ని పునఃస్థాపన చేయాలని మనం ఇప్పుడు వాదనలు చెయ్యా లా? వాస్తవానికి, భారతదేశంలోని అనేక గిరిజన ప్రజల ప్రార్థనా స్థలాల్ని వేల సంవత్సరాలుగా హిందూ ప్రార్థనా స్థలాలకు ఇచ్చేట్లు వారిని ఒత్తిడి చేశారు. చరిత్రలో మనం ఎంత వెనక్కి వెళ్ళాలనే విషయాన్ని ఎవరు నిర్ణయిస్తారు? మనం కొన్ని చరిత్రల్నే ఎందుకు ఎంచుకోవాలి, ఇతరులను సరి దిద్దడానికి ఎందుకు ఎంచుకోకూడదు? మరీ ముఖ్యంగా మన రాజ్యాంగంలో, చట్టంలో ఏది ఈ ఎంపికల్ని సమర్ధి స్తుంది? రాముడు అయోధ్యలో జన్మించాడని చాలా మంది హిందువులు నమ్ముతారు అయితే ఆయన పుట్టిన అయోధ్య వాస్తవానికి నేడున్న అయోధ్య ఒకటేనా అనే దానిపై భిన్న మైన విశ్వాసాలున్నాయి. ప్రస్తుత అయోధ్యలో కూడా రాము డు పుట్టిన ప్రదేశంగా అక్కడి నివాసితులు చెప్పుకునే ప్రదే శాలు చాలానే ఉన్నాయి. రాముడు మరెక్కడో జన్మించాడనే అసంఖ్యాక హిందువుల విశ్వాసం, నమ్మకం కంటే కూడా, రాముడు మసీదు గోపురం కింద జన్మించాడనే ఒకే విశ్వా సం, నమ్మకానికే సుప్రీంకోర్టు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడా నికి గల కారణాలు ఏమిటి?
ఆందోళనకరమైన విషయమేమంటే, కేవలం బీజేపీ-ఆర్‌ ఎస్‌ఎస్‌ వారు మాత్రమే కాక విస్తతస్థాయిలో రాజకీయ భావా లున్న పెద్ద వర్గాల వారు కూడా నూతన రామ మందిరం ప్రకా రమే నైతిక, ఆధ్యాత్మిక, చట్టపరమైన చట్టబద్ధతను కలిగి ఉన్నారు. మూడు నేరపూరితచర్యల ఫలితంగా మసీదు ఒక ఆలయంగా మారింది. 1949లో మసీదులోకి రాముని విగ్రహాన్ని రహస్యంగా, చట్టవిరుద్ధంగా ప్రవేశపెట్టడమనేది మసీదులో ప్రార్థనలకు అంతరాయం కల్గించిన మొదటి నేరపూరిత చర్య. రెండవది, 1992లో అలజడి సష్టించే అల్లరిమూకచే మసీదు కూల్చివేత, ఈ చర్యను అద్వానీ లాంటి నాయకులు కేరింతలతో ప్రోత్సహించారు. గాంధీ హత్యానంతరం, దేశానికిది విచారకరమైన రోజని ఉప రాష్ట్రపతి కే.ఆర్‌.నారాయణన్‌ అన్నారు. ఈ ఉద్యమం, కూల్చివేత 1989 నుండి 1993 ప్రారంభం వరకు దేశవ్యాప్తంగా భయం కరమైన అల్లర్లను సష్టించిందీ. వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు, దాని మానని గాయాలు దశాబ్దాల తర్వాత కూడా దేశాన్ని ముక్కలు చేయడం కొనసాగుతూనే ఉంది.
(స్క్రోల్‌.ఇన్‌ సౌజన్యంతో)
అనువాదం : బోడపట్ల రవీందర్‌, 9848412451
(ఇంకా వుంది..)
హర్ష్‌మందర్‌

Spread the love