Wednesday, September 9, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంయుద్ధం ముగిసిన తర్వాత ఏం చేద్దాం ?

యుద్ధం ముగిసిన తర్వాత ఏం చేద్దాం ?

- Advertisement -

అమెరికా సైనిక, నిఘా అధికారుల
రహస్య సమాలోచనలు

వాషింగ్టన్‌ : ఇరాన్‌ యుద్ధానికి ముగింపు పలకడంలో ట్రంప్‌ ప్రభుత్వం విజయం సాధిస్తే ఆ తర్వాత మధ్యప్రాచ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై అమెరికా సైనిక, గూఢచార విభాగాల అధికారులు రహస్య సమాలోచనలు జరుపుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో మోహరించిన సైనిక దళాలను, ఇతర సౌకర్యాలను తగ్గించడంపై వారు చర్చిస్తున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు గత అధ్యక్షులు ఎంచుకున్న మార్గాన్నే ట్రంప్‌ కూడా అనుసరించే అవకాశం ఉంది. అంటే యుద్ధం ముగిసిన తర్వాత మధ్యప్రాచ్యాన్ని అమెరికా జాతీయ భద్రతా యంత్రాంగం పర్యవేక్షిస్తుందన్న మాట.

బలహీనపడిన మౌలిక సదుపాయాలు
2011 సెప్టెంబర్‌ 11న జరిగిన దాడుల తర్వాత అమెరికా ఆరు దేశాలలో…ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌, సిరియా, ఇరాన్‌, యెమన్‌, లిబియా…యుద్ధం చేయడానికి, దాడులు జరపడానికి శాశ్వత సైనిక, నిఘా సౌకర్యాలను విస్తరించింది. అయితే ఇరాన్‌తో జరిగిన పోరు మధ్యప్రాచ్యంలోని అమెరికా మౌలిక సదుపాయాలను బలహీనపరచింది. గల్ఫ్‌ దేశాలలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్‌ అనేక పర్యాయాలు దాడులు చేసింది. ఫలితంగా ఆ స్థావరాలలోని 18 మంది సైనికులు మరణించారు. ఈ చేదు అనుభవాల దృష్ట్యా ట్రంప్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలియడం లేదు. ఆయనకు ఆమోదయోగ్యమైన నిర్ణయం కోసం సంప్రదింపులు జరుపుతున్నామని సైనిక, నిఘా అధికారులు తెలిపారు. యుద్ధానంతరం ఏం చేయాలనే విషయంపై ట్రంప్‌ ఇంకా ఎలాంటి వ్యూహాన్ని వెల్లడించలేదు.

భూగర్భంలోకి స్థావరాల తరలింపు ?
మధ్యప్రాచ్యంలో ప్రస్తుతం అమెరికాకు చెందిన యాభై వేల మంది సైనికులు, రెండు యుద్ధ విమాన వాహక నౌకలు, డజనుకు పైగా క్షిపణి విధ్వంసక నౌకలు మోహరించి ఉన్నాయి. ఇవి కాకుండా సైనిక ఆస్తులు కూడా భారీగానే ఉన్నాయి. యుద్ధం ముగిసిన తర్వాత కూడా ఆ ప్రాంతంలోనే ఉండిపోయే సైనికుల కోసం రక్షణ వ్యవస్థలను పటిష్టం చేసే విషయంపై సైనిక అధికారులు దృష్టి సారించారు. ఇరాన్‌ క్షిపణి, డ్రోన్‌ దాడుల నుంచి రక్షణ పొందడానికి అవసరమైతే కొన్ని స్థావరాలను భూగర్భంలోకి తరలించాలన్న ఆలోచన కూడా ఉంది. 1998 నుంచి ఆ ప్రాంతంలో అమెరికా 27 వేల మంది సైనికులను మోహరించింది. సెప్టెంబర్‌ 11 దాడుల తర్వాత ఆ సంఖ్య మరింత పెరిగింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 2007-11 మధ్యకాలంలో మధ్యప్రాచ్యంలో అమెరికా సైనికుల సంఖ్య ఏనాడూ లక్షకు తక్కువ లేదు. 2011 తర్వాత కూడా ఆ సంఖ్య 30,000 నుంచి 60,000 వరకూ ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -