అమెరికాలోని మియామీలో వాహనాలను ఢీ కొన్న అమెజాన్ కార్గో ఫ్లైట్ ఐదుగురు మృతి..
మియామి : అమెజాన్‌కు చెందిన కార్గో విమానం ఘోర ప్రమాదానికి గురైంది. రన్‌వే దాటి బయటకు వెళ్లిన విమానం అక్కడి వాహనాలను ఢీకొని మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు గాయపడినట్టు చెప్పారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం, ఆది వారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్యూర్టోరికోలోని శాన్ జువాన్ నుంచియ మయానికి వచ్చిన అమెజాన్కు చెందిన కార్గో విమానం ల్యాండ్ అవుతుండగా రన్వేపై అదుపుతప్పింది. విమానం రన్‌వే దాటి వెళ్లే సమయంలో సమీపంలోని పలు వాహ నాలను ఢీకొట్టింది. భారీగా మంటలు చెలరేగడంతో ఘటనా స్థలంలో దట్టమైన నల్లటి పొగ ఆకాశంలోకి ఎగసింది. విమానంలోని పైలట్, కో-పైలట్ కాక్‌పిట్‌లో చిక్కుకు పోయారని మయామి-డేడ్ రెస్క్యూ ఫైర్ చీఫ్ రే జదల్లా తెలిపారు. కొంతమంది వాహనాల్లోనూ చిక్కుకు న్నారని, మరో వ్యక్తి వాహనం కింద ఇరుక్కుపోయినట్లు చెప్పారు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. అయితే వారు విమానంలోని వారా? ఢీకొన్న వాహనాల్లో ఉన్న వారా? అన్నది వెంటనే నిర్ధారించలేమని అధికారులు తెలిపారు.
ఎయిర్పోర్ట్ విమానాల రాకపోకలకు అంతరాయం
ప్రమాదం కారణంగా మయామి అంతర్జాతీయ విమానాశ్రయంలో చాలా సేపు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విమానాల రాకపోకలను పర్యవేక్షించే ఫ్లైట్‌అవేర్ ప్రకారం, ఆదివారం సాయంత్రానికి సుమారు 250 విమానాలు ఆలస్యమయ్యాయి. ప్రమాదం జరిగిన కొన్ని గంటల తర్వాత కూడా విమానం నుంచి ఇంధనం లీక్ అవుతుండటంతో అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగించారు. ప్రమాదం జరిగి సమయంలో విమానం సమీపంలోని రహదారి పక్కన రెండు భారీ ట్రక్కుల వద్ద ఆగిపోయింది. మంటలు చెలరేగినప్పటికీ విమానం పూర్తిగా ధ్వంసం కాలేదని దృశ్యాల్లో కనిపించింది.
చార్టర్ విమానం కూలి 8మంది మృతి
ఆగస్టులోనే అమెరికాలోని వెస్ట్రన్ అలాస్కాలో చార్టర్ విమానం ప్రమాదం జరిగింది. అలస్కాలోని యాంకరేజ్‌కు పశ్చిమాన సుమారు 450 మైళ్ల (725 కి.మీ.) దూరంలో ఉన్న కేప్ న్యూన్‌హామ్ లాంగ్ రేంజ్ రాడార్ సైట్ ఎయిర్పోర్ట్ సమీపంలో చార్టర్ విమానం కూలిపోవడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి గురైన విమానం యాంకరేజ్ నుంచి బయలుదేరి, కేప్ న్యూన్‌హామ్ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. విమానంలో ఇద్దరు పైలట్లు, ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు.
దర్యాప్తు చేపట్టనున్న ఎన్‌టీఎస్‌బీ
ప్రమాదానికి అసలు కారణమేంటన్నది ప్రస్తుతం స్పష్టంగా తెలియలేదు. అమెరికా జాతీయ రవాణా భద్రతా మండలి (ఎన్టీఎస్బీ) దర్యాప్తు ప్రారంభించేందుకు ప్రత్యేక బృందాన్ని మయామికి పంపుతోంది. ఎన్‌టీఎస్‌బీ చైర్ జెన్నిఫర్ హోమెండీ నేతృత్వంలో ఈ బృందం ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను పరిశీలించనుంది. దర్యాప్తు సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని అమెజాన్ ప్రకటించింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సంస్థ, మృతుల కుటుంబాలు, వారి ఆత్మీయులకు సానుభూతి తెలిపింది.
32 ఏండ్ల బోయింగ్ 767
ప్రమాదానికి గురైన విమానం బోయింగ్ 767. దాదాపు 32 ఏండ్ల క్రితం తయారైన ఈ విమానం తొలుత ప్రయాణికుల విమానంగా సేవలందించింది. రెండు దశాబ్దాలకు పైగా పలు విమానయాన సంస్థల్లో ప్రయాణికుల రవాణాకు ఉపయోగించిన అనంతరం 2015లో కార్గో విమానంగా మార్చినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ సంస్థ ఫ్లైట్‌రాడార్24 తెలిపింది. ఈ విమానాన్ని నార్త్ కరోలినాకు చెందిన కార్గో విమానయాన సంస్థ 21 ఎయిర్ నిర్వహిస్తోంది. అమెజాన్ ప్రైమ్ ఎయిర్ కార్యకలాపాల్లో భాగంగా ఇది సేవలందిస్తోంది.



