కొత్త పుంతలు తొక్కుతున్న
క్యూబన్ల ఆలోచనలు
హవానా : కరేబియన్ ద్వీపమైన క్యూబాలో విద్యుత్ సంక్షోభం రోజురోజుకూ తీవ్రమవుతోంది. వరుస విద్యుత్ కోతలు, ఇంధన కొరత వంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న క్యూబా ప్రజల మనసులో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రీఛార్జింగ్ సౌకర్యం లేనప్పుడు సెల్‌ఫోన్ బ్యాటరీని ఎలా ఆదా చేసుకోవాలి, ఫ్రిజ్ పనిచేయనప్పుడు ఆహారాన్ని ఎలా నిల్వ చేసుకోవాలి, ఏసీలు అందుబాటులో లేనప్పుడు వేడికి ఎలా తట్టుకోవాలి, దేశం యావత్తూ గాడాంధకారంలో మునిగిపోయినప్పుడు విద్యుత్‌ను ఎలా ఉత్పత్తి చేయాలి వంటి ప్రశ్నలకు సమాధానాల కోసం వారు సృజనాత్మకంగా ఆలోచించాల్సి వస్తోంది. విద్యుత్ సంక్షోభం కారణంగా రైతులు బగ్గుల మంటపై పాలను వేడి చేసుకోవాల్సి వస్తోంది. ప్రయాణికులు సౌరశక్తితో నడిచే చైనా ట్రైసైకిళ్లపై తిరగాల్సి వస్తోంది.
హవానాలోని అగ్రేరియర్ యూనివర్సిటీలో మూడో సంవత్సరం కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చదువుతున్న మారెరో తన తోటి దేశస్థుల మాదిరిగానే పరిస్థితులకు అలవాటు పడడంతో సరిపెట్టుకోకుండా నూతన అన్వేషణలపై దృష్టి సారించాడు. కారాబల్లోలోని తన ఇంటిలో వీడియోలను రికార్డు చేసేటప్పుడు వెలుగును అందించే రీఛార్జబుల్ ఫ్యాన్ వంటి అత్యవసర వస్తువులను ఎలా తయారు చేయవచ్చో ప్రజలకు వివరించాడు. మొబైల్ నెట్వర్క్ యొక్క ఇంటర్నెట్ సిగల్స్‌ను అందుకోవడానికి యాంటెన్నాను ఎలా నిర్మించాలో చూపించాడు. ఇప్పుడు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌కు సుమారు ఎనిమిది లక్షల మంది వీక్షకులు ఉన్నారు. ఓ ఇన్ఫ్లుయన్సర్గా టిక్‌టాక్‌లో ఉనికిని చాటుకోవాలంటే అతను మరింత సృజనాత్మకతను జోడించాల్సి ఉంటుంది. అయితే అమెరికా ఆంక్షల కారణంగా ఆ యాప్ వాడకంపై నియంత్రణలు అమలులో ఉన్నాయి.
అరకొర సౌకర్యాలతో జీవితాలను ఎలా నెట్టుకురావాలో క్యూబన్లకు అనేక దశాబ్దాలుగా తెలుసు. అమెరికా దిగ్బంధనం, దాని ఫలితంగా వెనిజులా, మెక్సికోల నుంచి ఇంధన దిగుమతులు నిలిచిపోవడంతో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. అయినప్పటికీ మారెరో లాంటి అనేక మంది వ్యక్తులు ఈ ద్వీపంలో సృజనాత్మకతకు కానీ, దృఢత్వానికి కానీ కొదువ లేదని నిరూపిస్తున్నారు. అమెరికా ఒత్తిడుల ప్రభావం పర్యాటకులపై కూడా పడుతోంది. ఫలితంగా దేశంలోని అనేక హోటళ్లు ఖాళీగా కన్పిస్తున్నాయి. సందర్శకుల కోసం ఎదురు చూస్తున్నాయి. పర్యాటకుల సంఖ్య బాగా పడిపోవడంతో వారిపై ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్న కళాకారుల బతుకులు దుర్భరంగా మారాయి. గత సంవత్సరం జనవరి-జూలై నెలలతో పోలిస్తే ఈ ఏడాది పర్యాటకుల సంఖ్య 62 శాతం తగ్గిపోయింది. పర్యాటకుల కోసం ఎదురు చూస్తున్న గైడ్లకు కూడా పనిలేకుండా పోయింది. ఒకరో ఇద్దరో వస్తే అదే మహద్భాగ్యం అనుకుంటూ వారి కోసం బగ్గుల మీద వంట చేస్తారు. కాఫీ గింజలను చేతితో పొడి చేస్తారు. మారెరో స్ఫూర్తితో రీఛార్జ్ చేసుకునే ఫ్యానును వారికి అందజేస్తారు. కరెంటు పోయినప్పుడు సోలార్ ప్యానల్స్ నుంచి వచ్చే శక్తిని వినియోగించుకుంటారు. పాల ఉత్పత్తుల తయారీ కోసం సోలార్ ప్యానల్స్, బ్యాటరీల వాడకం కూడా ఎక్కువగానే జరుగుతోంది.
సృజనాత్మకతతో విద్యుదుత్పత్తి !
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



