Tuesday, September 8, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంజర్మనీ ఎన్నికలలో అతివాద ఏఎఫ్‌డీ విజయం

జర్మనీ ఎన్నికలలో అతివాద ఏఎఫ్‌డీ విజయం

- Advertisement -

బెర్లిన్‌ : జర్మనీలోని తూర్పు ప్రాంతమైన సాక్సనీ-అన్హాల్ట్‌లో అతివాద ఆల్టర్నేటివ్‌ ఫర్‌ జర్మనీ (ఏఎఫ్‌డీ) చారిత్రక విజయాన్ని సాధించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీలోని ఓ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి అతివాద పార్టీ చేరువ కావడం ఇదే మొదటిసారి. ప్రాథమిక ఫలితాల ప్రకారం ఏఎఫ్‌డీ 44 శాతం ఓట్లు సంపాదించడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు ఆనందంతో కేరింతలు కొట్టారు. ఈ విజయంతో ఏఎఫ్‌డీ పార్టీకి పార్లమెంటులోని 83 స్థానాలలో 39 సీట్లు లభించాయి. పూర్తి మెజారిటీ సాధించడానికి అవసరమైన 52 స్థానాల కంటే ఇది కొంచెం తక్కువ. అధికారాన్ని కైవసం చేసుకోవాలంటే ఆ పార్టీ ఇతర పక్షాలతో పొత్తు పెట్టుకొని సంకీర్ణ ప్రభుత్వంలో పనిచేయాల్సి ఉంటుంది. పార్లమెంటులో ప్రవేశించడానికి అవసరమైన ఐదు శాతం ఓట్ల పరిమితిని దాటిన బీఎస్‌డబ్ల్యూ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే బీఎస్‌డబ్ల్యూతో చేతులు కలిపే ఆలోచన లేదని ఏఎఫ్‌డీ చెబుతోంది. ‘ఇది ఓ చారిత్రక క్షణం. ప్రజలు రాజకీయ మార్పును కోరుకుంటున్నారని స్పష్టమవుతోంది’ అని ఏఎఫ్‌డీ నాయకుడు ఉల్రిచ్‌ సిగ్మండ్‌ చెప్పారు. రష్యా, అమెరికా దేశాలతో ‘వివేకవంతమైన దౌత్యం’ నెరపేందుకు ఈ విజయం తమకు అధికారాన్ని ఇస్తోందని తెలిపారు. జర్మనీ విజయం సాధించాలంటే ఈ రెండు దేశాలూ తమకు అవసరమేనని అన్నారు. జర్మనీ యేతరులను స్వదేశాలకు పంపాలన్న నినాదంతో ఏఎఫ్‌డీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది. ఈ పార్టీ రష్యాను బహిరంగంగానే సమర్ధిస్తోంది. పాఠశాలలు, సాంస్కృతిక సంస్థలను మరింత సంప్రదాయ విలువల వైపు నడపడానికి, వలసలను అరికట్టడానికి, ప్రభుత్వ ప్రసార రంగంలో సమూల మార్పులు తీసుకురావడానికి ఆ పార్టీ వద్ద ప్రణాళికలు ఉన్నాయి. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఆయన ప్రభుత్వం చాలా కాలంగా ఏఎఫ్‌డీ పార్టీకి మద్దతు ఇస్తున్నాయి. ట్రంప్‌ తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్‌ సోషల్‌లో ఎగ్జిట్‌పోల్స్‌ ఫొటోను పెట్టారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు అత్యంత సన్నిహితుడైన కిరిల్‌ డిమిత్రియేవ్‌ తన ఎక్స్‌ ఖాతాలో ట్రంప్‌ పోస్టును రీపోస్ట్‌ చేశారు. ‘ఏఎఫ్‌డీది చారిత్రక విజయం.అపఖ్యాతి పాలైన జర్మన్‌ పాలక కూటమి యొక్క అహంకారం, సంకుచితత్వం, యుద్ధోన్మాదం, అసమర్ధత, కపటత్వానికి ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పారు’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా ఏఎఫ్‌డీ మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా లేక సంకీర్ణంతో ముందుకు సాగుతుందా అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా ఉంది. ఏఎఫ్‌డీతో జట్టు కట్టేందుకు అన్ని ప్రధాన పార్టీలు ససేమిరా అంటున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -