విద్య విషయంలో తెలంగాణ సర్కార్ మాటలు కోటలు దాటేలా ఉన్నాయి, చేతలు మాత్రం గడప దాటడం లేదు. అసెంబ్లీ సమావేశాలకు ముందు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఆర్భాటంగా ప్రకటించిన తెలంగాణా విద్యా ప్రణాళిక అమలుపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. తెలంగాణా విద్యా ప్రణాళిక ద్వారా మార్పులు, సంస్కరణల గురించి గత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సైతం చాలా గొప్పగా చెప్పారు. పాఠశాల పునర్ ప్రారంభం కావస్తున్నా దాని ఊసే ప్రభుత్వం ఎత్తడం లేదు.పైగా ప్రణాళిక రూపొందించిన కీలక వ్యక్తి తెలంగాణా విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి నాలుగు నెలల కాలవ్యవధి ఉండగానే రాజీనామా చేశారు. పురిట్లోనే సంది కొట్టినట్లు విద్యా ప్రణాళికలో విద్యకు బడ్జెట్లో 18శాతం నిధులు కేటాయిం చాలని సిఫార్సు చేయగా కనాకష్టంగా 8.2శాతం మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారు. ఇటీవల ప్రకటించిన విద్యా వారోత్సవాల్లో తెలంగాణా విద్యా ప్రణాళిక అంశం లేకపోవడం నిజంగా విచారకరం. ఎంతో ఆశతో ఎదురు చూసిన క్యాబినేట్ సమావేశంలోనూ కేవలం ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, పాఠశాల విద్యార్థులకు ఉదయం పాలు అందజేయాలనే నిర్ణయంతో సరిపెట్టారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రాగానే ప్రభుత్వ విద్య సంస్కరణ గురించి మాట్లాడడమే కాదు, ఏకంగా విద్యా కమిషన్ నియామకం చేయడం, ఆ కమిషన్ 355పేజీల నివేదిక అందజేయడం తెలిసిందే. పైలెట్ ప్రాజెక్టుగా రంగారెడ్డి జిల్లా ఆరుట్ల మండలాన్ని తీసుకొని కమిషన్ ఆచరణాత్మకంగా కూడా విజయవంతం చేసింది. 2025-26 బడ్జెట్కు ముందు గతేడాది ఇచ్చిన ప్రణాళిక కుదించి 56పేజీల విద్యా ప్రణాళిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కమిషన్ అందజేయడం, మండలానికి రెండు తెలంగాణా పబ్లిక్ స్కూల్స్ మాత్రమే సూచించడం, యేటా 400 మండలాల చొప్పున 2029-30 నాటికి మొత్తం తెలంగాణా విద్యా సంస్కరణకు 35,700 కోట్లు ఖర్చును కూడా ఈ ప్రణాళికలో పొందుపరిచింది. కానీ ప్రణాళిక అసెంబ్లీలో ప్రవేశపెట్టే సమ యానికి ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా వంద పాఠశాలలను మాత్రమే తెలంగాణా పబ్లిక్ స్కూల్స్ ప్రారంభిస్తామని చెప్పిన పాలకులు చెప్పినా, నిర్దిష్టంగా బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. విద్యా ప్రణాళికలో 5నుండి14సంవత్సరాల వయస్సు వరకు ఉన్న కేంద్ర విద్యాహక్కు చట్టాన్ని 3నుండి18ఏళ్లకు విస్తరిస్తామని చెప్పారు.‘‘కన్నతల్లికి కూడుపెట్టనోడు పినతల్లికి బంగారు కడియం కొనిస్తానన్న’’ విధంగా ఉంది పరిస్థితి.
విద్యా ప్రణాళికలో ప్రభుత్వ బడుల సంస్కరణలతో పాటు , ప్రయివేటు విద్యా వ్యవస్థ కనీసం నియంత్రణ తెలంగాణా విద్యా ప్రణాళికలో సూచించింది. జీ, టోఫెల్ లాంటి శిక్షణలు పాఠశాల స్థాయిలో ప్రయివేటు విద్యావ్యవస్థ అమలు జరపడాన్ని నిర్ద్వందంగా తోసిపుచ్చింది. అంతేకాదు, ప్రయివేటు పాఠశాల వనరులను బట్టి ఫీజులు ఉండాలని చెప్పింది.ఇవన్నీ ప్రస్తుత ప్రభుత్వం రేఖా మాత్రంగా నైనా పట్టించుకోలేదు. పైగా ఎంచక్కగా ఆయన ప్యూచర్ సిటీ లో అంతర్భాగంగా ప్రయివేటు, కార్పోరేట్ కళాశాలల,వ ేదపాఠశాల ప్రారంభానికి వెళ్లి వచ్చారు. ముఖ్యమంత్రి తనచర్య ద్వారా ప్రజలకు ఏం సంకేతాలిచ్చినట్లు? తాము ప్రయివేటుకు వెన్నుదన్నుగా నిలుస్తామనే కదా! అలాగే 2024 ఏప్రిల్‌లోనే 58 ‘‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్”కు శంకుస్థాపన చేశారు. గతేడాది 15,500 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ముఖ్యమంత్రే స్వయంగా ప్రకటించారు. కానీ, ఇవి ఎప్పటికి అందుబాటులోకి వస్తాయో ఇంకా ప్రభుత్వం నిర్దిష్టంగా ప్రకటించ లేదు. నిజంగా తెలంగాణా విద్యా ప్రణాళిక అమలుపరిస్తే పేద, మధ్యతరగతి వర్గాలకు నాణ్యమైన, ఉచిత విద్య ప్రభుత్వ పాఠశాల్లోనే అందు బాటులోకి వచ్చి ఉండేది. అలాంటి సూచనలేమీ ఇప్పుడు కనపడడం లేదు.
తెలంగాణాలో గత రెండేళ్లుగా నాలుగువేల ప్రభుత్వ బడులు మూతపడ్డాయి. 2023-24యుడైస్ గణాంకాలలో 30,022 ప్రభుత్వబడులు ఉంటే, ప్రస్తుతం వాటిసంఖ్య 26వేలే ఉంది. ఇక 24లక్షలు ఉన్న ప్రభుత్వ బడుల నమోదు పందొమ్మిది లక్షలకు పడిపోయింది. ఉన్న ప్రభుత్వ బడుల్లో కూడా మూడింట రెండు వంతుల పాఠశాలలు యాభై మంది విద్యార్థుల నమోదు కూడా లేదు. ప్రభుత్వ బడుల్లో ఒకలక్షా ఐదువేల మంది ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ వారి పంపిణీ సరిగా లేక బోధనావృధా కనపడుతోంది. పిల్లలకు నాణ్యమైన, భవిష్యత్తు ప్రయోజనం దాగిన సరైన విద్యాభరోసా ఇవ్వకుండా బడిబాటలు, విద్యా వారోత్స వాలు ఎన్నిజరిపినా తల్లిదండ్రుల విశ్వాసం పొందలేరు? ప్రయివేటు బడుల నియంత్రణ, ప్రభుత్వ బడుల్లో సంస్కరణ లేకుండా విద్యా వ్యవస్థ బాగుపడే అవకాశం లేదు. మళ్లీ ఎప్పటి సమస్యలతోటే నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అవుతంది తప్ప పెద్ద మార్పేమీ ఉండదు. ప్రజలను భ్రమల్లో ఎంతోకాలం ఏ పాలకులు ఉంచలేరు. తెలంగాణా విద్యా ప్రణాళిక మాటల్లో కాకుండా చిత్తశుద్ధి తో, ఆచరణాత్మకంగా అమలు జరపాలి. కోట్లాది రూపాయలు ఖర్చుచేసి రూపొందించిన విద్యా కమిషన్ సిఫార్సులు, తెలంగాణా అసెంబ్లీ ఆమోదం పొందిన “తెలంగాణా విద్యా ప్రణాళిక” నూటికి నూరు శాతం అమలు చేయాలి. అప్పుడు మాత్రమే విద్యావ్యవస్థ బాగుపడుతుంది.
ఏదీ తెలంగాణా విద్యా ప్రణాళిక?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



