ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన జార్ఖండ్‌ మాజీ సీఎం భార్య

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం పార్టీ అధ్యక్షుడు హేమంత్‌ సోరెన్‌ సతీమణి కల్పనా సోరెన్‌ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. జార్ఖండ్‌ స్పీకర్‌ ఆమె చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికలతోపాటు జార్ఖండ్‌లోని గంధే అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కల్పనా సోరెన్‌ విజయం సాధించారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఆమె ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు తమకు చాలా తక్కువ సమయం ఉందని అన్నారు. జార్ఖండ్‌ ప్రజలు తమపై అమితమైన ప్రేమాభిమానాలు చూపిస్తున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల కోసం మహాకూటమి పార్టీలోని ప్రతి కార్యకర్త తమవంతు బాధ్యత నిర్వహిస్తారని చెప్పారు. కల్పనా సోరెన్‌ ప్రమాణస్వీకార కార్యక్రమం జార్ఖండ్‌ సీఎం చంపాయ్‌ సోరెన్‌ సమక్షంలో జరిగింది. ఓ అవినీతి కేసులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ను ఈడీ అరెస్ట్‌ చేసింది. దాంతో చంపాయ్‌ సోరెన్‌ జార్ఖండ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు కల్పనా సోరెన్‌ను జేఎంఎం స్టార్ క్యాంపెయినర్‌గా కల్పనా సోరెన్‌ను సిద్ధం చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం విజయం సాధిస్తే కల్పనా సోరెన్‌ను ముఖ్యమంత్రిని చేసే దిశగా ఆ పార్టీ పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తున్నది. కాగా ఇవాళ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం కల్పనా సోరెన్‌ తన పక్కనే ఉన్న సీఎం చంపాయ్‌ సోరెన్‌ కాళ్లకు నమస్కరించారు. పెద్దలపట్ల తనకు ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు.

Spread the love