సీజేపీ, వాంగ్‌చుక్‌కు నటుడు ప్రకాశ్‌రాజ్ మద్దతు
సీపీఐ(ఎం) నేతలు జితేంద్ర చౌదరి, థామస్ ఐజాక్ సంఘీభావం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
నీట్ ప్రశ్నాపత్రం లీక్, సీబీఎస్‌ఈలో అవకతవకలతో పాటు విద్యా రంగ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తోన్న సీజేపీకి, నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్న పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ కు నటుడు ప్రకాష్ రాజ్ మద్దతు తెలిపారు. సీపీఐ(ఎం) నేతలు జితేంద్ర చౌదరి, శాఖ మాజీ మంత్రి టీఎం థామస్ ఐజాక్ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళన వద్దకు చేరుకున్నారు. విద్యార్థులు, యువత చేపట్టే ఈ ఆందోళనకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. అలాగే నిరాహార దీక్ష చేస్తోన్న పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను కలిసి తమ సంఘీభావాన్ని తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే దీక్షలో పాల్గొన్న విద్యార్థి సంఘ నేతలకూ తమ సంఘీభావాన్ని తెలిపారు.
అనంతరం సీపీఐ(ఎం) నేత జితేంద్ర చౌదరి మాట్లాడుతూ దేశంలోని విద్యావ్యవస్థలో పారదర్శకత తీసుకురావాలని ఆందోళన చేస్తున్న సీజేపీకి, సోనమ్ వాంగ్‌చుక్ కు సంఘీభావంగా నిలుస్తున్నట్టు తెలిపారు. విద్యార్థుల్లో , వారి తల్లిదండ్రుల్లో అసంతృప్తికి ఈ ఆందోళనే నిదర్శనమని థామస్ ఐజాక్ అన్నారు. ఈ నెల 20న జరిగే సీజేపీ నిర్వహించే పార్లమెంట్ మార్చ్‌లో పాల్గొననున్నట్టు ప్రకాశ్ రాజ్ ప్రకటించారు. అదేవిధంగా జంతర్‌మంతర్‌లోని ఎస్‌ఎఫ్‌ఐ క్రాంతి కార్నర్‌నూ నాయకులు సందర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు నరేష్ జమాథియా, కృష్ణ రక్షిత్, డీవైఎఫ్‌ఐ అఖిల భారత ప్రధాన కార్యదర్శి హిమగ్నరాజ్ భట్టాచార్య, ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షుడు ఆదర్శ్ ఎం సాజీ, ఉపాధ్యక్షుడు సుభాష్ జాఖద్, ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి ఐషీ ఘోష్, అధ్యక్షుడు సూరజ్ ఇలామాన్ పాల్గొన్నారు.
నేను గాంధీని కాదు, హీరోని కాదు..
సాధారణ పౌరుడినే : సోనమ్ వాంగ్‌చుక్
‘నేను గాంధీని కాదు, హీరోని కాదు నా బాధ్యతలను నెరవేర్చడానికి ప్రయత్నించిన ఓ సాధారణ పౌరుడిని మాత్రమే’ అని పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ అన్నారు. సోషల్ మీడియాలో తన ఉద్యమానికి మద్దతు ఇస్తున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగాట ఆయన మాట్లాడుతూ “చాలా మంది నన్ను 21వ శతాబ్దపు గాంధీ లేదా ఆధునిక గాంధీ అని పిలుస్తున్నారు. మరికొందరు హీరో అని పిలుస్తున్నారు. ఈ వ్యాఖ్యలు నాకు అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి. నేను ఒక సాధారణ పౌరుడిని మాత్రమే” అని అన్నారు. “దయచేసి ఇతరులలో హీరో కోసం వెతకకండి. మీ జీవితానికి మీరే హీరో అవ్వండి. పౌరులుగా మీ బాధ్యతలను నెరవేర్చండి” అని చెప్పారు.
పార్లమెంట్ మార్చ్ లో పాల్గొంటా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


