సంస్కారం వేణు గీతికకు పేమ్రతో

నాన్న కిందటి ఉత్తరంలో సంస్కారం గురించి చెప్పాను. అయితే ఈ సంస్కారం గురించి ఇంకొంచం విపులంగా చెప్పాలనిపించింది. ఎందుకంటే మనిషి నడవడికలో అతి పెద్ద పాత్ర సంస్కారానిదే. ఏ విషయాన్నైనా మంచిగా ఆలోచించడాన్ని సంస్కారం అంటారు. ఈ సంస్కార వంతులు ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా వారు నమ్ముకున్న సిద్ధాంతాలను వదులుకోరు. నేను కొన్నేండ్ల కిందట విజేతలు అని వికలాంగుల మీద పుస్తకం రాశాను. వారి గురించి ఇంకొకరి దగ్గర వాకబు చేస్తుంటే చాలా ఎగతాళిగా, అపహాస్యంగా మాట్లాడేవారు. ‘వాళ్లేం పాపం చేశారో, తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకు తగలక పోతాయా’ అనేవారు. నాకు చాలా బాధనిపించేది. ఎందుకంటే చదువుకున్న వాళ్లు కూడా అలా వారిని అవహేళన చేయడం సంస్కారం కాదు.
నేను కిందటి ఉత్తరంలో ఒక 75 ఏండ్ల వ్యక్తి ప్రవర్తన గురించి చెప్పాను. అతను వెనకా ముందూ ఆలోచించకుండా నోరు పారేసుకు న్నాడు. కార్యక్రమం జరుగుతున్నప్పుడు వేదిక మీదకు వెళ్లి ఫొటోలు దిగడం, వారిని పలకరించడం తప్పు. ఆ పని నేను చేయలేదు, చేయను కూడా. ఇటువంటి వాళ్ళు ఎదురైనప్పుడు వాళ్ల ప్రవర్తన ఎలాంటిదో ప్రత్యక్షంగా చూసాము కనుక, వారి పద్ధతికి, సంస్కారానికి ఒక నమస్కారం అని, వయసులో పెద్దవారు కనుక పలకరించి రావడమే.
ఈ మధ్య రవీంద్ర భారతిలో ఆ పెద్ద మనిషి కనిపిస్తే, నమస్కారం చేసి, ఉగాది పురస్కారం అందుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేసాను. ఇది సంస్కారమంటే. ఎవరు ఎలాంటి వారైనా వారిని గౌరవించి, మర్యాద చేయమనే సంస్కారాన్ని మన కుంటుంబాలోని పెద్దలు నేర్పారు. మనకు కష్టం కలిగినప్పుడు ఎవరైనా సాయం చేస్తే కృతజ్ఞతతో ఉండాలి, అది సంస్కారం. అలాగే క్షమా గుణం చాలా గొప్పది నాన్న. దాన్ని అలవర్చు కోవాలి. సంస్కార హీనులకు అది ఎలాగూ అలవడదు. కనీసం మనమన్నా సంస్కారవంతుగా ఉందాం.

ప్రేమతో అమ్మ
హొ- పాలపర్తి సంధ్యారాణి 

Spread the love