ఇసుక త్రవ్వకాలను అడ్డుకున్న మహిళలు..

– నిత్యం 200 లారీల ఇసుక తరలింపు..
– అడుగంటిన భూగర్భ జలాలు
– ఇసుక గుంతల్లో  యువకులు పడి  మృతి
నవతెలంగాణ – నసురుల్లాబాద్
మంజీర నదిలో పలువురు అక్రమార్కులు ఇష్టారాజ్యంగా ఇసుకను తోడేస్తున్నారు. అనుమతులకు మించి భారీగా ఇసుక తవ్వకాలను చేపడుతుండడంతో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. ప్రతి సంవత్సరం వరదలు వచ్చినా ఇసుక తరలింపు భారీగా జరుగుతుండడంతో జలమట్టాలు తగ్గిపోతుండడం వల్ల పరివాహక ప్రాంతంలో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి.. ఇసుక కోసం తప్పిన గుంతల్లో యువకులు ప్రతి సంవత్సరం మృత్యువాతపడడంతో ఆగ్రహించిన మహిళలు నేడు అక్రమ ఇసుకను అరికట్టాలంటూ ఆందోళన చేపట్టారు.  ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా 15 నుంచి 20 మీటర్ల లోతు లో నుంచి మంజీరా నదిలో ఇసుక త్రవ్వకాలు జరపడం.. దీనికి తోడు ప్రభుత్వ అనుమతి లేకుండా 200 లారీల పైగా ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమ ఇసుక దందా కొనసాగుతుంది అంటూ పెద్ద ఎత్తున మహిళలు బీర్కూర్ మంజీరా నదిలో కొనసాగుతున్న ఇసుక క్వారీ వద్దకు వచ్చి ఇసుక త్రవ్వకాలను నిలిపివేశారు. రెండు రోజుల క్రితం ఇదే పని చేసినప్పటికీ మళ్లీ రాజకీయ నాయకుల, పోలీసుల అండ, గ్రామంలోని కొంతమంది పైరవీ కారుల అండదండలతో మళ్ళీ ఇసుక తవ్వకాలు జరపడంతో సోమవారం పెద్ద ఎత్తున మహిళలు ఇసుక క్వారీ వద్దకు వచ్చి ఇసుక త్రవ్వకాలను నిలిపివేశారు. జిల్లా కలెక్టర్ ఇచ్చిన నిబంధనల ప్రకారం మూడు మీటర్ల లోతులో ఇసుక తవ్వకాలు జరపాల్సి ఉండగా 15 నుంచి 20 మీటర్ల లోతుతో నీటిలో నుంచి ఇసుకను బయటకు తీస్తున్నారంటూ మహిళలు ఆరోపించారు. భారీ ఎత్తున ఇసుక త్రవ్వకాలు జరగడంతో తమకు చెందిన వ్యవసాయ బోర్లు ఎత్తి వేస్తున్న అంటూ మహిళలు ఆరోపించారు. తమని వేధించడానికి కొంతమంది పోలీసులు, గ్రామ  రాజకీయ నాయకులు తమకు బెదిరిస్తున్నారంటూ మహిళలు ఆరోపిస్తున్నారు.
అధికార పార్టీ అండదండలతో కొందరు రాజకీయ నాయకులు రోజుకు 20 నుంచి 30  లారీలకు కంటే ఎక్కువగా లారీలు జీరోలో  తీసుకెళ్తున్నారంటూ మహిళలు ఆరోపించారు. క్వారీల వద్ద స్థానిక  రాజకీయ నాయకులు అడ్డవేసి క్వారీ నిర్వాహకుల నుంచి అక్రమంగా జీరోలో ఇసుకను తరలి వేస్తున్నారంటూ జీరో లో వెళ్లే వాహనాలను అడ్డుకోలంటూ అధికారులు వారు సూచిస్తున్నారు. ఇసుక క్వారీల వద్ద సీసీ కెమెరాలు, వే బ్రిడ్జిలు, జిపిఎస్ విధానం తీసుకురావాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు మంజీరా నదిలో మహిళలు నిలబడి నిరసన దీక్ష చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే బీర్కూరు మంజీరా వారి నుండి ఇసుక తరలించడం జరుగుతుందని అలాగే జీరోలో ఇసుకను తరలించడం లేదంటూ మంజీరా నది పరివాహక ప్రాంతం ప్రజల అభివృద్ధి పనుల కోసం ఇసుకను తరలించడం జరుగుతుందని క్వారీ నిర్వాహకులు తెలిపారు.

Spread the love