ట్రాన్స్పోర్ట్ కార్మికుల పైన విపరీతమైన జరిమానాలతో పాటు శిక్షలను వేసే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ట్రాన్స్పోర్ట్ కార్మికులను ఆదుకోవటానికి నిధులను కేటాయించకుండా ఉపాధిని దెబ్బతీయటం సరైంది కాదని ఆటో డ్రైవర్ల జిల్లా అధ్యక్షులు కటారి రాములు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం నగరంలో సిఐటియు ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇన్సూరెన్స్, లైసెన్సులను,ఫిట్నెస్ ప్రభుత్వమే భరించాలని, భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చినట్లుగా ట్రాన్స్పోర్ట్ కార్మికులకు కూడా కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్సును ఏర్పాటు చేయటంతో ఆటో కార్మికుల ఉపాధి దెబ్బతిన్నదని ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆటో డ్రైవర్ల అందరికీ సంవత్సరానికి రూ.12,000 భృతి అందజేస్తామని చెప్పిన దానికి బడ్జెట్లో నిధులు కేటాయించలేదని వెంటనే డ్రైవర్లకు ఇచ్చిన హామీని అమలు జరపాలన్నారు. తమ సమస్యలను పరిష్కరించని ఎడల ఆందోళన ఉదృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్మికుల ఉపాధి దెబ్బతిని ఆదాయం తగ్గింది అని అందువల్ల ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్ల నగర అధ్యక్షులు కృష్ణ, నాయకులు ముజీబ్, మజా రహమద్, అబ్దుల్., ప్రభాకర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.