
నవతెలంగాణ -తాడ్వాయి
ప్రపంచ మృతిక దినోత్సవ సందర్భంగా గురువారం మండలంలోని తాడ్వాయి, నార్లాపూర్, నర్సాపూర్ (పిఏ) గ్రామాల్లోని మూడు రైతు వేదికలలో రైతులకు భూసారం విలువైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి నల్లెల శ్రీధర్ మాట్లాడుతూ.. రైతులు ప్రతి రెండు నుంచి మూడు సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరిగా భూమి యొక్క పరీక్ష చేయించుకోవాలన్నారు. ఈ పరీక్ష ద్వారా భూమిలో మొక్కకు మూలకాలు ఎంత మేరకు అందుబాటులో ఉన్నాయో, తెలుసుకోవడంతో పాటు, ఏ రకమైన ఎరువులను ఎంత మోతాదులో వాడాలి అనేది కూడా రైతులకు అవగాహన రావడం జరుగుతుందన్నారు. భూమి మనకు ఇచ్చే అపారమైన వనరులలో నేల ముఖ్యమైనదని భవిష్యత్ తరాలకు సుస్థిరమైన, సారవంతమైన “నేల” ను అందించాలని కోరారు. నేల సంరక్షణ పాటించాలని, వరి కోసిన తరువాత వరి కొయ్యలను కాల్చకుండా, కలియ దున్ని, నీరు పెట్టడం ద్వారా కర్బన పదార్థాన్ని పెంచుకోవచ్చని అన్నారు. పంట మార్పిడి ద్వారా నేలను సంరక్షిచుకోవచ్చని, జీలుగా, పిల్లి పెసర, జనుము వంటి పచ్చి రొట్ట పంటలను సాగు చేసి కలియ దున్నడం ద్వారా నేల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అన్నారు. రైతులందరూ వ్యవసాయ శాఖ అందిస్తున్న సలహాలు సూచనలు పాటించి తక్కువ పెట్టుబడుతూ ఎక్కువ దిగుబడును పొందాలని అన్నారు. ఈ మట్టి పరీక్షలను క్రమం తప్పకుండా రైతులు చేయించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏఈఓలు దుర్గాప్రసాద్,రాజ్కుమార్,జీవన్ రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.