రాజీనామాకు రిపబ్లికన్ల డిమాండ్
ఇరాన్ యుద్ధమే కొంప ముంచిందంటూ ఆక్రోశం
వాషింగ్టన్ : ఇరాన్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ మధ్యంతర ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సేథ్‌పై సొంత పార్టీ నుంచే ఒత్తిడి పెరుగుతోంది. పదవికి రాజీనామా చేయాలని హెగ్‌సేథ్‌ను రిపబ్లికన్ పార్టీ సభ్యుడు థామస్ మస్సీ డిమాండ్ చేశారు. హెగ్‌సేథ్ కనుక రాజీనామా చేస్తే అభిశంసన ప్రయత్నం చేయబోనని ఆయన చెప్పారు. అమెరికా రాజకీయాల్లో వివాదాస్పద వ్యక్తిగా పేరు తెచ్చుకున్న హెగ్‌సేథ్ ఇప్పుడు తన సొంత పార్టీలోనే ప్రత్యర్థులను ఎదుర్కోవాల్సి వస్తోంది. మరోవైపు ఇరాన్ యుద్ధాన్ని హెగ్‌సేథ్ నిర్వహించిన తీరుపై విచారణ జరుపుతామని డెమొక్రాట్లు హామీ ఇచ్చారు.
బుష్ చర్యను గుర్తు చేస్తున్న రిపబ్లికన్లు
ఇరాన్‌పై యుద్ధం చేయాలని ప్రతిపాదించిన హెగ్‌సేథ్‌పై మస్సీ సెప్టెంబరులోనే అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ ఆమోదం లేకుండా ఇరాన్‌పై దాడులు ప్రారంభించడం ద్వారా హెగ్‌సేథ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. అయితే హెగ్‌సేథ్ కనుక ఇప్పుడు రాజీనామా చేస్తే అభిశంసన ప్రయత్నాన్ని ఆపేస్తానని బుధవారం చెప్పారు. ఒకవేళ రాజీనామాకు హెగ్‌సేథ్ ససేమిరా అంటే అభిశంసన తీర్మానంపై ఓటింగ్ జరుగుతుంది. కాంగ్రెస్‌పై డెమొక్రాట్లు పట్టు సాధించిన నేపథ్యంలో తీర్మానం ఆమోదం పొందడం కష్టమేమీ కాదు. 2006లో ఎన్నికలు జరిగినప్పుడు...ఇరాక్ యుద్ధంపై ప్రజల వ్యతిరేకత కారణంగా కాంగ్రెస్‌పై డెమొక్రాట్లు నియంత్రణ సాధించారు. అప్పుడు అధ్యక్షుడుగా ఉన్న జార్జ్ డబ్ల్యూ బుష్ వెంటనే నాటి రక్షణ మంత్రి డొనాల్డ్ రమ్స్‌ఫెల్డ్‌ను పదవి నుంచి తొలగించారు. హెగ్‌సేథ్‌ను కూడా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలాగే సాగనంపాలని పలువురు రిపబ్లికన్లు అభిప్రాయపడ్డారు.
రాజీనామా చేయరు : రక్షణ శాఖ
ఇరాన్ యుద్ధం కారణంగానే రిపబ్లికన్లు ప్రజల మద్దతు కోల్పోయారని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అంగీకరించారు. అయితే ట్రంప్ మాత్రం హెగ్‌సేథ్‌ను వెనకేసుకొచ్చారు. ట్రంప్ పదవీకాలం ముగిసే వరకూ పెంటగాన్‌కు నాయకత్వం వహించేందుకు హెగ్‌సేథ్ కట్టుబడి ఉన్నారని రక్షణ శాఖ తెలిపింది. కాగా హెగ్‌సేథ్‌కు తగిన గుణపాఠం తప్పదని రిపబ్లికన్ పెనెటర్ థామ్ టిల్లిస్ వ్యాఖ్యానించారు. చట్టసభ సభ్యులతో హెగ్‌సేథ్‌కు సత్సంబంధాలు లేవని, అందుకే ఒకటిన్నర ట్రిలియన్ డాలర్ల రక్షణ వ్యయ ప్యాకేజీకి కాంగ్రెస్ ఆమోదం పొందడానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ముందుకు సాగడం లేదని ఆయన చెప్పారు. వచ్చే వారం కాంగ్రెస్ సమావేశమైనప్పుడు హెగ్‌సేథ్ అభిశంసన కోసం ప్రత్యేక తీర్మానంపై ఓటింగ్ జరుగుతుందని డెమొక్రటిక్ సభ్యుడు పాట్రిక్ ర్యాన్ తెలిపారు. ఇదిలావుండగా ట్రంప్ పాలనపై దర్యాప్తు జరపాలని నిర్ణయించిన నేపథ్యంలో సెనెట్ డెమొక్రాట్లు పత్రాల పరిరక్షణ కోసం లేఖలు జారీ చేశారు.







కామెంట్‌లు (0)