Magazines

ఈజిప్టులో ఘోర అగ్నిప్రమాదం

2 గంటల క్రితం

Egypt
avatar
balaji

ప్రచురించబడింది నవం 27, 2026 | 2 నిమిషాల చదవడం

చమురు ట్యాంకర్‌ పేలి 31 మంది మృతి

కైరో: ఈజిప్టులో ఘోరఅగ్ని ప్రమాదం సంభవించింది. హైటెన్షన్ వైర్లు తెగి చమురు ట్యాంకర్ పై పడ్డాయి. ఈ ప్రమాదంలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 21 మంది తీవ్రంగా గాయపడినట్టు ఈజిప్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేసింది. ఈ ప్రమాదం ధాటికి 30కిపైగా కార్లు, ద్విచక్రవాహనాలు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం, కైరోలోని గిజా గవర్నరేట్ ఇంబబాలోని వరాక్ జిల్లాలో కీలకమైన రింగ్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. స్థానిక కాలమానం ప్రకారం, బుధవారం చమురు ట్యాంకర్ హైవేపై వెళ్తుండగా, హైటెన్షన్‌ విద్యుత్తు వైరు తెగి దాని ఎదుట పడింది. దీంతో ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడటంతో భారీ పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం వల్ల దాదాపు రెండు డజన్లకుపైగా కార్లు, బైక్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనలో 31 మంది మృతి చెందగా, 21 మంది గాయపడ్డారు.

మృతుల గుర్తింపునకు డీఎన్‌ఏ పరీక్షలు

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టాయి. చమురు ట్యాంకర్ కావడం వల్ల మంటలను ఆర్పేం దేకు ఎక్కువ సేపు శ్రమించాల్సి వచ్చింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో భారీగా మంటలు వ్యాపించడంతో వాహనాలు ఒకదానికొకటి చిక్కుకుపోయాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాలిపోయిన కార్ల నుంచి మృతదేహాలను బయటకు తీసినట్లు పేర్కొన్నారు. మృతుల గుర్తింపు కోసం డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఈజిప్టు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కార్యాలయం వెల్లడించింది.

39 అంబులెన్స్‌లతో సహాయక చర్యలు

ఈజిప్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ప్రమాదంలో గాయపడిన వారిని జాయెద్‌ స్పెషలైజ్డ్‌ ఆస్పత్రి, ఇంబాబా జనరల్‌ ఆస్పత్రి, వారాక్‌ సెంట్రల్‌ ఆస్పత్రులకు తరలించారు. మొత్తం 39 అంబులెన్స్‌లు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ఆరోగ్యశాఖ కేంద్ర అత్యవసర విభాగంలో అప్రమత్తత స్థాయిని పెంచినట్టు అధికారులు తెలిపారు. ఆరోగ్యశాఖ మంత్రి ఖలేద్‌ అబ్దెల్‌ ఘఫార్‌ పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆయన తన ఇద్దరు డిప్యూటీలు మహమ్మద్‌ ఎల్‌ తాయెబ్‌, అమర్‌ కందీల్‌లను ఘటనా స్థలానికి, బాధితులను తరలించిన ఆస్పత్రులకు వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫత్తా ఎల్‌ సిస్సీ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

ఈజిప్టులో రోడ్డు ప్రమాదాల ఆందోళన

ఈజిప్టులో రోడ్డు ప్రమాదాలు ఏటా వేలాది మంది ప్రాణాలను బలిగొంటున్నాయి. అతివేగం, అధ్వాన రహదారులు, ట్రాఫిక్‌ నిబంధనల అమలులో లోపాలు ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో బెనీ సూయెఫ్‌ ప్రావిన్స్‌ సమీపంలో జరిగిన భారీ వాహనాల గొలుసు ప్రమాదంలో 21 మంది మృతి చెందగా, మరో 16 మంది గాయపడ్డారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్