Magazines

మీడియా సంస్కరణలపై వెల్లువెత్తిన ప్రజాగ్రహం

42 నిమిషాల క్రితం

Public Outcry Over Media Reforms
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026 | 2 నిమిషాల చదవడం

చెక్‌ రిపబ్లిక్‌లో భారీ ప్రదర్శన
ప్రేగ్‌ : చెక్‌ రిపబ్లిక్‌ రాజధాని ప్రేగ్‌లో ఆదివారం ప్రధాని ఆండ్రెజ్‌ బాబిస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లక్షలాది మంది ప్రజలు భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వ మీడియా సంస్థలైన చెక్‌ టీవీ, చెక్‌ రేడియోలకు నిధుల విధానాన్ని మార్చాలని ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను వీరంతా వ్యతిరేకించారు. 1989 నాటి వెల్వెట్‌ విప్లవం తర్వాత దేశంలో ఇంత పెద్ద ఎత్తున ప్రజా ప్రదర్శన జరగడం ఇదే మొదటిసారి. ప్రభుత్వం తీసుకొచ్చిన మీడియా సంస్కరణల బిల్లుపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ప్రస్తుతం చెక్‌ ప్రజలు ప్రభుత్వ టీవీ, రేడియో కోసం నెలకు 205 క్రౌన్ల నిర్బంధ లైసెన్స్‌ ఫీజు చెల్లిస్తున్నారు. ఈ విధానాన్ని రద్దు చేసి, నేరుగా బడ్జెట్‌ నుంచే మీడియాకు నిధులు కేటాయించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే నిధుల కోసం ప్రభుత్వంపై ఆధారపడాల్సి వస్తే మీడియా సంస్థల సంపాదకీయ స్వేచ్ఛ దెబ్బతింటుందని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేశారు. పాలక పక్షం మీడియాను తన గుప్పిట్లో ఉంచుకునేందుకే ఈ సంస్కరణలను తీసుకొస్తోందని వారు మండిపడ్డారు. ప్రభుత్వ ప్రతిపాదనల కారణంగా పబ్లిక్‌ మీడియా బడ్జెట్‌ సుమారు పదిహేను శాతం తగ్గే అవకాశం ఉన్నదని, ఇది ఉద్యోగాల కోతకు, వార్తల నాణ్యత పడిపోవడానికి కారణమవుతుందని మీడియా నిపుణులు హెచ్చరించారు. కాగా 'మిలియన్‌ మూమెంట్స్‌ ఫర్‌ డెమొక్రసీ' అనే పౌర హక్కుల సంస్థ ప్రేగ్‌లోని చారిత్రక లెట్నా పార్కు వద్ద ఈ భారీ ర్యాలీని నిర్వహించింది. దీనికి మూడున్నర లక్షల నుంచి నాలుగున్నర లక్షల మంది హాజరయ్యారు. ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోకుండా గల నెల 24న తెల్లవారుజామున పార్లమెంటులో బిల్లు ముసాయిదాను ఆమోదించడమేమిటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ప్రతిపాదన కారణంగా ప్రజలపై ఫీజుల భారం ఉండదని, ప్రభుత్వ మీడియా వ్యయాన్ని నియంత్రించడమే తమ ఉద్దేశమని ప్రధాని బాబిస్‌ అంటున్నారు. నిధుల విధానం మారినంత మాత్రాన మీడియా స్వేచ్ఛకు ఎలాంటి భంగం కలగదని ప్రభుత్వం చెబుతోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్