జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్లను వ్యతిరేకించిన సెనెటర్లు
వాషింగ్టన్ : డెమొక్రాట్లు సెనెట్‌ను తమ నియంత్రణలోకి తీసుకునే లోపు వీలైనంత ఎక్కువ మంది న్యాయమూర్తులను నియమించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు కొంతమంది తోటి రిపబ్లికన్ సభ్యుల నుంచే ప్రతిఘటన ఎదురవుతోంది. ఇప్పటి వరకూ వివిధ కోర్టుల్లో ట్రంప్ నామినీలను జడ్జిలుగా నియమించేందుకు రిపబ్లికన్లు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. 57 జ్యుడీషియల్ నియామకాలను వారు ధృవీకరిం చారు. అయితే ఇప్పుడు కథ అడ్డం తిరిగింది. ట్రంప్ ఎంపిక చేసిన ముగ్గురు న్యాయమూర్తులపై సంబంధిత రాష్ట్రాల రిపబ్లికన్ సభ్యులు సందేహాలు వ్యక్తం చేశారు. సెనెట్ జ్యుడీషియల్ కమిటీలోని రిపబ్లికన్ సెనెటర్లు 'బ్లూ స్లిప్' ఇచ్చినప్పుడే జడ్జిల నియామకాలు ఖరారవుతాయి. సెనెటర్ల వ్యతిరేకత కారణంగా ట్రంప్ ప్రభుత్వం ఓ డిస్ట్రిక్ట్ జడ్జి నియామకాన్ని రద్దు చేసి వేరే న్యాయమూర్తిని నియమించాల్సి వచ్చింది. ట్రంప్ చర్యలు, నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న కొందరు రిపబ్లికన్ సెనెటర్లు ఆయన నియామకాలను అడ్డుకుంటున్నారు. 2017-2021 మధ్యకాలంలో ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడు అయినప్పుడు 234 జ్యుడీషియల్ నియామకాలు జరిపారు. వీరిలో ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా ఉన్నారు. ప్రస్తుతం అమెరికాలో పనిచేస్తున్న జడ్జిలలో మూడో వంతు మంది ట్రంప్ నియమించిన వారే.







కామెంట్‌లు (0)