ఒప్పందం జరిగి నెల దాటినా అమెరికా చేరని ట్యాంకర్లు
రూటు మారుస్తున్న చమురు నౌకలు
చట్టపరమైన చిక్కులు, కాంగ్రెస్ సభ్యుల ఆగ్రహమే కారణం
వాషింగ్టన్ : రష్యా నుంచి డీజిల్ దిగుమతులకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒప్పందం కుదుర్చుకొని నెల రోజులు దాటినప్పటికీ అది నేటికీ కార్యరూపం దాల్చడం లేదు. న్యాయపరమైన ఇబ్బందులు, కాంగ్రెస్ సభ్యుల హెచ్చరికల కారణంగా రష్యా చమురు అమెరికా మార్కెట్లకు చేరడం లేదు. రష్యాలోని చమురు లోడింగ్ ఓడరేవు నుంచి బయలుదేరిన డీజిల్ ట్యాంకర్లు అమెరికా రావడం లేదని మెరైన్ ట్రాఫిక్ షిప్ ట్రాకింగ్ డేటా చెబుతోంది. చట్టపరమైన ఇబ్బందులు, నష్ట భయాల ఆందోళన కారణంగా అమెరికా వ్యాపార సంస్థలు, ఓడరేవులు రష్యా చమురును స్వీకరించడానికి సుముఖంగా లేవని మార్కెట్ నిపుణులు స్పష్టం చేశారు.
కాంగ్రెస్ సభ్యులు, ఈయూ దేశాల హెచ్చరికలతో...
అమెరికా మార్కెట్‌కు, ప్రపంచ మార్కెట్లకు పది వేల బ్యారల్స్ చమురును సరఫరా చేయడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నానని ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై అమెరికా కాంగ్రెస్‌లోని అధికార ప్రతిపక్ష సభ్యులు, యూరోపియన్ యూనియన్‌లోని మిత్రదేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని కొనసాగిస్తున్న సమయంలో ఒప్పందాన్ని కుదుర్చుకోవడం మాస్కోకు మేలు చేస్తుందని మండిపడ్డాయి. రష్యా డీజిల్‌ను దిగుమతి చేసుకునే వారు అంతర్జాతీయ ఆంక్షలు, అమెరికా చట్టాలను ఉల్లంఘిం చినట్లే అవుతుందని హెచ్చరించాయి. హెచ్చరికలు, భయాందోళనల నేప థ్యంలో... రష్యా నుంచి డీజిల్‌తో బయలు దేరిన ఓ ట్యాంకర్ న్యూయార్క్ లేదా న్యూజెర్సీ ఓడరేవుకు ఈ నెల ఏడవ తేదీనే చేరుకోవాల్సి ఉన్నప్పటికీ అమెరికా తూర్పు తీరానికి అనేక వందల మైళ్ల దూరంలో నిలిచిపోయింది. సరుకును ఎక్కడ దించాలో ఇంకా ఖరారు కాలేదని ట్యాంకర్ ప్రతినిధి ఒకరు సీఎన్ఎన్ వార్తా సంస్థకు చెప్పారు. గత నెలలో రష్యాలోని ఓడరేవుల నుంచి బయలుదేరిన అనేక ఇతర చమురు ట్యాంకర్లు కూడా అమెరికా వైపు రాకుండా దారి మళుతున్నాయి. వీటిలో ఒకటి ఈజిప్ట్ ఓడరేవులో లంగరు వేయగా మరొకటి బ్రెజిల్ వెళుతోంది. ఈ రెండు నౌకలు ఈయూ, బ్రిటన్ ఆంక్షల పరిధిలో ఉండడం గమనార్హం.
చట్టం అమలులో ఉన్నప్పుడు ఆంక్షలు సడలిస్తారా ?
తాజా పరిణామాలపై అమెరికా అధికారి ఒకరు వ్యాఖ్యానిస్తూ 'ట్రంప్-పుతిన్ మధ్య కుదిరిన ఒప్పందం మేరకు రష్యా డీజిల్ సముద్ర మార్గంలో మార్కెట్‌కు వస్తోంది. దీనివల్ల అమెరికాలో ధరలు తగ్గుతాయి' అని చెప్పారు. అయితే ఆ డీజిల్ అమెరికాకు వస్తోందని ఆయన చెప్పలేదు. ప్రపంచ మార్కెట్‌కు డీజిల్ సరఫరా లను పెంచడానికి, తద్వారా అమెరికన్లకు, అలాగే ప్రపంచ దేశాల ప్రజలకు ధరల భారాన్ని తగ్గించడానికి ఈ ఒప్పందం కుదిరిందని, కచ్చితంగా అదే జరుగుతుందని ఆయన తెలిపారు. కాగా అమెరికాలోకి రష్యా డీజిల్‌ను దిగుమతి చేసుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని కాంగ్రెస్‌లోని ఉభయసభల సభ్యులు గత నెలలో సంబంధిత కంపెనీలు, సంస్థలు, పోర్ట్ అథారిటీల అధిపతులకు లేఖలు రాశారు. 2022 నాటి చట్టం ప్రకారం డీజిల్ సహా రష్యాకు చెందిన ఏ ఇంధన ఉత్పత్తినీ దిగుమతి చేసుకోకూడదు. డీజిల్ దిగుమతులపై అమలులో ఉన్న ఆంక్షలను ఆర్థిక శాఖ తొలగించడం చట్టవిరుద్ధ మేనని కాంగ్రెస్ సభ్యులు వాదించారు. ప్రభుత్వ చర్యపై కాంగ్రెస్ దర్యాప్తు కూడా జరపవచ్చునని వారు స్పష్టం చేశారు. దిగుమతులకు సహకరించే కంపెనీలపై కూడా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్టం అమలులో ఉన్నప్పుడు ఆంక్షలను తొలగిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇవ్వడంపై న్యాయపరమైన వివాదం తలెత్తే అవకాశాలు కన్పిస్తున్నాయి.







కామెంట్లు (0)