నవతెలంగాణ – హైదరాబాద్ : మలేషియాలోని తెలుగు ఎక్స్‌పాట్స్ అసోసియేషన్ ఆఫ్ మలేషియా (టీమ్) ఆధ్వర్యంలో 10వ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ‘షటిల్ స్మాష్ సీజన్–3’ ఘనంగా నిర్వహించారు. కౌలాలంపూర్‌లోని డబ్ల్యూపీ సెంతుల్ కోర్టులో రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీలకు విశేష స్పందన లభించింది. ఈ టోర్నమెంట్‌లో 200కు పైగా జట్లు, 215 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు.
మలేషియాలోని తెలుగు సమాజంలో క్రీడాస్ఫూర్తి, ఐక్యత, స్నేహభావాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ పోటీలను నిర్వహించారు. పిల్లలు, మహిళలు, మిక్స్‌డ్ డబుల్స్, పురుషుల డబుల్స్, వెటరన్స్ డబుల్స్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించారు. క్రీడాకారులతో పాటు వారి కుటుంబ సభ్యులు, ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫెడరేషన్ ఆఫ్ ఎన్నారై కమ్యూనిటీ అసోసియేషన్స్ కార్యనిర్వాహక అధ్యక్షుడు బూరెడ్డి మోహన్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి భాస్కర్‌రావు హాజరయ్యారు. వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ట్రోఫీలు అందజేసి అభినందించారు.
టీమ్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. టోర్నమెంట్‌ను విజయవంతం చేసిన నిర్వహణ కమిటీ సభ్యులు, స్పోర్ట్స్ కోఆర్డినేటర్లు, వాలంటీర్లు, స్పాన్సర్లు, క్రీడాకారులు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. క్రీడా కార్యక్రమాలతో పాటు మలేషియాలో నివసిస్తున్న తెలుగు ప్రజల మధ్య ఐక్యత, సాంస్కృతిక అనుబంధం, పరస్పర సహకారాన్ని పెంపొందించేందుకు అసోసియేషన్ నిరంతరం కృషి చేస్తోందన్నారు.
అనిల్‌కుమార్ మార్గదర్శకత్వంలో నిర్వహణ కమిటీ సభ్యులు సమన్వయంతో టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించారు. క్రీడా సమన్వయకర్తలు సుబాని, చందు కీలక పాత్ర పోషించారు. టీమ్ ఉపాధ్యక్షుడు లక్ష్మీకాంత్‌రావు, జనరల్ సెక్రటరీ ఇంద్రనీల్, మీడియా కోఆర్డినేటర్ శశి, డిప్యూటీ ఆనంద్, మహిళా సమన్వయకర్త ప్రత్యూష తదితరులు సహకరించారు.






కామెంట్‌లు (0)