భారత్ మద్దతిస్తూ శాన్‌ఫ్రాన్సిస్కో డిక్లరేషన్‌పై సంతకం
చిప్‌లు, కీలక ఖనిజాల రంగాల్లో భాగస్వామ్యం
న్యూఢిల్లీ : కృత్రిమ మేధ (ఏఐ), సెమీకండక్టర్లు, కీలక ఖనిజాల సరఫరా చెయి న్‌లో అమెరికా ఆధిపత్యం చెలాయించడానికి చేస్తోన్న ప్రయత్నాలకు భారత్ మద్దతును ప్రకటించింది. ముఖ్యంగా ఈ రంగంలో కీలకం గా ఉన్న చైనాను ఒంటరి చేయడానికి వీలుగా రూపొందించిన ‘శాన్‌ఫ్రాన్సిస్కో డిక్లరేషన్ ఆన్ ది సెక్యూర్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎండ్యూరింగ్ ప్రాస్పెరిటీ’పై భారత్ సహా పది దేశాలు సంతకాలు చేశాయి. ఇది భారత్‌కు నష్టాన్ని చేయనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యూఎస్ తాను ఆధిపత్యం కోసం చేస్తోన్న కుట్ర అని పేర్కొంటున్నారు. అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, జపాన్, దక్షిణ కొరియా, ఖతార్, సింగపూర్, యూఏఈ, బ్రిటన్ ఈ ఒప్పందంలో భాగస్వాములయ్యాయి. నవంబర్ 15న జరిగిన ఈ పరిణామం ద్వారా ఎఐ రంగానికి అవసరమైన చిప్‌లు, సాఫ్ట్‌వేర్, ముడిసరుకులు, రవాణా, ఇంధన మౌలిక సదుపాయాల భద్రతకు ఉమ్మడి కార్యాచరణ చేపట్టాలని ఆయా దేశాలు నిర్ణయించాయి.
ఈ ఒప్పందం అమెరికా నేతృత్వంలోని ‘పాక్స్ సిలికా’ కార్యక్రమంలో భాగంగా కుదిరింది. కాగా.. భారత్ 2026 ఫిబ్రవరి 20నే పాక్స్ సిలికా ప్రకటనపై సంతకం చేసి భాగస్వామిగా చేరింది. ఆదివారం కుదిరిన శాన్‌ఫ్రాన్సిస్కో డిక్లరేషన్ ఆ కార్యక్రమానికి మరింత కార్యాచరణ రూపాన్ని ఇచ్చింది. సున్నితమైన సాంకేతిక పరిజ్ఞానాలు, కీలక మౌలిక సదుపాయాల గుర్తింపు, సరఫరా గొలుసుల పరస్పర సహకారం, భద్రత, పెట్టుబడులకు అనువైన కేంద్రాల అభివృద్ధి వంటి అంశాలపై ఐదు వర్కింగ్ గ్రూపులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.ఈ డిక్లరేషన్‌లో చైనా పేరును నేరుగా ప్రస్తావించకపోయినా కీలక సాంకేతిక రంగాల్లో ఆ దేశాన్ని ఎదుర్కోవడానికి చేస్తోన్న చర్యగా తెలుస్తోంది. అయితే ఈ భాగస్వామ్యంతో అనేక సవాళ్లు ముడిపడి ఉన్నాయి. భారత ఎలక్ట్రానిక్స్, టెలికాం, ఇతర తయారీ రంగాలు చైనా నుంచి వచ్చే ముడిసరుకులు, విడిభాగాలపై ఇప్పటికీ ఆధారపడుతున్నాయి.
ప్రత్యామ్నాయ సరఫరా వ్యవస్థలు పూర్తిస్థాయిలో సిద్ధం కాకముందే చైనా దిగుమతులను తగ్గించాల్సి వస్తే పరిశ్రమలకు ముడిసరుకుల కొరత, ఉత్పత్తి వ్యయాల పెరుగుదల ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఇది వినియోగదారులపై తీవ్ర భారం మోపడంతో పాటుగా విదేశీ చెల్లింపుల వ్యయం పెరగనుంది. మరోవైపు అమెరికా నేతృత్వంలోని వ్యవస్థలతో భాగస్వామ్యం పెరిగినకొద్దీ కీలక సాంకేతికతల కోసం అమెరికా, దాని మిత్రదేశాలపై ఆధారపడే పరిస్థితి ఏర్పడవచ్చు. ఒప్పందంలో భాగస్వామ్యం ఉన్నంత మాత్రాన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం బదిలీ అవుతుందన్న హామీ లేకపోవడం గమనార్హం. పెట్టుబడులు, సాంకేతిక సహకారం, దేశీయ తయారీ సామర్థ్యం పెరుగుదల రూపంలో భారత్‌కు ఎంత ప్రయోజనం చేకూరుతుందనేది స్పష్టత లేకపోవడం ఆందోళకరం.







కామెంట్‌లు (0)