ఔను.. కలిసిపోతున్నారు..

– చిన్న చిన్న అంశాలకే దంపతుల మధ్య మనస్పర్ధలు, గొడవలు
– వేధిస్తున్నారంటూ మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదులు
– దంపతులకు కౌన్సెలింగ్‌..
– ఒక్కటవుతున్న భార్యాభర్తలు..
నవతెలంగాణ-చైతన్యపురి
క్షణికావేశంలో దంపతుల మధ్యమనస్పర్థలు.. తగాదాలు ఒకరి పై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ ఉన్న కుటుంబాలను ఒక్కటి చేయడమే లక్ష్యంగా సరూర్‌ నగర్‌ మహిళా పోలీసులు కషి చేస్తున్నారు. రామకృష్ణాపురానికి చెందిన ఓ యువ జంట మధ్య మనస్పర్థలు తలెత్తాయి. అది కాస్తా పెరిగి పెద్దదై చివరకు విడాకుల వరకు వెళ్లింది. ఇరువురు సరూర్‌ నగర్‌ మహిళా పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు దంపతులిద్దరిని కూర్చోబెట్టి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. శాశ్వతంగా విడిపోదామనుకున్న వారు ఒక్కటవు తున్నారు. హస్తినాపురానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ దంప తులు. పిల్లల పెంపకం విషయంలో ఇద్దరు గొడవపడ్డారు. పెద్దలు నచ్చజెప్పినా వినిపించుకోలేదు. శాశ్వతంగా విడిపోయేందుకు నిర్ణయించుకున్నారు. భర్త వేధిస్తున్నాడని భార్య… కాదు భార్యే తనను వేధి స్తుందని భర్త ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసు కున్నారు. పోలీసులు ఇద్దరిని కూర్చోబెట్టి ఒకటికి రెండుసార్లు కౌన్సిలింగ్‌ ఇవ్వడంతో ఒక్కటయ్యారు. ఇలా ఒకటి కాదు… రెండు కాదు ఏకంగా 1799 జంటలను కలిపారు.
2649 ఫిర్యాదులు..
అదనపు కట్నం కోసం, పిల్లల పెంపకంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు, సంపాదన లేదని, మందు తాగుతున్నాడని.. ఇలా వివిధ కారణాలతో ఘర్షణ పడుతున్నారు. వేద మంత్రాల సాక్షిగా ఒక్కటైన యువ జంటలు చిన్న చిన్న అంశాలను పెద్దగా భావించి ఎడబాటును కొని తెచ్చుకుంటున్నారు. కక్ష్యసాధింపు చర్యల్లో భాగంగా ఒకరిపై మరొకరు కేసులు నమోదు చేసుకుంటున్నారు. ఇలా ఈ ఏడాది 2023లో 2649 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఎఫ్‌ఎస్‌ఐఆర్‌కు ముందే పోలీసులు వారికి కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు.విడిపోదామనుకున్న వారు కౌన్సెలింగ్‌ తో మనసు మార్చుకుంటున్నారు. ఇలా 2023 ఏడాదిలో 1799 జంటలు ఒక్కటయ్యారంటే ఆశ్చర్యం వేయకమానదు.
సహనం కావాలి…
రోజుకు 10-15 యువ దంపతుల నుంచి ఫిర్యాదులు వస్తుంటాయి. సంసారంలో సహనం లేక వివాహమైన రెండు మూడేండ్లకే గొడవప డుతుంటారు. ఒకరిని ఒకరు అర్థం చేసుకోక క్షణికా వేశంలో జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఆగ్రహంగా వచ్చిన వారికి కూడా నచ్చజెప్పడంతో 70 శాతం జంటలు ఒక్కటై వెళ్తుంటారు. కౌన్సిలింగ్‌ ఇచ్చినా మొండిగా వ్యవహరించే వారిపైనే ఎఫ్‌ఎస్‌ఐఆర్‌ నమోదు చేస్తాం. సాధ్యమైనంత వరకు జంటలను కలిపేం దుకే కుటుంబసభ్యులను స్టేషన్‌కు పిలిపిస్తుంటాం.
– పి.సురేఖ,సరూర్‌ నగర్‌,
సీఐ,మహిళా పోలీస్‌ స్టేషన్‌.

Spread the love