– మోడీకి చిదరబరం కౌంటర్
చెన్నయ్ : తమిళనాడుకు గత యుపిఎ ప్రభుత్వం కంటే ఎక్కువ నిధులు ఇస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకులు పి.చిదంబరం ఖండించారు. స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) పెరిగినప్పుడు ఖర్చులు, కేటాయింపులు కూడా పెరుగుతాయని, ఈ విషయం ఆర్థిక శాస్త్ర విద్యార్థులను అడిగినా చెబుతారని, ఈ మాత్రం కూడా ప్రధానికి తెలియదా అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ‘గతం కంటే మీ వయసు కూడా పెరిగింది. నిధులు పెంచామనడం కాదు..దేశ జిడిపిలో ఎంత శాతం కేటాయించారనేది ముఖ్యం’ అని ఆయన పేర్కొన్నారు. ‘ప్రధానితో సహా కేంద్రమంత్రులు 2004-14తో పోలిస్తే.. 2014-24 మధ్య కాలంలో తమిళనాడుకు అధికంగా నిధులు ఇచ్చామని పదే పదే చెబుతున్నారు. రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టుల కోసం గతంలో కంటే ఏడు రెట్లు నిధులు పెంచామని ప్రధాని చెప్పారు. ఫస్టియర్ ఎకానమీ విద్యార్థిని అడగండి. ‘ఎకానమీ మ్యాట్రిక్’ ఎప్పుడూ గతేడాది కంటే ఎక్కువగానే ఉంటుందని చెబుతారు. జిడిపి గతంలో కంటే ఇప్పుడు పెరిగింది. కేంద్ర బడ్జెట్ మొత్తం మునుపటి కంటే పెరుగుతుంది. ప్రభుత్వ మొత్తం ఖర్చూలూ అంతే. మీ వయసు కూడా గతేడాది కంటే పెరిగింది. అంకెల పరంగా ఆ సంఖ్య పెద్దగానే కనిపించి ఉండొచ్చు. అంతేకానీ, జిడిపి పరంగా లేదా మొత్తం వ్యయ నిష్పత్తి పరంగా అది ఎక్కువగా ఉందా?’ అని చిదంబరం సోషల్ మీడియాలో ప్రశ్నించారు. రామేశ్వరంలో పాంబన్ వంతెనను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ తమిళనాడుకు కేంద్రం గతంలో కంటే నిధులు పెంచినప్పటికీ.. కొందరు నిరాశే వ్యక్తం చేస్తున్నారంటూ ఆరోపించారు.